Share News

చెక్కులతో సరిపెట్టేశారు!

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:52 PM

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బొబ్బిలి పట్టణ పరిధిలోని రామన్నదొరవలస మునిసిపల్‌ సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కు సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు.

చెక్కులతో సరిపెట్టేశారు!
టిడ్కో డిపాజిట్లదారులకు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన, అధికారులు (ఫైల్‌)

- ‘టిడ్కో’ డిపాజిట్‌దార్లకు వాపసు కాని సొమ్ము

- గత నెలలో చెక్కులు అందించిన ఎమ్మెల్యే

- 42 రోజులు అవుతున్నా ఖాతాల్లో జమకాని నగదు

- తమను మభ్యపెట్టారంటున్న బాధితులు

‘డిపాజిట్లు వాపసు చేయడంలో జాప్యానికి లబ్ధిదారులకు క్షమాపణ చెబుతున్నా. 559మందికి రూ.1.57కోట్లు చెల్లించాలి. తొలివిడతగా 261 మందికి రూ.66.63 లక్షలు విడుదలయ్యాయి. వీరికి చెక్కులు అందిస్తున్నాము. మిగిలిన వారందరికీ వారం, పదిరోజుల్లో అందేలా చర్యలు తీసుకుంటా’

- గత నెల 17న బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో టిడ్కో గృహాల డిపాజిట్ల వాపసు కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబినాయన చేసిన ప్రకటన ఇది. 42 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ వారికి డిపాజిట్‌ సొమ్ము జమ కాలేదు. నగదును వాపసు చేయడానికి ముప్పుతిప్పలు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బొబ్బిలి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బొబ్బిలి పట్టణ పరిధిలోని రామన్నదొరవలస మునిసిపల్‌ సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కు సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇక్కడ 300 చదరపు అడుగుల ఎ.కేటగిరీలో 71 ఇళ్లతో 35 బ్లాకులు, 365 చదరపు అడుగుల బి.కేటగిరీలో 48 ఇళ్లతో ఒక బ్లాకు, 430 చదరపు అడుగుల సి.కేటగిరీలో 144 ఇళ్లతో మూడు బ్లాకుల నిర్మాణాలను అప్పట్లో ప్రారంభించారు. మొత్తం అన్ని కేటగిరీల్లో 1,680 ప్లాట్ల నిర్మాణానికి చర్యలు చేట్టారు. అయితే, 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టింది. 25 శాతం లోపు జరిగిన పనులన్నిటినీ రద్దు చేసింది. ఆ ఐదేళ్లు టిడ్కో ఇళ్ల నిర్మాణం ముందుకు సాగలేదు. డిపాజిట్లు చెల్లించిన వారిలో కొందరికి ఇళ్లు మంజూరు చేయక, సొమ్ము వాపసు చేయకుండా గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. ఆ తప్పిదాలను సరిచేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు సమయం సరిపడలేదా? అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. అయితే, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు డిపాజిట్లు వాపసు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి గత నెల 17న బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో మెప్మా అధికారుల ఆధ్వర్యంలో డిపాజిట్ల వాపసు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన ద్వారా బాధితులకు చెక్కులు ఇప్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డిపాజిట్లు వాపసు చేయడంలో జరిగిన జాప్యానికి క్షమాపణ చెబుతున్నానని, మొత్తం 559మందికి రూ.1.57కోట్లు చెల్లించవలసి ఉండగా.. ప్రస్తుతం తొలివిడతగా 261 మందికి రూ.66.63 లక్షలు విడుదలయ్యాయని, మిగిలిన వారందరికీ వారం పదిరోజుల్లో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేసభలో మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి మాట్లాడుతూ.. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా డిపాజిట్లదారుందరికీ వారి బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేస్తామని చెప్పారు. అయితే, 42 రోజులు కావస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకాలేదు. సొంత ఇంటి కల నెరవేరుతుందన్న ఆశతో తాహతుకు మించి అప్పులు చేసి డిపాజిట్లు చెల్లించామని, ఇల్లు లేదు, డిపాజిట్‌ వాపసు లేదు.. చేసిన అప్పుకు వడ్డీలు చెల్లించుకోలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని కోరుతున్నారు.

అప్పులు చేసి డిపాజిట్లు చెల్లించాం

టిడ్కో ఇళ్ల కోసం వడ్డీకి రుణాలు తీసుకుని మరీ డిపాజిట్లు చెల్లించాం. రెండు విడతలుగా మొత్తం రూ.50 వేలు చెల్లించాం. ఇప్పటికి సుమారు 8 ఏళ్లు కావస్తోంది. మాకు ఇళ్లు లేవు. డిపాజిట్‌ వాపసు చేయలేదు. అప్పులు, వడ్డీల భారం మిగిలింది. బాగా చితికిపోయాం. నానా ఇబ్బందులు పడుతున్నాం. డిపాజిట్లు తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నాం అంటున్నారు. చేతికి అందడం లేదు. మాలాంటి పేదలంతా చాలా అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం కనికరించి మా డబ్బులు మాకు ఇచ్చేయాలని ప్రాథేయపడుతున్నాం.

-పెదపెంకి ఈశ్వరమ్మ, షేక్‌ రహ్మద్‌ బీబీ, బాధితులు, కోరాడవీధి, బొబ్బిలి

చెక్కులను బ్యాంకులకు పంపించాం

టిడ్కో ఇళ్ల డిపాజిట్‌ సొమ్ములను లబ్ధిదారుల అకౌంట్లకు జమచేయాలని కోరుతూ చెక్కులను బ్యాంకులకు పంపించాం. నాలుగైదు రోజుల్లోగా వారందరి అకౌంట్‌లకు డబ్బులు చేరుతాయి. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దశలవారీగా సొమ్ములు వాపసు అవుతాయి. మొదటి విడతగా 261 మందికి రూ. 66 లక్షలు బట్వాడా అయిన వెంటనే మిగిలిన వారందరికీ రెండో విడతలో చెల్లింపులు జరిగిపోతాయి.

-లాలం రామలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌, బొబ్బిలి

Updated Date - Aug 28 , 2026 | 11:52 PM