They were happy now వారికి పండగొచ్చింది
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:15 AM
They were happy now
వారికి పండగొచ్చింది
బంగ్లాదేశ్‌లో ఉన్న మత్స్యకారుల విడుదలకు ఏర్పాట్లు
27న పంపే అవకాశం
ఆనందంలో ఆయా కుటుంబాలు
భోగాపురం, జనవరి20(ఆంధ్రజ్యోతి): అందరూ సంక్రాంతిని ఉత్సాహంగా జరుపుకుంటే వారు ఆ మూడు రోజూలూ నిరాశతో ఉన్నారు. వారింట ఇప్పుడు పండగ వచ్చింది. కాస్త ఆలస్యంగా వచ్చినా అమితానందాన్ని తెచ్చింది. బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారుల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసి వారి కుటుంబ సభ్యుల కళ్లల్లో వెలుగులు విరబూసాయి. ఈనెల 27న మత్స్యకారుల విడుదలకు ఇరుదేశాల ఉన్నతాధికారులు నిర్ణయించారు.
భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మరుపల్లి చిన్న అప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, అప్పలకొండ, పూసపాటిరేగ మండలం తిప్పలవసకు చెందిన నక్కా రమణ, వాసపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్నలు విశాఖ జాలరు పేటలో నివాసముంటున్నారు. ఈ తొమ్మిది మంది మత్స్యకారులు గతేడాది అక్టోబరు 13వ తేదీన చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో వేట సాగిస్తూ సిగ్నల్స్ అందక, వాతావరణం అనుకూలించక అదేనెల 22వ తేదీ వేకువజామున సుమారు 2గంటల సమయంలో బంగ్లాదేశ్ జలాల వైపు వెళ్లిపోయారు. దీంతో వారిని అక్కడి కోస్టుగార్డ్సు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అప్పటినుంచి మత్స్యకారుల విడుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయి. ఎట్టకేలకు ఇరుదేశాల అంగీకారంతో స్థానిక మత్స్యకారులు విడుదలకు మార్గం సుగమం అయింది. బంగ్లాదేశ్‌కు చెందిన మత్స్యకారులను మన ప్రభుత్వం విడుదల చేయడానికి, అక్కడున్న మన మత్స్యకారులను బంగ్లాదేశ్ విడుదల చేయడానికి అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఇరు దేశాల అంగీకారంతో ఈనెల 27వ తేదీన బంగ్లాదేశీయులను కోస్టుగార్డుకు అప్పగించేందుకు అదే రోజు మన మత్స్యకారులను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో మత్స్యకారుల కుటుంబాల్లో సంతోషం నిండిపోయింది. ఇందుకు కృషి చేసిన ప్రభుత్వానికి, నాయకులకు, రాష్ట్ర మెకనైజ్డ్ ఫిసింగ్ బోటు ఆపరేటర్ల యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మత్స్యకార నాయకుడు కొండ్రాజుపాలెంకు చెందిన సూరాడ చిన్నారావు చెప్పారు. దీనిపై కళింగపట్నం, చింతపల్లి మెరైన్ సీఐలు బి.ప్రసాదురావు, బి.వి.జె రాజులను వివరణ కోరగా ఈనెల 27న బంగ్లాదేశ్ మత్స్యకారులను విడుదల చేసి కోస్టుగార్డుకు అప్పగించనున్నామని, అదేరోజు మన మత్స్యకారులు విడుదల కానున్నారని తెలిపారు.