కూలుతున్నాయ్!
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:28 PM
ఈదురుగాలులు వీస్తే చాలు జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది.
- ఈదురుగాలులకు పడిపోతున్న విద్యుత్ స్తంభాలు
- గత నెలలో 78 విరిగిపోయిన వైనం
- ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
- స్తంభాల నాణ్యతపై సందేహాలు
జియ్యమ్మవలస, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఈదురుగాలులు వీస్తే చాలు జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. గాలుల ధాటికి గ్రామాలు, పట్టణాలు, పొలాల్లో ఉన్న చాలా విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. కొన్నిస్తంభాలు పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో ఎవరికి ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్నిసార్లు చిన్నపాటి గాలులకే విద్యుత్ స్తంభాలు విరిగిపోతుండడంతో వాటి తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని అన్ని పంచాయతీల పరిధిలో 36 విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 2 లక్షలకు పైగా విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. పార్వతీపురం డివిజన్ పరిధిలో 1,50,907 గృహ విద్యుత్ కనెక్షన్లు, 15,100 వ్యవసాయ, 378 పరిశ్రమ, 13,147 వాణిజ్య, 4,818 ఇతర కనెక్షన్లు కలిపి మొత్తం 1,84,350 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. పాలకొండ డివిజన్ పరిధిలో 1,04,225 గృహ కనెక్షన్లు, 5,172 వ్యవసాయ, 138 పరిశ్రమ, 8,137 వాణిజ్య, 4,850 ఇతర కనెక్షన్లు కలిపి మొత్తం 1,22,522 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కొత్త విద్యుత్ స్తంభాలను వేసేటప్పుడు భూమిలో ఆరు అడుగుల గొయ్యి తవ్వి వాటిని పాతి కాంక్రీట్ వేయాల్సి ఉంది. కానీ, చాలాచోట్ల ఈ విధంగా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈదురుగాలులకు అవి కూలుతున్నాయి. కొన్ని విద్యుత్ స్తంభాలు మధ్యలోకి విరిగిపోతుండడంతో వాటి నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 23, 26 తేదీల్లో జిల్లాలో వీచిన ఈదురు గాలులకు ఏకంగా 78 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల పక్కకు ఒరిగిపోయాయి. మరికొన్ని చోట్ల ఇళ్లు, దుకాణాలు వంటి వాటిపై పడడంతో నష్టం వాటిల్లింది. వీటి పునరుద్ధరణకు మొత్తం రూ.15 లక్షలు ఖర్చయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
కొన్ని ఘటనలు..
- గత నెల 26న జియ్యమ్మవలస మండలం చినమేరంగి దళితవాడకు చెందిన పట్లాసింగి రాంబాబు (34) ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వస్తుండగా ఈదురు గాలులకు విద్యుత్ స్తంభం విరిగిపడి ఆయనపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- గత నెల 26న ఇదే మండలం తాళ్లడుమ్మ పంచాయతీ కేంద్రంలో కేవలం వంద మీటర్ల పరిధిలో 4 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఒక విద్యుత్ స్తంభం కింద పది మంది కూర్చొని మాట్లాడుతుండగా అది విరిగిపోయింది. కానీ అక్కడ పందిరికి సంబంధించిన ఐరన్ రాడ్లు ఉండటంతో దానిపై ఆ స్తంభం పడడంతో వారంతా భయంతో పరుగులు తీశారు. ఆ పందిరి లేకపోతే వారంతా ప్రమాదానికి గురయ్యేవారని సమీపంలో ఉన్నవారు చెబుతున్నారు.
-చాలాచోట్ల రోడ్ల పక్కన విద్యుత్ తీగల కిందే మొక్కలు నాటుతున్నారు. ఈ మొక్కలు పెరిగి పెద్దవైన తరువాత వాటి కొమ్మలు తీగలపై పడి ప్రమాదాలకు స్వాగతిస్తున్నాయి. దీనిపై విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రక ృతి విళయం.. ఏమీ చేయలేం
విద్యుత్ స్తంభాల్లో 9.1 రకానికి చెందినవి మాత్రమే కొన్ని చోట్ల విరిగిపోతున్నాయి. అవి చాలావరకు పాత విద్యుత్ స్తంభాలు. చెట్లు విద్యుత్ వైర్లపై పడినప్పుడే ఇలా జరుగుతుంటుంది. ఇది ప్రకృతి విలయం. మేము ఏమీ చేయలేం. కానీ సకాలంలో విద్యుత్ పునరుద్ధరణకు శాయశక్తులా కృషి చేస్తున్నాం.
-పురుషోత్తం, విద్యుత్‌శాఖ ఈఈ (టెక్నికల్), పార్వతీపురం మన్యం జిల్లా