Share News

ఫాగింగ్‌కు పొగబెట్టారు

ABN , Publish Date - Jul 11 , 2026 | 11:54 PM

పారిశుధ్య నిర్వహణలో భాగంగా దోమల్ని అరి కట్టేందుకు గత ప్రభుత్వంలో పంచాయతీలకు సరఫరా చేసిన ఫాగింగ్‌ యంత్రాలు మూలకు చేరా యి.

ఫాగింగ్‌కు పొగబెట్టారు
ఫాగింగ్‌ మిషన్లు

- పంచాయతీల్లో మూలకు చేరిన యంత్రాలు

- 376కు పని చేస్తున్నవి 16 మాత్రమే

- బాగు చేయాలంటే రూ.30 లక్షలు వెచ్చించాల్సిందే

- విజృంభిస్తున్న దోమలు.. వ్యాధుల బారిన ప్రజలు

- కానరాని నివారణ చర్యలు

జియ్యమ్మవలస, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్య నిర్వహణలో భాగంగా దోమల్ని అరి కట్టేందుకు గత ప్రభుత్వంలో పంచాయతీలకు సరఫరా చేసిన ఫాగింగ్‌ యంత్రాలు మూలకు చేరా యి. ఓ వైపు నిర్వహణ భారం.. మరోవైపు వాటి వినియోగంపై సిబ్బందికి అవగాహన లేక నిరూ పయోగంగా మారాయి. ప్రసుత్తం వాటికి మరమ్మతులు చేయాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. జిల్లాలో ప్రస్తుతం దోమల బెడదతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. కాలువల్లో చెత్తాచెదారం, ఆవాస ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్‌ యంత్రాలతో దోమల మందు పిచికారీ చేయడం లేదని వాపోతున్నారు.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉన్నాయి. ఇందులో 451 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలో 2,364 గ్రామాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 451 పంచాయతీలకు గాను 376 పంచాయతీలకు ఫాగింగ్‌ యంత్రాలను అధికారులు పంపిణీ చేశారు. అయితే, యంత్రాల వినియోగంపై ఎవరికీ తగు శిక్షణ ఇవ్వలేదు. దీంతో వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక అవి పంచాయతీ కార్యాలయాల్లో మూలకు చేరాయి. నాణ్యతా లోపమో, లేక వినియో గించకుండా వదిలేయడం వల్లనో గానీ ప్రస్తుతం ఆ యంత్రాలు పని చేయడం లేదు. ప్రస్తుతం 376 యంత్రాలకు గాను 16 మాత్రమే పనిచేస్తున్నాయి. వీరఘట్టం మండలంలో రెండు, జియ్యమ్మవలస మండలంలో ఐదు, పార్వతీపురంలో మూడు, పాలకొండలో మూడు, పాచిపెంటలో రెండు, కురుపాం మండలంలో ఒక యంత్రమే పనిచేస్తున్నాయి. గుమ్మలక్ష్మీపురం, బలిజిపేట, సీతంపేట, సీతానగరం, గరుగుబిల్లి, సాలూరు, కొమరాడ, మక్కువ, భామిని మండలాల్లో పూర్తిగా మూలకు చేరాయి.

మరమ్మతులకు రూ.30లక్షలు అవసరం

మూలకు చేరిన ఫాగింగ్‌ యంత్రాల మరమ్మతులకు రూ.30లక్షలు ఉండాలని అధికారులు అంచనాకు వచ్చారు. మండలాలను బట్టి అక్కడి ఎంపీడీవోలు జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక యంత్రాన్ని బాగు చేసేందుకు రూ.3,500 నుంచి రూ.12వేలు వరకు అవసరం ఉంటుందని అంచనా. అయితే వీటి మరమ్మతులు ఇప్పట్లో జరిగేలా లేవు. మరమ్మతులు చేస్తే ఖచ్చితంగా పనిచేస్తాయనే నమ్మకం లేకపోవడమే దీనికి కారణం.

గ్రామాల్లో పారిశుధ్య లోపం..

జిల్లాలో చాలా గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. చాలా వీధుల్లో మురుగు నిలిచిపోయి కంపుకొడుతున్నాయి. చెత్తను స్వచ్ఛభారత్‌ షెడ్లు వద్దకు చేర్చాల్సిన గ్రీన్‌ అంబాసిడర్లు గ్రామాల పక్కనే ప్రధాన రహదారులకు ఆనుకొని పారబోస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తున్న దాఖలాలు లేవు. ఫలితంగా దోమలు విపరీతంగా పెరిపోయి గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 779 గ్రామాలను మలేరియా ప్రభావితంగా గుర్తించారు. ఈ గ్రామాల్లో నాలుగు నెలల్లో 561 మంది మలేరియా బారిన పడినట్లు నిర్ధారించారు. పంచాయతీల కార్యదర్శులు పట్టించుకోవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా ఫాగింగ్‌ యంత్రాలను వినియోగంలోకి తీసుకువచ్చి దోమలను అరికట్టాలని కోరుతున్నారు.

వాస్తవమే

జిల్లాలో ఫాగింగ్‌ యంత్రాలు 99 శాతం మూలకు చేరడం వాస్తవమే. వీటి విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాం. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం.

-ఎస్‌.రవీంద్ర, డీజీపీవో, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - Jul 11 , 2026 | 11:54 PM