They will take it! తీసుకుంటారట!
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:42 PM
They will take it! గోషాడ గ్రామ సమీపంలో ఉన్న సుమారు వంద ఎకరాల డిపట్టా భూములపై ఓ వ్యక్తి కన్ను పడింది. ఎలాగైనా తక్కువ ధరకు వాటిని చేజెక్కించుకోవాలని వ్యూహం పన్నాడు. భూములను ప్రభుత్వం తీసుకుంటుందని, అక్కడ మినీ స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులకు ఇళ్లు కడుతుందని ప్రచారం మొదలెట్టాడు.
తీసుకుంటారట!
గోషాడ డీపట్టా భూములపై సరికొత్త ప్రచారం
నిజమనుకుని అమ్మేస్తున్న రైతులు
వారం రోజులుగా దళారుల హడావిడి
అమ్మకాలకు చురుగ్గా ఒప్పందాలు
ఎకరం రూ.16 లక్షలు
గోషాడ గ్రామ సమీపంలో ఉన్న సుమారు వంద ఎకరాల డిపట్టా భూములపై ఓ వ్యక్తి కన్ను పడింది. ఎలాగైనా తక్కువ ధరకు వాటిని చేజెక్కించుకోవాలని వ్యూహం పన్నాడు. భూములను ప్రభుత్వం తీసుకుంటుందని, అక్కడ మినీ స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులకు ఇళ్లు కడుతుందని ప్రచారం మొదలెట్టాడు. భయపడిన రైతులు వచ్చిన ధరకు అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు. ఇదే అదనుగా కొందరు దళారులు ప్రవేశించి వారం రోజులుగా హడావిడి చేస్తున్నారు. రైతులతో ఒప్పందాలు కుదుర్చుతున్నారని తెలిసింది. ఆ భూములను చౌక ధరకు కొనేందుకు మరికొందరు కూడా ప్రయత్నిస్తున్నారని సమాచారం.
గుర్ల, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి):
గోషాడ డీపట్టా భూములపై (సర్వే నెంబరు 106 నుంచి 130 వరకు)విశాఖకు చెందిన ఒకరి కన్ను పడింది. ఆ వెంటనే దళారులు తెరపైకి వచ్చి ఎకరం రూ.16 లక్షలు అంటూ ధర నిర్ణయించేశారు. రైతులు అమ్మేలా ఒత్తిడి తెస్తున్నారు. వారికి లేనిపోని మాటలు చెప్పి నమ్మించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి నిరుపేదలు అక్కడ పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం గతంలో వారికి డీపట్టా భూములు అందించింది. ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున సుమారు 40 సంవత్సరాల క్రితం అందజేసింది. ఆ భూముల్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ పేదలంతా కొన్నేళ్ల కిందట ఇందిర క్రాంతి పథకంతో బావులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. భూముల ధరలు పైపైకి ఎగబాకడంతో స్థానిక వ్యక్తుల సహకారంతో విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఇక్కడి డీపట్టా భూములపై కన్నేశాడు. ఈయనతో పాటు ఇంకొంత మంది కూడా తెరపైకి వస్తున్నారు. ఇదే సమయంలో దళారులు కూడా పుట్టుకొచ్చారు. కమీషన్‌పై ఆశతో రైతులతో మాట్లాడుతున్నారు. వారం రోజుల నుంచి ఆ భూముల్లోకి దిగి అడ్వాన్స్ రూపంలో రూ.లక్ష అందజేస్తున్నారు. ఈ వ్యవహారం కొంతమందికి నచ్చకపోవడంతో విషయం బయటకు పొక్కింది. గూడెం, గుర్ల, గోషాడ గ్రామ రైతులకు చెందిన భూములు గోషాడలో ఉన్నాయి. సుమారు పాతికమంది దాటి రైతులు ఆయా భూముల్లో సాగు చేస్తున్నారు. కొత్తగా జరుగుతున్న ప్రచారంతో అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో 98 ఎకరాలు మినీ స్టీల్ ప్లాంట్ నిర్వాసిత రైతులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు భూముల కొనుగోలుదారులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
తహసీల్దార్ ఏమన్నారంటే..
డీపట్టా భూముల అమ్మకం విషయాన్ని తహసీల్దార్ ఆదిలక్ష్మి వద్ద ప్రస్తావించగా భూముల వ్యవహారం తనకు తెలియదని, అవి నిరుపేదలకు ఇచ్చిన డీపట్టాలని, వాటిని సాగుచేసుకుని జీవనం సాగించేందుకు ప్రభుత్వం అందజేసిందన్నారు. క్రయవిక్రయాల సంగతి తన దృష్టికి రాలేదన్నారు.