Share News

Thinking it would go well...సాగే బాగు అని..

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:03 AM

Thinking it would go well... చదువులు పూర్తవగానే అందరిలా వారు ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదు. వారికి నచ్చిన వ్యవసాయ రంగాన్నే నమ్ముకున్నారు. సేంద్రియ పద్ధతుల్లో వివిధ పంటలతో పాటు కూరగాయలు సాగు చేపట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశవాళీ విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా రూ.లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధి కోసం వలసలు పోకుండా స్థానికంగా ఉండే అవకాశాలను అందిపుచ్చుకుని ఔరా అనిపిస్తున్నారు

Thinking it would go well...సాగే బాగు అని..
సేంద్రీయ సాగు పంట పొలంలో యువ రైతు పొదిలాపు శ్రీనాథ్‌

సాగే బాగు అని..

వ్యవసాయంలో రాణిస్తున్న యువత

పలు రకాల పంటలతో లాభాలు

ప్రతిఏటా రూ.లక్షల్లో ఆదాయం

నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం

రాజాం/సీతంపేట, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): చదువులు పూర్తవగానే అందరిలా వారు ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదు. వారికి నచ్చిన వ్యవసాయ రంగాన్నే నమ్ముకున్నారు. సేంద్రియ పద్ధతుల్లో వివిధ పంటలతో పాటు కూరగాయలు సాగు చేపట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశవాళీ విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా రూ.లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధి కోసం వలసలు పోకుండా స్థానికంగా ఉండే అవకాశాలను అందిపుచ్చుకుని ఔరా అనిపిస్తున్నారు ఆ యువకులు. బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసినా..

వ్యవసాయం చేస్తూ విత్తనాలు, ఎరువు తయారీ

కంచరాం గ్రామానికి చెందిన శ్రీనాథ్‌ది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఎంఏ బీఈడీ పూర్తిచేశారు కానీ తన ఆసక్తి అంతా వ్యవసాయంపైనే. ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఎవరూ ప్రోత్సాహం అందించకపోవడంతో నిరాశ పడ్డాడు. ఆ సమయంలో పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ సాగు విధానాల గురించి పేపర్‌లో చదివాడు. ఎంతగానో ఆకర్షితుడై సహజ సిద్ధమైన సేంద్రియ విధానంలో సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.

తనకున్న 10 ఎకరాల పొలంలో సాగు మొదలుపెట్టాడు. విత్తనాలు తానే తయారు చేస్తున్నాడు. 50 రకాల దేశవాళీ విత్తనాలను తన క్షేత్రంలోనే పెంచి నాటుకుంటున్నాడు. పైగా ఏడాదికి 3 నుంచి 4 టన్నుల వరి విత్తనాలను రైతులకు విక్రయిస్తుండడం విశేషం. కషాయాలతో ఎరువు, పశువులపేడతో ప్రత్యేకంగా తయారు చేసిన ఎరువును వినియోగిస్తున్నాడు. ఎకరా వరికి రూ.20 వేల వరకూ ఖర్చుచేస్తున్నాడు. 20 బస్తాలు (80 కిలోలు) దిగుబడి సాధిస్తున్నాడు. ఇలా సహజసిద్ధంగా పండించే వరికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉందని చెబుతున్నాడు. బస్తా ధాన్యాన్ని రూ.2800 వరకూ విక్రయిస్తుంటాడు. కేవలం వరి మాత్రమే కాదు. తన క్షేత్రంలో అరటి, అపరాలు, నువ్వులు, వేరుశనగ, ఇంటి అవసరాల కోసం కూరగాయలు, పండ్లు కూడా పండిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలోనే ఔత్సాహిక రైతుగా గుర్తింపు పొందాడు. అందుకే వ్యవసాయ శాఖ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా..ప్రకృతి వ్యవసాయంపై ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా పొదిలాపు శ్రీనాథ్‌కు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది.

వ్యవసాయమే ముద్దు

నేను గ్రాడ్యూయేషన్‌.. ఆపై ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశాను. ఎన్నో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వ్యాపార భాగస్వామ్య అవకాశాలు వచ్చాయి. కానీ నాకు వ్యవసాయమే ముద్దు అనిపించింది. ఈ రంగంలో భిన్నంగా వెళ్లాలన్న తలంపుతోనే ప్రకృతి సాగు చేపట్టాను. గిట్టుబాటు బాగుంది. ఎంతో సంతృప్తి కలుగుతోంది. పది మంది వరకూ ఉపాధి కల్పించగలుగుతున్నాను. మనసు నిత్యం ప్రశాంతంగా ఉంటుంది.

- పొదిలాపు శ్రీనాథ్‌, ప్రకృతి సాగుదారుడు, కంచరాం

మన్యంలో గిరిజన రైతులు

కాయగూరలు, ఆకుకూరలు పండిస్తూ..

వాణిజ్య పంటలతో లాభాలు ఆర్జిస్తూ

- ఆరిక రవీంద్ర(జైవిక్‌ అవార్డు గ్రహీత)

సీతంపేట మన్యంలో దుగ్గి గ్రామానికి చెందిన ఆరిక రవీంద్ర అనే గిరిజన యువకుడు వ్యవ సాయ రంగంలో రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సౌత్‌జోన్‌లో ఉత్తమ రైతుగా ప్రథమ స్థానంలో నిలిచి.. గత ఏడాది నేషనల్‌ జైవిక్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. రూ. లక్ష బహుమతిని కూడా అందుకున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న ఈ యువకుడు ఉద్యోగా వకాశాల కోసం పరిగెత్తకుండా.. తనకున్న ఐదెకరాల భూమిని నమ్ముకుని సాగు చేపట్టాడు. గత ఏడాది రవీంద్ర తండ్రి ఆరిక పాపయ్య రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అప్పటి నుంచి అన్ని తానై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తన ఇద్దరి తమ్ముళ్లను చదివిస్తున్నాడు. తనకున్న భూమిలో.. రెండెకరాల్లో పాడి(వరి), మిగిలిన మూడెకరాల్లో 15రకాల ఆకుకూరలు, కాయ గూరలతో పాటు సీతాఫలం, మామిడి, డ్రాగన్‌ ఫ్రూట్‌, పైనాపిల్‌, అల్లం వంటి వాటిని పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పంటలను సమీపంలో ఉన్న గిరిజన గ్రామాల్లో విక్ర యిస్తూ.. ఏడాదికి రూ.3.50లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. ఏ రంగంలోనైనా ఇష్టపడి కష్టపడితే రాణించొచ్చని ఆ యువకుడు చెబుతున్నాడు.

- బిడ్డిక గంగారావు(జైపురం)

జైపురం గ్రామానికి చెందిన బిడ్డిక గంగారావు అనే గిరిజన యువకుడు కూడా వ్యవ సాయాన్ని నమ్ముకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న గంగారావు ఎన్‌జీవోల సహకారంతో వ్యవసాయం రంగంపై ప్రత్యేక దృష్టి సారించాడు. తమకున్న రెండు ఎకరాల భూమిలో వరి, వేరుశనగ, మొక్కజొన్న, మిరప, బెండకాయలు వంటి వాటిని సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నాడు. డిమాండ్‌కు తగ్గ ధర వస్తేనే వారపుసంతల్లో విక్రయిస్తామని, లేకుంటే సమీపంలో ఉన్న గిరిజన గ్రామాల్లో పంటలను అమ్ముతామని గంగాధర్‌ తెలిపాడు. మొత్తంగా ఏడాదికి ఖర్చులన్నీ పోను రూ.1.50లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నట్లు వెల్లడించాడు.

Updated Date - Aug 12 , 2026 | 12:03 AM