They voted for the alliance కూటమికే ఓటెత్తారు
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:36 AM
They voted for the alliance జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుదారులు విజయదుందుబి మోగించారు. ఇప్పటికే మునిసిపల్, పరిషత్ పోరులో అఖండ విజయాలు దక్కించుకున్న కూటమికి పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయ పరంపర కొనసాగింది.
కూటమికే ఓటెత్తారు
- పల్లెపోరులోనూ వరించిన విజయం
- కూటమి ఖాతాలో అత్యధికంగా పంచాయతీలు
-107 కైవసం
- ఇప్పటికే 32 ఏకగ్రీవం..
- వైసీపీ 63కే పరిమితం..మూడు చోట్ల ఏకగ్రీవం
- మరో మూడు చోట్ల ఇతరులు
- 83.33 శాతం ఓటింగ్ నమోదు
- ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
- పోలింగ్ శాతంలో ఎల్.కోట ప్రథమం
- చివరి స్థానంలో కొత్తవలస
విజయనగరం/ కంటోన్మెంట్, నవంబరు 26 (ఆంరఽధజ్యోతి):
జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుదారులు విజయదుందుబి మోగించారు. ఇప్పటికే మునిసిపల్, పరిషత్ పోరులో అఖండ విజయాలు దక్కించుకున్న కూటమికి పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయ పరంపర కొనసాగింది. పంచాయతీ పోరులో అత్యధిక మంది సర్పంచులుగా కూటమి పార్టీల మద్దతుదారులే గెలవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన 221 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు 139 చోట్ల సర్పంచులయ్యారు. వీటిలో 32 ఏకగ్రీవం అయ్యాయి.
వైసీపీ కేవలం 68 పంచాయతీలకే పరిమితమైంది. ఇందులో మూడు చోట్ల మాత్రమే వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవమయ్యారు. జనసేన మద్దతుదారులు రెండు చోట్ల సర్పంచులయ్యారు. ఇతరులు మూడు చోట్ల సర్పంచులయ్యారు. ఇంకా 11 పంచాయతీల్లో ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కాగా మొదటి విడత పంచాయతీ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 8 మండలాల్లో జరిగిన ఈ పోలింగ్‌లో 83.33 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 221 పంచాయతీలకుగాను 36 ఏకగ్రీవం కాగా మిగిలిన 185 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ అభ్యర్థులుగా 429 మంది బరిలో నిలిచారు. బొబ్బిలి నియోజకవర్గంలో 97 పంచాయతీలకు 932 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎస్.కోట నియోజకవర్గంలోని 88 పంచాయతీలకు 881 కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. 2,74,198 మంది ఓటును వినియోగించుకున్నారు. వీరిలో లక్షా 33 వేల 465 మంది పురుషులు కాగా లక్షా 40 వేల 730 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. అంటే పురుషుల కన్నా దాదాపు 7వేల మంది మహిళలు అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మండలాల వారీగా పోలింగ్ సరళిని చూస్తే ఎల్.కోట మండలంలో అత్యధికంగా పోలింగ్ జరిగింది. అత్యత్పంగా కొత్తవలస మండలంలో నమోదైంది.
- పల్లెపోరుకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల్లో బాధ్యతలను గుర్తుచేశారు. సర్పంచ్‌లే కాదు కిందిస్థాయిలోని వార్డు మెంబర్లకు పడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తామన్నారు. దీంతో వారంతా నిరంతరం జనంలోనే ఉంటున్నారు. మూడు విడతల పంచాయతీ పోరులోనూ వీలైనన్ని స్థానాలు కూటమి ఖాతాలో పడేలా కసరత్తు చేస్తున్నారు. ప్రచారంలో ముందుంటున్నారు. ఈ కారణంగానే మొదటి విడతలో ఎక్కువ మంది సర్పంచులు, వార్డు సభ్యులు కూటమి మద్దతుదారులే గెలిచారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, బేబీనాయన ఏంపీ కలిశెట్టి అప్పనాయుడు సర్పంచ్‌ల విజయానికి కృషిచేశారు. పరిషత్ ఫలితాల మాదిరిగానే ఇప్పుడూ కూటమి ప్రభంజనం కొనసాగేలా ప్రయత్నించారు.
మండలాల వారీగా పోలింగ్ శాతం
1. ఎల్.కోట మండలం 87.65
2. రామభద్రపురం మండలం 87.14
3. వేపాడ మండలం 85.86
4. బాడంగి మండలం 84.40
5. బొబ్బిలి మండలం 82.89
6. తెర్లాం మండలం 82.89
7. ఎస్.కోట మండలం 82.12
8. కొత్తవలస మండలం 78.55
అధినేత నిర్దేశంతో మరింతగా జనంలోకి..
పల్లెపోరుకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల్లో బాధ్యతలను గుర్తుచేశారు. సర్పంచ్‌లే కాదు కిందిస్థాయిలోని వార్డు మెంబర్లకు పడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తామన్నారు. దీంతో వారంతా నిరంతరం జనంలోనే ఉంటున్నారు. మూడు విడతల పంచాయతీ పోరులోనూ వీలైనన్ని స్థానాలు కూటమి ఖాతాలో పడేలా కసరత్తు చేస్తున్నారు. ప్రచారంలో ముందుంటున్నారు. ఈ కారణంగానే మొదటి విడతలో ఎక్కువ మంది సర్పంచులు, వార్డు సభ్యులు కూటమి మద్దతుదారులే గెలిచారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, బేబీనాయన ఏంపీ కలిశెట్టి అప్పనాయుడు సర్పంచ్‌ల విజయానికి కృషిచేశారు. పరిషత్ ఫలితాల మాదిరిగానే ఇప్పుడూ కూటమి ప్రభంజనం కొనసాగేలా ప్రయత్నించారు.
ఓటు విషయంలో ఇరువర్గాల ఘర్షణ
ఇద్దరికి స్వల్ప గాయాలు
బొబ్బిలి రూరల్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మండలం కొండదేవుపల్లి గ్రామంలో ఓటు విషయంలో టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఘర్షణకు దారితీసింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న గ్రామానికి చెందిన ఓ మహిళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారులు పైల రాజేష్, పైల వంశీ, పైల బలరాములు తమకు ఓటు వేయాలని కోరేందుకు ఆమె వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న వైసీపీ మద్దతుదారులు సింహాచలం, గణపతి అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికి గొడవ పెరిగి ఇరువర్గాలూ రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో సింహాచలం, గణపతికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై హెడ్ కానిస్టేబుల్ టి.కాశీరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు, రాజాం మునిసిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ సరళిని కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జేసీ సేతుమాధవన్‌లు వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. పోలింగ్ సజావుగా, పారదర్శకంగా , ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత ఎన్నికల అధికారులకు సూచనలు ఇచ్చారు.
ర్యాలీలు, సంబరాలు చేయొద్దు
ఐజీ గోపీనాథ్ జెట్టి
రామభద్రపురం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజేతలు విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు చేపట్టవద్దని ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. బూసాయవలస పోలింగ్ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పోలీసుశాఖ చేపట్టిన పటిష్ఠ ప్రణాళిక, భద్రతా చర్యల కారణంగా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడరాదని, ప్రత్యర్థులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం చేయవద్దని సూచించారు. ఆయన వెంట ఎస్పీ ఏఆర్.దామోదర్, బొబ్బిలి డీఎస్పీ రాకోటి గోవిందరావు, బొబ్బిలి రూరల్ సీఐ మల్లిఖార్జునరావు ఉన్నారు.