పుస్తెలతాళ్లను తెంపుకెళ్లారు
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:07 AM
పార్వతీపురం మన్యం జిల్లా బలిజి పేట మండలం గంగాడ గ్రామానికి చెందిన పొందూరు లక్ష్మి రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం మధ్యాహ్నం బస్సు ఎక్కుతుండగా తన మెడలోని సు మారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును పోగొట్టుకుంది.
రాజాం, ఎస్.కోట మండలాల్లో ఘటనలు
రాజాం రూరల్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా బలిజి పేట మండలం గంగాడ గ్రామానికి చెందిన పొందూరు లక్ష్మి రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం మధ్యాహ్నం బస్సు ఎక్కుతుండగా తన మెడలోని సు మారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును పోగొట్టుకుంది. రాజాంలో కూర గాయలు అమ్ముకునేందుకు నిత్యం వచ్చిపోయే ఆమె సోమవారం కూడా తెచ్చిన కూరగాయలు అమ్ముడయ్యాక ఇంటికి వెళ్లిపోయే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు రద్దీగా ఉండడంతో బస్సు ఎక్కేసమయంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసినట్టు ఆమె పొలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సీసీ ఫుటేజీలను పొలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మాటువేసి..
ఎస్.కోట రూరల్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ముందుగా మాటువేసి, ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని తెంపుకెళ్లిన ఘటన ఉసిరి గ్రామ సమీపం లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఊసిరి గ్రామానికి చెందిన సింగపల్లి కృష్ణమ్మ ఆదివారం ఉదయం జామి మండలం చింతాడ వద్ద ఉన్న తన పొలంలో పనులు ముగించుకుని.. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎస్.కోట మండలం ఉసిరి గ్రామంలో ఉన్న తన ఇంటికి బయలుదేరింది. అప్పటికే ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు కాచుకుని ఉన్నారు. ఉదయం నుంచి వారు అక్క డే ఉండడాన్ని గమనించిన కృష్ణమ్మ ‘బాబూ మీది ఏ ఊరు, ఇక్కడ ఎందుకు ఉన్నార’ని ప్రశ్నించింది. దానికి వారు తమ తమ్ముడిని వేరేవారు హాస్టల్ నుంచి తీసుకొస్తామని చెప్పడంతో ఇక్కడ ఉన్నామని చెప్పారు. అది విని కృష్ణమ్మ కాస్త ముందుకు వెళ్తుండగా ఆ ఇద్దరు యువకులు ఆమె వైపు వచ్చి, పుస్తెలతాడు తెంపుకుని వాహనంపై వెళ్లిపోయారు. వెంటనే ఆమె గ్రామంలోకి వెళ్లి తమ కుటుంబసభ్యులకు తెలియజేసింది. వారంతా వచ్చి చుట్టుపక్కల వెతికినా ఎవ్వ రు కనిపించలేదు. దీంతో వెంటనే ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీఐ నారాయణమూర్తిని వివరణ కోరగా.. ఫిర్యాదు అందిన వెంటనే రెండు బృందాలను పంపి, పరిశీలన చేయించామని, నిందితులను పట్టుకునే ప్రయత్నం ప్రారంభించామని తెలిపారు.