ఆ సంతను మూసేశారు
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:05 AM
జిల్లాలోనే అతి పెద్ద సంతగా పేరుగాంచిన దత్తిరాజేరు మండలం పెదమానాపురం సంత మూతపడింది.
-మార్కెట్ ముసుగులో కబేళాకు మూగజీవాలు
-నిఘా అంతంత మాత్రమే.. చర్యలు ఉండవు
-గ్రీవెన్స్‌లో ఫిర్యాదుతో అధికారుల్లో కదలిక
-పెదమానాపురం సంత తాత్కాలికంగా నిలిపివేత
-జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలు
గజపతినగరం, జూలై 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోనే అతి పెద్ద సంతగా పేరుగాంచిన దత్తిరాజేరు మండలం పెదమానాపురం సంత మూతపడింది. ఈ సంతను తాత్కాలికంగా నిలిపి వేయాలని జిల్లా పంచాయతీ అధికారి డి.మల్లికార్జుననరావు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించి సంతను నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఎంతో కాలంగా జరుగుతున్న పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడినట్లు అయింది. సంతను నిలిపివేయడంపై గో సంరక్షణ సమాఖ్య హర్షం వ్యక్తం చేస్తోంది.
మార్కెట్ ముసుగులో కబేళాలకు..
ప్రతీ శనివారం జరిగే పెదమానాపురం సంతకు జిల్లా నుంచే కాకుండా పార్వతీపురం, ఒడిశా నుంచి వ్యాపారులు, రైతులు వస్తుంటారు. వ్యాపారులు శుక్రవారం సాయంత్రానికే చేరుకుంటారు. మార్కెట్ ముసుగులో రైతుల నుంచి పశువులను కొనుగోలు చేసి వాటిని కబేళాలకు తరలి స్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీసుల కళ్లుగప్పి పశువులను భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు. చిన్న,చిన్న వ్యాన్‌ల్లో క్వింటాల కొద్దీ పశుమాంసాన్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మానాపురం పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో పశువులను వధించి గుట్టుగా మాంసాన్ని విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లోని కోల్డ్‌స్టోరేజ్‌లకు తరలించి, అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. పలుమార్లు తనిఖీల్లో పట్టుబడుతున్నా రవాణా మాత్రం ఆగడంలేదు.
నిఘా ఎక్కడ?
పశువుల సంతపై నిఘా కానరావడం లేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారు లు పట్టించుకోవడం లేదు. వాహనాల్లో ఇతర ప్రాంతాలకు పశువులను తరలిస్తే అధికారుల అనుమతి తీసుకోవాలి. అది కూడా ఒకటి లేదా రెండు పశువులకు మాత్రమే అనుమతి ఉండాలి. గతంలో రెవెన్యూ, పోలీసు, పశువైద్యుడు, పీవోపీఆర్‌డీతో కమిటీ ఉండేది. ఈ కమిటీ పశుఅక్రమ రవాణాపై చర్యలు తీసుకునేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు ఎక్కడా కానరావడంలేదు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో యథేచ్ఛగా కబేళాలకు పశువులు తరలిపోతున్నాయి.
గ్రీవెన్స్‌లో ఫిర్యాదుతో చర్యలు
లైసెన్స్ లేకుండా ప్రతీవారం పెదమానాపురం సంత నుంచి పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని గోసంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిస రామకృష్ణ ఇటీవల కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పశువుల అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి డి.మల్లికార్జునరావు చర్యలకు ఉపక్రమించారు. వారపు సంతను తాత్కాలికంగా నిలిపివేయాలని, పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చిన తరువాతే నిర్వహించాలని దత్తిరాజేరు ఎంపీడీవో ఎస్.తాత, పెదమానాపురం గ్రామ కార్యదర్శి సత్యవతికి ఆదేశాలు జారీ చేశారు.
హర్షనీయం..
లైసెన్స్‌లు లేకుండా వ్యాపారులు పెదమానాపురం సంత నుంచి పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. సంతలో ఎటువంటి మౌలిక వసతులు లేవు. దీనిపై జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాం. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి చర్యలు తీసుకున్నారు. సంతను తాత్కాలికంగా నిలిపివేయాలని దత్తిరాజేరు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం హర్షనీయం.
-లోగిస రామకృష్ణ, రాష్ట్ర అద్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ గోసంరక్షణ సమైఖ్య.
ప్రజలు గమనించాలి..
జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు పెదమానాపురంలో జరిగే శనివారం సంతను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నాం. ప్రజలు దీన్ని గమనించాలి. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే సంత నిర్వహణ జరుగుతుంది. నిబంధనలు అతిక్రమించి సంత నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం.
-ఎస్.తాత, ఎంపీడీవో, దత్తిరాజేరు