అడిగేవారు లేరని..
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:37 PM
పట్టణంలోని అనేక చెరువులు ఎన్నో ఏళ్లుగా కబ్జాకు గురవుతున్నాయి.
- దర్జాగా చెరువుల కబ్జా
- ఆపై రిజిస్ట్రేషన్లు.. నిర్మాణాలు
- గత ప్రభుత్వంలో మున్సిపల్ తీర్మానంతో సీసీ రోడ్డు ఏర్పాటు
- ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
-ఇప్పటికే పలువురికి నోటిసులు
సాలూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అనేక చెరువులు ఎన్నో ఏళ్లుగా కబ్జాకు గురవుతున్నాయి. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. చివరకు పొలాలకు సాగునీరు అందించే చెరువులు, కాలువలను కూడా అక్రమార్కులు వదలడం లేదు. ఆక్రమించడం.. అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేయడం.. ఆపై నిర్మాణాలు చేపట్టడం పరిపాటిగా మారింది. ఈ రోజు కనిపించిన చెరువు మరుసటి రోజు కనిపించడం లేదు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా రు. పైగా గత ప్రభుత్వంలో చెరువులను కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్న వారి సౌకర్యార్ధం ఏకంగా మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి సీసీ రోడ్డు కూడా వేసేసింది.
ఇదీ పరిస్థితి..
పట్టణ నడిబొడ్డున సర్వే నెంబర్ 161/1బీలో ఉన్న రాణి అగ్రహారం చెరువు 1.80 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. వేద సమాజం వీధిలో ఉన్న ఈ చెరువుకు చెందిన 80 సెంట్ల స్థలంలో గతంలో ప్రభుత్వ పశువుల ఆసుపత్రిని నిర్మించారు. మిగిలిన సుమారు ఎకరా చెరువు గర్భాన్ని పట్టణానికి చెందిన కొంతమంది పెద్దలు కబ్జా చేసి చదును చేశారు. అనంతరం అమ్మకానికి పెట్టారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అదే విధంగా పట్టణంలో ఉన్న అతి పెద్ద చెరువు పేరసాగరం కూడా ఆక్రమణకు గురవుతోంది. దీని విస్తీర్ణం సుమారు వంద ఎకరాలు ఉంటుందని రైతులు చెబుతున్నారు. వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ చెరువుని ఆనుకొని ఉన్న స్థలాలు నిత్యం కబ్జాకు గురవుతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పేరసాగరం చెరువు స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న వారికోసం మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి సీసీ రోడ్డును నిర్మించింది. దీనిబట్టి గతంలో అధికారులు, పాలకుల పనితీరు ఎలాఉండేదో అర్ధమవుతుంది.
కలెక్టర్‌కు నివేదిక..
చెరువుల ఆక్రమణపై పట్టణంలో ఉంటున్న ఓ న్యాయవాదితో పాటు ఓ రాజకీయ పార్టీ నాయకుడు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో కొద్ది రోజుల కిందట విద్యుత్ శాఖ ఎస్‌ఈ త్రినాథరావు విచారణ చేపట్టారు. అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్‌లపై విచారణ జరిపారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారో కలెక్టర్‌కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారందరికీ నోటీసులు ఇస్తారా? లేక కొందరికే ఇచ్చి మమా అంటారో వేచి చూడాల్సిందే.
ఉపేక్షించేది లేదు
పేరసాగరంతో పాటు అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. వాటిలో కొందరు నిరుపేదలు ఉన్నారని తెలిసింది. వారిలో అర్హులను గుర్తించి ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తాం. చెరువులను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదు. పేరసాగరంతో పాటు పట్టణంలో ఉన్న అన్ని చెరువులపై అధికారులు దృష్టి పెట్టాలి.
-గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి
నోటీసులు ఇస్తున్నాం..
అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్ పొందిన వారికి నోటీసులు ఇస్తున్నాం. ఈ విషయం ఇప్పటికే జిల్లా ఉన్నతాఽధికారుల దృష్టిలో ఉంది.
ప్రసన్నకుమార్,విద్యుత్ ఏడీ,సాలూరు.