Share News

Near Makkuva మక్కువ సమీపంలోకి వచ్చేశాయ్‌!

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:08 AM

They’ve Arrived Near Makkuva మక్కువ మండలంలో పంట పొలాలు, తోటల్లో కొద్దిరోజులుగా తిష్ట వేసిన ఏనుగులు జనావాసాల్లోకి వచ్చాయి. దీంతో వాటిని చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు. సోమవారం మార్కొండపుట్టి, మర్రివానివలస గ్రామాల్లో సంచరించిన గజరాజులు మంగళవారం ఉదయం మక్కువ సువర్ణముఖినది సమీపంలోని వంతెనపై హల్‌చల్‌ చేశాయి.

  Near Makkuva మక్కువ సమీపంలోకి  వచ్చేశాయ్‌!
మక్కువ సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు

  • వాటిని చూసేందుకు ఎగబడిన గ్రామస్థులు

మక్కువ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలంలో పంట పొలాలు, తోటల్లో కొద్దిరోజులుగా తిష్ట వేసిన ఏనుగులు జనావాసాల్లోకి వచ్చాయి. దీంతో వాటిని చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు. సోమవారం మార్కొండపుట్టి, మర్రివానివలస గ్రామాల్లో సంచరించిన గజరాజులు మంగళవారం ఉదయం మక్కువ సువర్ణముఖినది సమీపంలోని వంతెనపై హల్‌చల్‌ చేశాయి. వాహనాలు, ప్రజలు తిరిగే రద్దీ ప్రదేశంలో అవి కనిపించడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. మరికొందరు మాత్రం ఏనుగులను చూసేందుకు గుంపుగా ఆ ప్రాంతానికి తరలివచ్చారు. మధ్యాహ్నం 2గంటల వరకు అవి అక్కడే ఉండడంతో చిన్న, పెద్ద అని తేడా లేకుండా గ్రామస్థులంతా అక్కడకు చేరుకున్నారు. వంతెనపై నుంచి ఏనుగులు దుగ్గేరు రోడ్డులోని పొలాల్లోకి చేరాయి. ఒక దశలో మక్కువ గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. కొంతమంది గ్రామస్థులు భారీ శబ్దాలతో వాటి దారి మళ్లించేలా చేశారు. దీంతో ఏనుగులు డబ్బూరివలస, శాంతేశ్వరం శివాలయం కొండపైకి చేరుకున్నాయి. సాయంత్రం 6గంటలకు శాంతేశ్వరం గ్రామం సమీపంలోని తోటలు, పొలాల్లో తిష్ట వేశాయి. డబ్బూరివలస, కొండబుచ్చింపేట, శాంతేశ్వరం, మక్కువ గ్రామాల్లో వరి, పామాయిల్‌, అరటిపంటలకు నష్టం వాటిల్లిందని ఆయా గ్రామాల రైతులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాకర్స్‌తో పాటు అటవీశాఖ బీట్‌ ఆఫీసర్లు, మక్కువ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:08 AM