Share News

They have taken their places కొలువుదీరారు

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:49 PM

They have taken their places విజయనగరం కార్పొరేషన్‌ నూతన పాలకమండలి సోమవారం కొలువుదీరింది. కార్యాలయ సమావేశమందిరంలో కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడి, ఎన్నికల పరిశీలకుడు తేజ్‌భరత్‌ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు మేయర్‌గా అవనాపు భార్గవి తొలుత ప్రమాణ స్వీకారం చేశారు.

They have taken their places కొలువుదీరారు
మేయర్‌ కుర్చీలో అవనాపు భార్గవి

కొలువుదీరారు

మేయర్‌గా ప్రమాణం చేసిన అవనాపు భార్గవి

డిప్యూటీ మేయర్‌గా ప్రసాదుల రజనీ

డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ముందే వాకౌట్‌ చేసిన వైసీపీ కార్పొరేటర్లు

కొత్త పాలకవర్గం రాకతో కార్పొరేషన్‌ కార్యాలయంలో సందడి

విజయనగరం టౌన్‌, నవంబరు23(ఆంధ్రజ్యోతి):

విజయనగరం కార్పొరేషన్‌ నూతన పాలకమండలి సోమవారం కొలువుదీరింది. కార్యాలయ సమావేశమందిరంలో కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడి, ఎన్నికల పరిశీలకుడు తేజ్‌భరత్‌ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు మేయర్‌గా అవనాపు భార్గవి తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 62మంది కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ మేయర్‌గా 25వ డివిజన్‌కు చెందిన ప్రసాదుల రజనీ పేరును సమావేశంలో ప్రస్తావించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మేయర్‌ భార్గవిని ఎమ్మెల్యే పూసపాటి ఆదితిగజపతిరాజుతో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు. నగరవాసులు ఎంతో నమ్మకంతో ఇచ్చిన పదవిని బాధ్యతాయుతంగా నిర్వహించి అటు ప్రభుత్వానికి ఇటు నగరానికి మంచిపేరు తీసుకురావాలని ఆక్షాంక్షించారు. తొలుత నగరంలోని అశోక్‌బంగ్లా నుంచి ఉదయం 8గంటలకు భారీ ర్యాలీగా మేయర్‌ భార్గవి, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ బయలుదేరారు. కూటమి శ్రేణులు అధికంగా హాజరయ్యాయి. మయూరికూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్‌, బాలాజీ కూడలి, సింహాచలం మేడ, కోట కూడలి, మూడు లాంతర్లు మీదుగా కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో పులివేషాలు, డప్పులు వాయిద్యాలు, కోలాటం నృత్యాలు సందడి చేశాయి. ప్రమాణస్వీకారం అనంతరం మేయర్‌ భార్గవి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గడిచిన రెండున్నరేళ్లుగా అందిస్తున్న సుపరిపాలనే తన విజయానికి ప్రధాన కారణమన్నారు. అలాగే నగరంలో గడిచిన రెండేళ్లుగా రూ.550కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన ఎమ్మెల్యే అదితిగజపతిరాజు పనితీరు చూసి నగరవాసులు తనకు పట్టం కట్టారన్నారు. ప్రతి వార్డును అభివృద్ధి చేసి విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యంపై దృష్టి సారిస్తానని, ప్రజల సమస్యలను శతశాతం పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

వైసీపీ కార్పొరేటర్లు డుమ్మా

మేయర్‌, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశాక డిప్యూటీ మేయర్‌ ఎన్నిక చేపట్టే సమయానికి ముందే వైసీపీ కార్పొరేటర్లు 16మంది సమావేశం వాకౌట్‌ చేశారు. అయితే కోరం సరిపోవడంతో కూటమి అభ్యర్థులంతా కలిసి 46మందితో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక చేపట్టారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

--------------------------

నెల్లిమర్ల చైర్మన్‌గా అప్పలనాయుడు

వైస్‌ చైర్మన్‌గా బంగారమ్మ ఎన్నిక

నెల్లిమర్ల, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నగర పంచాయతీ నూతన చైర్మన్‌ లెంక అప్పలనాయుడు అన్నారు. కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం నెల్లిమర్లలో సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అప్పలనాయుడు మాట్లాడుతూ అందరి సహకారంతో నెల్లిమర్ల నగర పంచాయతీని అభివృద్ధి చేస్తానని అన్నారు. నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, పరిష్కారానికి పెద్దల సహకారం తీసుకుంటానని అన్నారు. ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు.

వైస్‌ చైర్‌పర్సన్‌గా బంగారమ్మ

నగర పంచాయతీ వైస్‌ చైర్‌పర్సన్‌గా జరజాపుపేట రెండోవార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాళ్ల బంగారమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల జిల్లా పరిశీలకుడు తేజ్‌ భరత్‌ సమక్షంలో ప్రిసైడింగ్‌ అధికారి ఈ.మురళీ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున బంగార్మమకు బీఫారం జారీ చేయగా 23 ఓట్లకుగానూ 18 ఓట్లు ఆమెకు లభించడంతో వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో కమిషనర్‌ తమ్మినేని గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

-----------------

బొబ్బిలి చైర్‌పర్సన్‌గా రేణుకాదేవి స్వప్న

వైస్‌ చైర్‌పర్సన్‌గా సునీత ఏకగ్రీవం

బొబ్బిలి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి మునిసిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. చైర్‌పర్సన్‌గా రాంబార్కి రేణుకాదేవి స్వప్నతో పాటు 36 మంది కౌన్సిలర్లు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వారందరిచేత ఆర్డీవో జేవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు ప్రిసైడింగ్‌ అధికారి హోదాలో ప్రమాణం చేయించారు. అనంతరం వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించారు. ఈ పదవిని జనసేన అభ్యర్థి, 33 వ వార్డు కౌన్సిలరు రేజేటి సునీతకు కేటాయించడంతో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని టీడీపీ కౌన్సిలర్లు గెంబలి శ్రీనివాసరావు, దిబ్బ సునీత, జనసేన కౌన్సిలరు పైల హరిప్రసాద్‌ తదితరులు ప్రతిపాదించి మద్దతు పలికారు. సునీత ఒక్కరే వైస్‌ చైర్‌పర్సన్‌ పదవికి నామినేషన్‌ వేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి రామ్మోహనరావు ప్రకటించారు.

ఫ పాలకవర్గ సభ్యులంతా ప్రమాణస్వీకారం పూర్తయ్యాక మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రేణుకాదేవి స్వప్నకు అధ్యక్ష పీఠాన్ని ఆర్డీవో, ప్రిసైడింగ్‌ అధికారి జేవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు, మునిసిపల్‌ కమిషనరు లాలం రామలక్ష్మిలు అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా నూతన చైర్‌పర్సన్‌ రేణుకాదేవి స్వప్న మాట్లాడుతూ తనకు ఈ పదవి కట్టబెట్టిన పట్టణ ప్రజలకు, ఎమ్మెల్యే బేబీనాయనకు, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజాహిత పాలన అందించేందుకు కృషి చేస్తానన్నారు. చైర్‌పర్సన్‌ రాంబార్కి రేణుకాదేవి స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ రేజేటి సునీతలను బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మనాయుడు, అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, రాజకీయపార్టీల ప్రతినిధులంతా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Nov 23 , 2026 | 11:49 PM