పట్టాలిచ్చారు.. కొండెక్కించారు
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:29 AM
ఇళ్లు కట్టుకోవడానికి స్థలం కావాలని అడిగితే...ఏటవాలుగా ఉన్న కొండను చూపిస్తే ఎలా ఉంటుంది?.
- గత వైసీపీ ప్రభుత్వంలో 1450 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు
- ఏటవాలు కొండపై స్థలాలు చూపించిన వైనం
-తుప్పలు, డొంకల మధ్య ఇళ్లు ఎలా అంటున్న లబ్ధిదారులు
- స్థలాల అప్పగింతపై ఇప్పటికీ స్పష్టత కరువు
- కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు
నెల్లిమర్ల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇళ్లు కట్టుకోవడానికి స్థలం కావాలని అడిగితే...ఏటవాలుగా ఉన్న కొండను చూపిస్తే ఎలా ఉంటుంది?. పట్టా చేతిలో పెట్టి స్థలం కోసం కొండపైకి పంపిస్తే లబ్ధిదారుల పరిస్థితి ఏమిటీ? నెల్లిమర్ల పట్టణంలో సరిగ్గా ఇదే జరిగింది. ఒకరిద్దరికో, పదుల సంఖ్యలో ఉన్నవారికో కాదు ఏకంగా 1450 మందికి కొండపై ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలపై హైడ్రామా నడిచింది. ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అప్పటి పాలకులు ప్రకటనలు చేశారు. మర్మం ఎరుగని పేదలు దరఖాస్తు కోసం బారులు తీరారు. ఇక పట్టాలు మంజూరే తరువాయి అన్నట్టు అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరించారు. కొన్నాళ్ల తరువాత నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయానికి, చంపావతి నదికి మధ్య ఉన్న కొండ ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలుగా చూపించి ‘మీకు అక్కడే పట్టాలు ఇస్తున్నాం.’ అని చెప్పడంతో లబ్ధిదారులు సంబరపట్టారు. కానీ, కేటాయించిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎటుచూసినా తుప్పలు, డొంకలు, ఏటవాలుగా ఉన్న కొంతప్రాంతం కనిపించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. సొంతంగా ఇంటిపట్టా అంటే ఒక భరోసా. అయితే ఇక్కడ మాత్రం పట్టా చేతిలో ఉన్నా నివాసయోగ్యమైన స్థలం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. తుప్పలు తొలగించి కొండను చదును చేసుకుని ఇల్లు నిర్మించుకోవాలంటే సామాన్యులకు సాధ్యమయ్యే పనికాదు. పోనీ అప్పట్లో ప్రభుత్వమే అభివృద్ధి చేసి అప్పగించిందా? అంటే అదీ జరగలేదు. 1450 మందికి పట్టాలు మంజూరు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు లబ్ధిదారులకు స్థలాల అప్పగింత పూర్తికాలేదు. దీంతో పట్టాలు పొందినవారు ఏళ్లుగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. పట్టా ఉందన్న సంతోషం తప్ప సొంతింటి కల నెరవేరే దిశగా అడుగులు పడడం లేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారాయన్న ఆరోపణలు కూడా బహిరంగంగా వినిపిస్తున్నాయి. పట్టాల మంజూరు వెనుక కోట్ల రూపాయల వాటాల వ్యవహారం ఉందని కొందరు అప్పటి అధికారులపై బాహాటంగానే ఆరోపిస్తున్నారు. అసలు ఆ కొండ ప్రాంతం నివాసయోగ్యమైనదేనా? స్థలాలుగా కేటాయించడానికి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టారా? నిబంధనల ప్రకారమే పట్టాలు మంజూరు జరిగిందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
ఇప్పటికైనా మోక్షం కలిగేనా?
గతంలో ఏం జరిగిందన్నది పక్కన పెడితే...ప్రస్తుతం ఈ వ్వహారంపై దృష్టిసారించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారులకు స్థలాలు అప్పగించే ప్రయత్నం చేస్తామని ప్రస్తుత అధికారులు చెబుతున్నారు. అయితే ఈ హామీ ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుందన్నది ప్రశ్నార్దకంగా మారింది. 1450 మంది చేతుల్లో పట్టాలున్నా వారి కళ్లముందు కొండ మాత్రమే కనిపిస్తోంది. స్థలం దక్కిందన్న ఆనందం లేదు.. ఇల్లు కట్టుకుంటామన్న భరోసా లేదు. వెరసి పట్టాలున్నా స్థలాలు లేని దుస్థితిలో లబ్ధిదారులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొండను చదునుచేసి, మౌలిక సదుపాయాలు కల్పించి స్థలాలు అప్పగిస్తారా? లేక మరోసారి హామీలతోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాల్సిందే.