60 శాతం ఇళ్లకే వెళ్లారు..
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:21 AM
: ప్రభుత్వ పనితీరు, చేస్తున్న అభివృద్ధి.. అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెనుకబడ్డారు.
- ఇదీ జిల్లాలో ‘ఇంటింటికీ టీడీపీ’ తీరు
- ప్రజల్లోకి పూర్తిగా వెళ్లని శ్రేణులు
- మిగిలింది మరో ఐదురోజులే
- ఆశించిన లక్ష్యానికి చేరుకునేనా?
విజయనగరం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పనితీరు, చేస్తున్న అభివృద్ధి.. అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెనుకబడ్డారు. ఇప్పటి వరకు కేవలం 60 శాతం ఇళ్లనే సందర్శించారు. ఇంకా కేవలం ఐదు రోజులే మిగిలి ఉండ డంతో శతశాతం లక్ష్యాన్ని చేరుకుంటారనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. రెండున్నర ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే ద్విముఖ లక్ష్యంతో అధిష్ఠానం ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పూర్తిగా డిజిటల్ విధానంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ఏడాది జూలై 25న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 10 వరకూ కొనసాగనుంది. రాష్ట్ర పార్టీ రూపొందించిన కరపత్రంతో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించాలి. ఒక్కొక్క ఇంటి వద్ద మూడు నిమిషాలు ఉండాలి. ఈ కరపత్రంలో ఉన్న అంశాలను గ్రామ, డివిజన్ స్థాయిలో యూనిట్ ఇన్‌చార్జీ, బూత్ ఇన్‌చార్జీలు, టీడీపీ కార్యవర్గ సభ్యులు వివరించాలి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.15 గంటల వరకూ మై టీడీపీ యాప్‌లో వీటిని పొందుపరచాల్సి ఉంటుంది. ఎవరైనా కరపత్రం పట్టుకుని ఫొటో దిగడానికి ఇబ్బంది అయితే, అటువంటి వారికి ‘ఓటీపీ’ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో కరపత్రం పట్టుకుని ఫొటో తీసుకునేందుకు ముందుకు వచ్చినా, కొన్ని ఏరియాల్లో పార్టీ శ్రేణులకు కాస్త ఇబ్బంది ఏర్పడింది. ఓటీపీ ద్వారా, కరపత్రం పట్టుకోవడం ద్వారా రెండు పద్ధతుల్లో చేయడానికి సహకారం లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నట్లు తెలిసింది. దీనిపై ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి స్పష్టత నిస్తూ ముందుకు సాగారు. అయితే, ఇప్పటి వరకూ కేవలం 60 శాతం ఇళ్లనే సందర్శించి ప్రభుత్వ పని తీరును వివరించారు. గడువు సమీపిస్తున్న తరుణంలో ఆశించిన లక్ష్యానికి చేరుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.