Share News

Remove the ‘Belt’!అటు చూడరు.. ‘బెల్టు’ తీయరు!

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:50 PM

They Won’t Look That Way… Nor Remove the ‘Belt’! జిల్లాలో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే బెల్టు షాపులు కనిపిస్తున్నా.. చర్యలు శూన్యం. పల్లెల్లో వేలం పాటల ద్వారా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు షాపులకు మద్యం షాపుల నుంచే మద్యం సీసాలు సరఫరా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు నిబంధనలు గాలిలో కలిపేసి బెల్టు దుకాణ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా విక్రయాలు చేపడుతున్నారు.

 Remove the ‘Belt’!అటు చూడరు.. ‘బెల్టు’ తీయరు!
పాచిపెంట మండలంలోని ఓ బెల్ట్‌షాపు వద్ద మద్యం తాగుతున్న మందుబాబులు

  • పలు గ్రామాల్లో వేలం పాట ద్వారా బెల్టు షాపుల ఏర్పాటు

  • క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు

  • మద్యం దుకాణాల నుంచే ‘బెల్టు’కు బాటిళ్ల సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు

  • చోద్యం చూస్తున్న అధికారులు

జిల్లాలో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే బెల్టు షాపులు కనిపిస్తున్నా.. చర్యలు శూన్యం. పల్లెల్లో వేలం పాటల ద్వారా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు షాపులకు మద్యం షాపుల నుంచే మద్యం సీసాలు సరఫరా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు నిబంధనలు గాలిలో కలిపేసి బెల్టు దుకాణ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా విక్రయాలు చేపడుతున్నారు. పలు ప్రాంతాల్లో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.50 వరకూ వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల రహస్యంగా.. మరికొన్నిచోట్ల బహిరంగంగానే విక్రయాలు చేపడుతున్నా.. సంబంధిత అధికారులు అటువైపు చూడడం లేదు. గ్రామాల్లో సారా నియంత్రణ కోసం అక్కడక్కడా కేసులు నమోదు చేస్తున్న వారు.. గొలుసు దుకాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గొలుసు దుకాణాలు నిర్వహిస్తే ‘బెల్టు’ తీస్తామని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినా.. అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మన్యంలో పలు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇదీ పరిస్థితి..

- సాలూరు, ఆగస్టు25(ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణంలోని పలు వార్డుల్లో బెల్టుషాపులు నడుస్తున్నాయి. మండలంలో కూర్మరాజుపేట, దేవుబుచ్చింపేట, బొరబంద, తోణాం, కురుకూటి, సారిక, దండిగాం, కరాసువలస, కొత్తవలస, కందులపదం, మావుడి, కొటిపరువు ఇలా అనేక గ్రామాల్లోనూ బెల్టుషాపులను బహిరంగంగానే నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఎంతోకొంత ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని కొంతమంది వేలంపాట రూపంలో బెల్టు షాపులను దక్కించు కున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మద్యం వ్యాపారులే నేరుగా ‘బెల్టు’కు మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బైక్‌లు, ఆటోల ద్వారా బెల్టుషాపులకు నేరుగా మద్యం సీసాలను చేరవేస్తున్నారు. ఇకపోతే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బెల్టుషాపు నిర్వాహకులు క్వార్టర్‌ బాటిల్‌, బీర్లుపై అదనంగా రూ.50 వరకు మందుబాబుల నుంచి వసూలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీనిపై సాలూరు ఎక్సైజ్‌ సీఐ దాసును వివరణ కోరగా.. ‘ పట్టణం, గ్రామాల్లోనూ బెల్టు షాపులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాటిని నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీకే మద్యం విక్రయించాలి. అధికంగా వసూలు చేస్తే కేసులు నమోదు చే స్తాం.’ అని తెలిపారు.

- పాచిపెంట రూరల్‌: పాచిపెంట మండలంలో కర్రివలస, మంచాడవలస, కందిరివలస, గుంత మామిడివలస, పదచీపురువలస, గురువునాయుడుపేట, మాతుమూరు, గోగాడ వలస, తోటవలస తదితర గ్రామాల్లో సుమారు 40 వరకు బెల్ట్‌షాపులు ఉన్నట్లు సమాచారం. వేలం పాట ద్వారా ఆయా గ్రామాల్లో వాటిని నడిపిస్తున్నారు. పాంచాలి గ్రామంలో ఒకటి, పాచిపెంటలో రెండు మద్యం షాపులు ఉన్నా.. అడుగడుగునా గొలుసు దుకాణాలు కనిపిస్తున్నాయి. బెల్టు నిర్వా హకులు రాత్రి, పగలు అని తేడా లేకుండా మద్యం విక్రయాలు చేపడుతున్నారు. గొలుసు దుకాణాలకు మద్యం షాపుల నుంచే మద్యం సీసాలు సరఫరా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా బెల్టు షాపు నిర్వాహకులు క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తంగా వారి దందా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. మద్యం వ్యాపారులు సిండికేట్‌ కావడంతో అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

- గరుగుబిల్లి: గరుగుబిల్లి మండలంలోని మూడు మద్యం దుకాణాల పరిధిలో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రధాన రహదారులకు ఆనుకుని ‘బెల్టు’ నిర్వహిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. మద్యం షాపుల నుంచే ప్రత్యేక వాహనాల ద్వారా మద్యం సీసాలను ‘బెల్టు’కు తరలిస్తున్నారు. కాగా రావివలస, ఉల్లిభద్ర, గరుగుబిల్లిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు తెరవక ముందే ఆయా షాపుల నుంచి మద్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. పలు బ్రాండ్‌లకు సంబంధించి మద్యం దుకాణాల్లో క్వార్టర్‌ బాటిల్‌కు అదనంగా రూ. 10 వసూలు చేస్తున్నారు. ఇక గ్రామాల్లో బెల్ట్‌షాపుల నిర్వాహకులైతే రూ.50 నుంచి రూ. 70వరకు అదనంగా మందుబాబుల నుంచి వసూలు చేస్తున్నారు. చీప్‌ లిక్కర్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉల్లిభద్ర, గరుగుబిల్లి, ఖడ్గవలస సముదాయం, రావివలస, తదితర ప్రాంతాల్లో 24 గంటలూ మద్యం విక్రయాలు జరుగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడే బెల్టు దుకాణాలు దర్శనమిస్తున్నా.. తక్కువ స్థాయిలోనే బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. కాగా రావివలసలో నిర్వహిస్తున్న మద్యం దుకాణ సిబ్బందిని మందు బాబులు సోమవారం రాత్రి నిలదీశారు. ఎంఆర్‌పీ కంటే రూ. 10 అదనంగా వసూలు చేస్తున్న దుకాణదారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- భామిని: మండల కేంద్రంలో ఒక మద్యం షాపే ఉండడంతో బాలేరు నుంచి బత్తిలి వరకు సుమారు 20 గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు, బడ్డీలు తదితర చోట్ల అక్రమంగా విక్రయాలు జరుగుతున్నా.. ఎక్సైజ్‌ పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇక బత్తిలి మేజర్‌ పంచాయతీల్లో మద్యం షాపు వైదు. మరోవైపు కల్లుగీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపు టెండర్‌కు నోచుకోలేదు. దీంతో బెల్ట్‌షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు.

Updated Date - Aug 25 , 2026 | 11:50 PM