They at work... these ones on duty. ఉద్యోగంలో వారు.. విధుల్లో వీరు
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:16 AM
They at work... these ones on duty. విజయనగరం కార్పొరేషన్‌లోని కొందరు రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధి నిర్వహణకు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఉద్యోగంలో వారే ఇంటారు.. కాని విధుల్లో వేరొకరుంటారు. ఉన్నతాధికారులు సహకరిస్తే ఎలా అయినా ఉద్యోగం చేయొచ్చునని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అవుట్‌సోర్సింగ్ కార్మికుడు చెప్పాడు.
ఉద్యోగంలో వారు.. విధుల్లో వీరు
సహకరిస్తున్న అధికారులు
డమ్మీలకు సగం జీతం
కాంట్రాక్టర్లతో ఇంజనీర్ల కుమ్మక్కు
గాడి తప్పుతున్న కార్పొరేషన్ పాలన
లోప భూయిష్టంగా ప్రధాన శాఖలు
ఇబ్బందులు పడుతున్న నగరవాసులు
విజయనగరం కార్పొరేషన్‌లోని కొందరు రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధి నిర్వహణకు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఉద్యోగంలో వారే ఇంటారు.. కాని విధుల్లో వేరొకరుంటారు. ఉన్నతాధికారులు సహకరిస్తే ఎలా అయినా ఉద్యోగం చేయొచ్చునని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అవుట్‌సోర్సింగ్ కార్మికుడు చెప్పాడు. ఆయా ఉద్యోగులు ఇళ్ల వద్దే ఉండి వేరే ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ తమ స్థానంలో నెలకు రూ.9వేలు ఇస్తూ వేరే వ్యక్తితో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ఇలా నగరం మొత్తం మీద 150 మందికి పైగా ఇతర వ్యక్తులు పారిశుధ్య పనుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ కోవలో రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇంకోశాఖలో కాంట్రాక్టర్లతో ఇంజనీర్లు కుమ్మక్కు అవుతున్నారు. రెవెన్యూ విభాగంపైనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా కార్పొరేషన్ పాలన గాడి తప్పిందన్న విమర్శలు ఇటీవల కాలంలో విస్తృతమయ్యాయి.
విజయనగరం టౌన్, జూలై18(ఆంధ్రజ్యోతి):
విజయనగరం కార్పొరేషన్‌లో కొందరు ఉద్యోగులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అవుట్ సోర్సింగ్ కార్మికులదీ అదే వరుస. రెవెన్యూ విభాగం కూడా తామేం తక్కువ కాదన్నట్టు పన్నుల వ్యవహారంలో తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు రిజిస్టర్‌లో సంతకాలు చేసేసి సొంత పనులు చూసుకోవడానికి బయటకు వెళ్లిపోతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. ఇంకొంతమంది అధికారికంగా సెలవులు పెట్టకుండా విధులకు డుమ్మా కొడుతున్నారని తెలుస్తోంది.
- కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్యశాఖపై ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు సిబ్బంది ఇష్టారీతిగా విధులు నిర్వహిస్తున్నారు. శాఖాపరంగా రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు 168మంది ఉండగా, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు 432మంది ఉన్నారు. అయితే రెగ్యులర్ కార్మికులకు నెలకు సుమారు రూ.20వేల నుంచి రూ.80వేల వరకూ వేతనాలు చెల్లిస్తున్నారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు రూ.21వేలు వేతనం కింద చెల్లిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎవరైనా పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి ఆరోగ్యం సహకరించకపోతే వారి స్థానంలో కొన్ని రోజులు మాత్రమే వేరే వ్యక్తిని ప్రజారోగ్యశాఖ అధికారి అనుమతితో పనిలో పెట్టుకోవచ్చు. అలా పనిచేసే వ్యక్తికి ఆ రెగ్యులర్ కార్మికుడే వేతనం చెల్లించాలి. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సదుపాయం లేదు. అయితే అధిక శాతం ఇళ్ల వద్దే ఉండి తమ స్థానంలో నెలకు రూ.9వేలు ఇచ్చి వేరే వ్యక్తితో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ఇలా నగరం మొత్తం మీద 150కు పైగా వేరే వ్యక్తులు పారిశుధ్య పనుల్లో ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రజారోగ్య శాఖాధికారిని సంప్రదించగా అధికారికంగా తాము ఏ కార్మికునికీ వేరే వ్యక్తిని పెట్టుకుని పనిచేయించుకునేందుకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. మరి ఏ ఒక్కరికీ అనుమతులు ఇవ్వనప్పుడు ఇతర వ్యక్తులు ప్రజారోగ్యశాఖలోకి ఎలా వచ్చి పనిచేస్తున్నారన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.
ఉదాహరణ లివే..
45వ వార్డులోని ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి తాను విధులకు హాజరుకాకుండా ఓ మహిళకు విధులు అప్పగించాడు. తనకు వచ్చిన వేతనంలో ప్రతి నెలా ఆమెకు రూ.9వేలు చెల్లిస్తున్నాడు. అలాగే నగరంలోని పేర్లవారి కూడలి ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి తాను విధులకు రాకుండా వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆయనకు నెలకు రూ.9వేలు చెల్లిస్తోంది. ఈ విధంగా నగరంలో సుమారు 150కు పైగా డమ్మీ కార్మికులు సగం జీతానికే విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది.
గాడితప్పిన ఇంజనీరింగ్
కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ శాఖలో కాంట్రాక్టర్లే రాజ్యమేలుతున్నారు. అధికారులను వారికి అనుకూలంగా మలుచుకుని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కూడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా నడుస్తున్నారు. ఇంజనీరింగ్ శాఖలో ఈఈ స్థాయి అధికారి ఉన్నప్పటికీ చక్రం అంతా డీఈ తిప్పుతున్నారు. అభివృద్ధి పనులకు నిధుల మంజూరు నుంచి కాంట్రాక్టర్లకు టెండర్లు ఇప్పించేంత వరకూ ఆయనదే పైచేయి. పర్సంటేజీ పంపకాలు కూడా ఆయన చేతి ద్వారా జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. డీఈ నుంచి ఈఈకి, ఈఈ నుంచి ఉన్నతాధికారి వరకూ ఆర్థిక చానల్ నడుస్తున్నట్లు సమాచారం.
- నగరంలో ఇటీవల స్వచ్ఛ సర్వేక్షన్ క్లీన్‌స్వీప్‌లో భాగంగా గోడలపై పెయింటింగ్స్ వేసేందుకు ఆన్‌లైన్ టెండర్‌లో ఓ కాంట్రాక్టర్‌కు రూ.10లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. రూ.7లక్షలు మాత్రమే చెల్లించారని కాంట్రాక్టర్ గగ్గోలు పెడుతున్నాడు.
ఇక్కడా అంతే..
కార్పొరేషన్ పరిధిలోని కీలకమైన మరో విభాగంగా చెప్పుకునే రెవెన్యూశాఖపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పన్నుల విధింపు.. వసూలులోనూ అక్రమాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల నూతనంగా బదిలీపై వచ్చిన ఓ యువ ఉద్యోగి మాటే చెల్లుబాటు అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన గడిచిన పదిహేనేళ్లుగా ఇదే కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మూడు మాసాల కిందటి వరకూ అకౌంట్ సెక్షన్‌లో ఉన్న ఆ ఉద్యోగి రెవెన్యూలో ఆర్‌ఐగా బదిలీపై వచ్చి ఇక్కడ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఆయనకు ఓ ఉన్నతాధికారి సహకారం మెండుగా ఉందంటున్నారు. కాగా ఇదే శాఖలో మరికొంతమంది ఆర్‌ఐ స్థాయి వ్యక్తులు కూడా విధుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని కొందరు కార్పొరేటర్లు అంటున్నారు.
దారితప్పిన ప్రణాళికా విభాగం
కార్పొరేషన్ పరిధిలోని భవన నిర్మాణాల్లో అనుమతుల పేరిట ఎక్కువ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు వినికిడి. సచివాలయాల్లో ఉండే ప్లానింగ్ సెక్రటరీలు స్థానికంగా నిర్మాణం జరుగుతున్న కట్టడాలను గుర్తించి, నూతన నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేయించి, ఉన్నతాధికారుల పేర్లు చెప్పి చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రక్షాళన చేస్తాం
తాను విధుల్లో చేరిన తరువాత అన్ని శాఖలపై దృష్టి సారించాను. అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఆయా శాఖల్లో అధికారులు, సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరించినట్లు పలుమార్లు నా దృష్టికి వచ్చింది. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టి అవినీతి రహిత పాలన అందిస్తాం.
- బాలస్వామి, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్