భూములిచ్చారు.. రద్దు చేశారు
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:21 AM
వారంతా దేశరక్షణకు పాటుపడ్డారు. కుటుంబాలకు దూరం ఉండి దేశ సరిహద్దులకు వెళ్లి అహోరాత్రులు కాపాలా కాశారు.
- న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న మాజీ సైనికులు
- అప్పటి తహసీల్దార్ చేసిన తప్పు శాపంగా మారిన వైనం
- ఆందోళన చేసేందుకు కార్యాచరణ
మెంటాడ సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వారంతా దేశరక్షణకు పాటుపడ్డారు. కుటుంబాలకు దూరం ఉండి దేశ సరిహద్దులకు వెళ్లి అహోరాత్రులు కాపాలా కాశారు. శత్రుదేశాల నుంచి భరతమాతను కంటికి రెప్పలా కాపాడిన వీర జవానులు. వారి సేవలకు గుర్తింపుగా పదవీ విరమణ అనంతరం అధికారులు భూమిని కేటాయించారు. అంతలోనే మళ్లీ రద్దు చేశారు. ఆ భూములను దక్కించుకునేందుకు ఇక్కడ పోరాడుతున్నారు. ఆరేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వెలకట్టలేని వారి త్యాగాన్ని విస్మరిస్తున్న అధికారులు, సమస్యను పరిష్కరించకపోగా ఆ భరతజాతి ముద్దుబిడ్డలను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మాజీ సైనికులకు ఆరేళ్ల కిందట కొండలింగాలవలస, మెంటాడ, లోతుగెడ్డ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఐదు ఎకరాల వంతున అధికారులు కేటాయించారు. సబ్ డివిజన్ చేయకుండా కొండ గుర్తుగా పంపిణీ చేసి ఇకనుంచి ఈ భూమి మీదేనని అప్పట్లో చెప్పారు. దీంతో వారంతా ఆ భూముల్లో నీలగిరి సాగు ప్రారంభించారు. ఒకవిడత పంటను కూడా అనుభవించారు. ఇక తమ భూములకు ఆటంకాలు లేవని వారంతా భావించారు. ఇంతలో వీరికి భూమిని అప్పగించిన అప్పటి తహసీల్దార్‌పై అనేక ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆయన హయాంలో జరిగిన అనేక అక్రమాలు వెలుగుచూశాయి. ఆయన చేసిన పాపాలు మాజీ సైనికులకు శాపంగా మారాయి. దీంతో అప్పట్లో జరిగిన భూముల కేటాయింపు, జారీచేసిన పట్టాలను రద్దుచేస్తూ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మాజీ సైనికులకు కేటాయించిన భూములు కూడా ఉన్నాయి. అప్పట్లో సబ్ డివిజన్ లేకుండా కేవలం కొండగుర్తుగా కేటాయించిన భూములకు, అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా 1బీలను నాటి తహసీల్దార్ మంజూరు చేశారు. దీంతో మాజీ సైనికుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ప్రభుత్వం కేటాయించిన భూములు తమపరం అయ్యేందుకు అప్పట్లో చేతులు మారిన మొత్తం కోటి రూపాయలు వరకు ఉంటుందని వారు చెబుతున్నారు. డబ్బూ పోయి, భూములూ దక్కక వారు మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్ చుట్టూ ప్రతివారం కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ కనికరించడంలేదు. ఇక్కడకు వస్తే అక్కడకు, అక్కడకు వెళ్తే ఇక్కడకు అంటూ తమతో అధికారులు బంతాట ఆడుకుంటున్నారని మాజీ సైనికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ విజయభాస్కర్‌ను వివరణ కోరగా.. ‘ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సూచనలు మేరకు నడుచుకుంటాను.’ అని తెలిపారు.