Share News

Encroachments Won’t Stop వారు గుర్తించరు.. ఆక్రమణలు ఆగవు

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:14 AM

They Don’t Acknowledge… Encroachments Won’t Stop జిల్లాలో విలువైన ప్రభుత్వ స్థలాలకు రక్షణ కొరవడింది. పల్లెల్లో చెరువులు, గ్రామ కంఠాలు, పోరంబోకు భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురువుతున్నాయి. వాటిని కాపాడాల్సిన రెవెన్యూశాఖ, గ్రామ పంచాయతీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు

  Encroachments Won’t Stop  వారు గుర్తించరు.. ఆక్రమణలు ఆగవు
తుంబలిలో ఆక్రమణకు గురైన చెరువు

  • చెరువులు, గ్రామ కంఠాలు, పోరంబోకు భూములకు రక్షణ కరువు

  • రీ సర్వేల్లోనూ తేల్చని అధికారులు

  • కొన్నిచోట్ల ఆక్రమణదారులకు భరోసా

జియ్యమ్మవలస, మార్చి30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విలువైన ప్రభుత్వ స్థలాలకు రక్షణ కొరవడింది. పల్లెల్లో చెరువులు, గ్రామ కంఠాలు, పోరంబోకు భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురువుతున్నాయి. వాటిని కాపాడాల్సిన రెవెన్యూశాఖ, గ్రామ పంచాయతీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా కబ్జాదారులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కూడా స్థలం దొరకని పరిస్థితి ఎదురవుతోంది. రీసర్వేల్లో కూడా ఆక్రమణలను గుర్తించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి...

- గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పూర్తిగా తప్పుల తడకగా మారడంతో రైతుల నుంచి కూటమి సర్కారుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పక్కాగా రీసర్వే చేసి భూరికార్డులు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 965 గ్రామాల్లోని 5.80 లక్షల ఎకరాల్లో రీసర్వే చేయాలని ఉత్తర్వులిచ్చింది. అయితే పైలట్‌ ప్రాజెక్టు కింద 36 బృందాలు మొదటి విడతగా జిల్లాలో 15 గ్రామాల్లో 8914.62 ఎకరాల వరకూ రీసర్వే చేశాయి. రెండో విడతలో 108 బృందాలు 30 గ్రామాల్లో 27,542.23 ఎకరాల్లో రీసర్వే చేశాయి. మూడో విడతలో 73 బృందాలు 43 గ్రామాల్లో సుమారు 27,379.97 ఎకరాల్లో రీసర్వే పూర్తి చేశాయి. అంతకుముందే జిల్లా రెవెన్యూ అధికారులు సుమారు 317 గ్రామాల్లో 1.81లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తి చేశారు

- ఇది కాకుండా సర్వే శాఖ సిగ్నల్స్‌ ఉన్న 282 గ్రామాల్లో 2.29 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందులో 43 గ్రామాల్లో మూడో విడత సర్వే జరుగుతోంది. ఇదంతా సర్వే, రెవెన్యూశాఖల సమన్వయంతో కొనసాగుతోంది. ఇంకా 239 గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది. సిగ్నల్‌ లేని గ్రామాలు 307 వరకూ ఉన్నాయి. వాటి పరిధిలో 92,591.67 ఎకరాల్లో కూడా రీసర్వే జరగాల్సి ఉంది.

- ఇంతవరకు జరిగిన భూరీసర్వేల్లో గ్రామ కంఠాలు, పోరంబోకు, గయాళి, చెరువుల విస్తీర్ణం ఎంత ఉందో? వాటి పరిస్థితి ఏమిటో రెవెన్యూశాఖ తేల్చడం లేదు. వాటిని ఆక్రమించిన వారికి కొందరు వీఆర్వోలు ఉచిత సలహాలు ఇస్తూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ‘సాగు హక్కు కింద ఆ భూమి మీకు స్వాధీనమైపోతుంది, ఏమీ కంగారు పడొద్దు.’ అని భరోసా ఇస్తున్నట్లు తెలిసింది.

చెరువుల కబ్జా ఇలా..

- జియ్యమ్మవలస మండలం తుంబలి రెవెన్యూ పరిధి సర్వే నెంబరు 329లో 7.44 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది. దీనిని చినతుంబలి, పెదతుంబలి, అల్లువాడ గ్రామాలకు చెందిన 18 మంది రైతులు పూర్తిగా కబ్జా చేసేశారు.

- పరజపాడు రెవెన్యూ పరిధి సర్వే నంబరు 1లో 39 ఎకరాలతో పాటు తుమ్మలవలస రెవెన్యూ పరిధి మూడు సర్వే నెంబర్లలో 27.09 ఎకరాలు కలిపి మొత్తం 66.09 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది. వాస్తవానికి ఈ చెరువు వంద ఎకరాల పైమాటే. కానీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయి దారుణంగా తయారైంది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా చెరువులు, గ్రామ కంఠాల కబ్జా షరా మామూలైపోయింది. దీనిపై కలెక్టర్‌ చొరవ చూపి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఈ అంశంపై జియ్యమ్మవలస తహసీల్దార్‌ ఎన్‌.అప్పారావును వివరణ కోరగా.. ‘ రీ సర్వేల్లో చెరువుల విస్తీర్ణం స్పష్టంగా తేల్చాలి. కానీ అలా జరగడం లేదని తెలిసింది. దీనిపై తగు చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 12:14 AM