Share News

they have 69 acres but... 69 ఎకరాలున్నా...

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:44 PM

they have 69 acres but... గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయం అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరు. పండుగ రోజుల్లో వేలాదిగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. స్వామి పేరున ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. 69 ఎకరాలు, ఆరు దుకాణాలు ఆలయ సొంతం. అయినా కూడా కొంతకాలంగా ఆలయ వైభవం తగ్గింది. ఆదాయం లేకపోవడమే ఈ దయనీయతకు కారణం. భూములు, దుకాణాల నుంచి ఆదాయం రావడం లేదు. దీంతో విరాళాలతోనే స్వామికి దీపధూపనైవేద్యాలు అందిస్తున్నారు.

they have 69 acres but... 69 ఎకరాలున్నా...
గజపతినగరంలో సీతారామస్వామి దేవాలయం

69 ఎకరాలున్నా...

విరాళాలతోనే దీపధూపనైవేద్యం

దయనీయంగా సీతారామస్వామి ఆలయం

ఆలయానికి 6 షాపులు

12 ఏళ్లుగా వేళం వేయని వైనం

లక్షలాది రూపాయల ఆదాయానికి గండి

గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయం అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరు. పండుగ రోజుల్లో వేలాదిగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. స్వామి పేరున ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. 69 ఎకరాలు, ఆరు దుకాణాలు ఆలయ సొంతం. అయినా కూడా కొంతకాలంగా ఆలయ వైభవం తగ్గింది. ఆదాయం లేకపోవడమే ఈ దయనీయతకు కారణం. భూములు, దుకాణాల నుంచి ఆదాయం రావడం లేదు. దీంతో విరాళాలతోనే స్వామికి దీపధూపనైవేద్యాలు అందిస్తున్నారు.

గజపతినగరం, మార్చి 31(ఆంధ్రజ్యోతి):

ఎంతో వైభవంగా ఉండే గజపతినగరం సీతారామప్వామి ఆలయం పట్టుతప్పింది. ఏటా జరిగే కల్యాణం కూడా కొన్నాళ్లుగా దాతలే జరిపిస్తున్నారు. నిత్య పూజలు, తీర్థ ప్రసాదాలకూ భక్తుల విరాళాలే ఆధారంగా ఉంటున్నాయి. గతంలో ఏటా ఆలయ భూములకు వేలం పాట నిర్వహించి వచ్చిన ఆదాయంతో దేవాలయానికి ధూప, దీప, నైవైద్యంతో పాటు అర్చలకు జీతాలు చెల్లించేవారు. 11ఏళ్లుగా వేలం వేయకపోవడంతో భూములపై వచ్చే ఆదాయం తగ్గిపోయింది.

సీతారామస్వామి దేవాలయానికి సంబంధించి మండలంలో ఐదు గ్రామాల్లో ఆస్తులున్నాయి. శ్రీరంగరాజపురంలో 49 ఎకరాల 23 సెంట్లు, ఎం.గుమడాంలో 19 ఎకరాల 3సెంట్లు, కనిమెరక 29 సెంట్లు, గజపతినగరంలో 34సెంట్లు, మదుపాడ గ్రామంలో 62 సెంట్లు మొత్తంగా 69 ఎకరాల 51 సెంట్లను 23 మంది రైతులు కౌలుకు తీసుకున్నారు. గతంలో వారి నుంచి ఏటా రూ.98,475 వసూలయ్యేది. 2014 వరకు సాఫీగా జరిగింది. ఆ ఏడాదితో లీజ్‌ ముగియడంతో 2015 నుంచి నేటి వరకు 12 ఏళ్లుగా వేలం పాట నిర్వహించడంలేదు. లక్షలాది రూపాయలు కౌలు బకాయిలు పేరుకుపోతున్నాయి. రికార్డుల పరంగా 2019-20కి లక్షా 20వేల 985రూపాయలు, 20-21కి సంబంధించి 13వేల 470రూపాయలు, 21-22కి సంబంధించి లక్షా 7వేలు మాత్రమే చెల్లింపులు జరిగాయి. 2022-23 నుంచి ఆశీలు వసూలు కావడం లేదు. రైతులు తమకు నచ్చిన విధంగా భూములను ఇతరుల వద్ద తనఖా పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా గజపతినగరం పట్టణంలో ఆలయానికి చెందిన 6షాపులు ఉన్నాయి. ఒక్కోషాపుపై నెలకు రూ.825 వసూలు కావాల్సి ఉంది. మార్కెట్‌ ధర కంటే అతి తక్కువకు అద్దెకు ఇచ్చినా వాటిని కూడా సక్రమంగా కట్టడంలేదు. చాలా కాలం రెగ్యులర్‌ ఈవో లేరు. ఇన్‌చార్జి అధికారి సమగ్రంగా దృష్టి సారించలేకపోయారు. ఇప్పుడు రెగ్యులర్‌ ఈవో ఉండడంతో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

వేలం వేస్తాం

జిల్లా ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు దేవదాయ భూములకు ఆక్షన్‌ వేస్తాం. గతంలో ఇన్‌ చార్జ్‌ ఈఓలు ఉండడం వల్ల జాప్యం జరిగింది. దేవదాయ భూములు రికార్డుల్లో ఉన్న కౌలు రైతుల వద్దే ఉండాలి. లేకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. కౌలు రైతుల నుంచి బకాయి వసూళ్లను వేగవంతం చేస్తాం. అలాగే గజపతినగరంలోని షాపులకు ఏప్రిల్‌ నెలలో వేలం వేస్తాం.

శ్రీరాం, ఈవో, గజపతినగరం

Updated Date - Mar 31 , 2026 | 11:44 PM