Share News

Let’s Shift It! వారు పట్టించుకోరులే.. తరలించేద్దాం!

ABN , Publish Date - May 23 , 2026 | 11:16 PM

They Don’t Care Anyway… Let’s Shift It! భామిని మండలం దిమ్మిడిజోల గ్రామ సమీపంలోని వంశధార నదీతీరంలో ఉన్న వివాదాస్పద ఇసుక నిల్వలపై కొందరు కన్నేశారు. వాటి తరలింపునకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రీచ్‌ల వద్ద రహదారి మరమ్మతులు చేపడుతున్నారు.

  Let’s Shift It!  వారు పట్టించుకోరులే..  తరలించేద్దాం!
దిమ్మిడిజోల వంశధార నదీతీరంలో వివాదాస్పద ఇసుక నిల్వలు ఇలా..

  • దిమ్మిడిజోల వద్ద వివాదాస్పద ఇసుక నిల్వల తరలింపునకు యత్నాలు

  • నేరడి సమీపంలో అక్రమంగా ఇసుకను పోగు చేస్తున్న వైనం

  • రవాణాకు వీలుగా రీచ్‌ల వద్ద రహదారులకు మరమ్మతులు

  • స్పందించని అధికారులు

భామిని, మే23(ఆంరఽధజ్యోతి): భామిని మండలం దిమ్మిడిజోల గ్రామ సమీపంలోని వంశధార నదీతీరంలో ఉన్న వివాదాస్పద ఇసుక నిల్వలపై కొందరు కన్నేశారు. వాటి తరలింపునకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రీచ్‌ల వద్ద రహదారి మరమ్మతులు చేపడుతున్నారు. మరోవైపు నేరడి సమీపంలోని నదీ తీరంలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి భారీగా నిల్వ చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

- వాస్తవంగా వైసీపీ సర్కారు హయాంలో ఒడిశా అనుమతులతో దిమ్మిడిజోల సమీపంలోని వంశధార నదీ తీరం నుంచి పెద్దఎత్తున ఇసుకను తరలించేవారు. వంశధార నది ఆంధ్రావైపు ఉన్నప్పటికీ ఒడిశా సరిహద్దు అంటూ గతంలో వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు అడ్డుగోలుగా ఇసుక దందా సాగించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం తీసుకురావడంతో ఈ దందాకు బ్రేక్‌ పడింది. అయితే వైసీపీ నేతల అండదండలతో ఆ ప్రాంతంలో నిల్వ చేసిన ఇసుకను తరలించకుండా అడ్డుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రాష్ర్టా లకు చెందిన రెవెన్యూ అధికారులు సరిహద్దులను గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా యంత్రాంగం, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అప్పటి పాలకొండ సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌రెడ్డి సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పలు దఫాలు సర్వే చేపట్టి.. ఇసుక తరలింపును అడ్డుకున్నారు. కాగా సరిహద్దు వివాదం కొలిక్కి రాలేదు. దీంతో గత రెండేళ్లుగా దిమ్మిడిజోల సమీపంలోని వంశధారలో భారీగా ఉన్న ఇసుక నిల్వలు తరలించడానికి వీలు పడలేదు. అయితే తాజాగా కొందరు నాయకులు ఆ ఇసుక నిల్వల తరలింపునకు రెడీ అయ్యారు. తెరవెనుక అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి సన్నాహాలు చేస్తు న్నారనే ఆరోపణలు న్నాయి. ఈ మేరకు రీచ్‌ వద్ద రహదారిని చదును చేసి నదీతీరంలోని ఇసుక నిల్వలను వేరేచోటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఒడిశా గజపతి జిల్లాకు చెందిన అధికారులు ఇటీవల వంశధార నదీతీర ప్రాంతంలో ఇసుక నిల్వలను పరిశీలించారు. వివాదాస్పద ఇసుక నిల్వలను తరలించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తాత్కాలికంగా తరలింపు నిలిచిపోయింది.

- ఇదిలా ఉండగా మండలంలో పలు ఇసుక ర్యాంప్‌లకు అనుమతులు వచ్చాయని అక్రమా ర్కులు ప్రచారం చేస్తున్నారు. స్థానికుల సహకారంతో ఆయా ర్యాంపులకు వెళ్లేందుకు రహదారులు మరమ్మతులు చేపడుతున్నారు. నేరడి, బిల్లుమడ మధ్యలో యంత్రాల ద్వారా కొండలను తలపించే విధంగా ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వ చేస్తున్నా మైనింగ్‌ శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై తహసీల్దార్‌ ఎం.నాగేంద్ర వరప్రసాద్‌ను వివరణ కోరగా.. ప్రస్తుతం ఇసుక ర్యాంప్‌లకు ఎటువంటి అనుమతులు రాలేదన్నారు.

Updated Date - May 23 , 2026 | 11:16 PM