కొలువుదీరారు ప్రమాణ స్వీకారం చేసిన ప్రాదేశిక సభ్యులు
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:53 AM
మండల పరిషత్ అధ్యక్షులు కొలువుదీరారు.
ప్రమాణ స్వీకారం చేసిన ప్రాదేశిక సభ్యులు
ప్రశాంతంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు
13 స్థానాలను దక్కించుకున్న కూటమి
రెండు చోట్లకే పరిమితమైన వైసీపీ
పార్వతీపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్ అధ్యక్షులు కొలువుదీరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారులు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోని 15 మండలాలకు సంబంధించి ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. తొలుత మండల ప్రాదేశిక సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికను నిర్వహించారు. ఎంపీపీ అభ్యర్థిని ఒక ఎంపీటీసీ ప్రతిపాదించగా, మరొక ఎంపీటీసీ బలపరిచారు. సదరు అభ్యర్థి పేరును రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభ్యులు చేతులెత్తే విధానంలో వారిని ఎన్నుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని మండల పరిషత్ కార్యాలయాలు వద్ద పోలీసులు మోహరించారు. అధికారులు, ఎంపీటీసీ సభ్యులు మినహా ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించలేదు. ఎన్నిక ముగిసిన తరువాత కొన్ని చోట్ల ఎంపీపీలు వారి స్థానాల్లో ఆశీనులై, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం వారు బయటకు రాగానే కార్యకర్తలు ఎంపీపీలను పూలతో ముంచెత్తి మందుగుండు సామాగ్రి పేల్చి సందడి చేశారు. కొన్ని చోట్ల ఎంపీపీతో సహా, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలను భారీ ఊరేగింపుతో తీసుకుని వెళ్లారు. జిల్లాలో 15 మండలాల గాను 12 మండలాల్లో టీడీపీ ఎంపీపీలు, రెండో మండలాల్లో వైసీపీ ఎంపీపీలు, ఒకచోట జనసేన ఎంపీపీ కొలువు దీరారు.
గుమ్మలక్ష్మీపురంలో ఉత్కంఠ...
గుమ్మలక్ష్మీపురం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా టీడీపీకి 7, వైసీపీకి 7 స్థానాలు లభించాయి. వైసీపీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడు హాజరుకాకకపోవడంతో టీడీపీకి చెందిన బిడ్డిక పద్మావతి ఎంపీపీగా, శొంట్యాన రమ్య వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. తమ ఎంపీటీసీ సభ్యుడిని దాచేశారని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ఎన్నిక ముగిసింది.
పాలకొండ ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠ
పాలకొండ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నరాల తెగే ఉత్కంఠ నడుమ పాలకొండ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ సాగింది. కూటమి నాయకుల మధ్య కుం పటి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. మండలం లో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 11 స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుపొందారు. అయితే, టీడీపీ సీనియర్ నాయకుడు కర్నేన అప్పలనాయుడు భార్య కర్నేన యోగితకు ఎంపీపీ పీఠం దక్కేలా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పావులు కదపగా, పాలకొండ మండల టీడీపీ అధ్యక్షుడు గండి రామినాయుడు కోడలు తాడేల గౌతమికి ఎంపీపీ పీఠం వరించేలా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి ప్రత్యేక చొరవ చూపారు. దీంతో కూటమిలోనే రెండు గ్రూప్‌లుగా చీలిపోయి ఎవరికి వారుగా ప్రయత్నాలు చేశారు. టీడీపీ అధిష్ఠానం బుధవారం అర్ధరాత్రి గౌతమికి బీఫారం అందించింది. దీంతో గురువారం ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ మరింత రసకందంలో పడింది. ఈ క్రమంలో జిల్లా జనరల్ ఎన్నికల అబ్జర్వర్ చినరాముడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.వైకుంఠరావు చేతులెత్తే పద్ధతిలో ఎంపీపీ ఎన్నిక చేపట్టారు. గౌతమికి ఆమెతో పాటు మరో ఇద్దరు మద్దతు తెలపగా, యోగితకు ఆమెతో పాటు మరో 8 మంది చేతులెత్తి మద్దతు తెలిపారు. దీంతో ఆమెను ఎంపీపీగా ప్రకటించారు. అలాగే వైస్ ఎంపీపీగా గొర్లె వరలక్ష్మికి 8 మంది చేతులెత్తి మద్దతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో మూడెంచల భద్రత కల్పించారు. సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు నిర్వహించారు.