Share News

దొరికితేనే దొంగలు

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:54 AM

జిల్లాలో పశువుల అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో ఎక్కువ పశువులు పట్టుబడుతున్నా దాని మూలాలు ఉత్తరాంధ్ర వైపు చూపించాయి.

దొరికితేనే దొంగలు
పోలీసుల దాడుల్లో ఒకే రోజు పట్టుకున్న 65 పసువులు

ఆగస్టు 27 రాజాం వారపు సంత నుంచి తక్కువ ధరకు పశువులు కొనుగోలు చేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాల్లో 43 పశువులను పట్టుకోగా.. అందులో లేగదూడలు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఆగస్టు 27న రామభద్రపురం మండలం కొట్టక్కి జంక్షన్‌ వద్ద మూడు వాహనాల్లో తరలిస్తున్న 22 పశువులను పోలీసులు పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా.. అత్యంత పాశవికంగా పశువులు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించి బాధ్యులపై కేసు నమోదుచేశారు.

  • మళ్లీ మొదలైన పశువుల అక్రమ రవాణా

  • గతనెల 27న ఒక్కరోజే 65 పశువుల పట్టివేత

  • జూలైలో పోలీసులు, రవాణాశాఖ చర్యలు

  • తగ్గినట్టే తగ్గి మళ్లీ జోరందుకున్న వైనం

  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

ఏదో ఒక సంతలో పశువులను కొనుగోలు చేస్తారు. ఇరుకైన వ్యానులో కుక్కేస్తారు. పైన కనబడకుండా కప్పేస్తారు. మూగజీవాలు అల్లాడుతున్నా పట్టించుకోరు. నేషనల్‌ హైవేపై దర్జాగా తరలించేస్తారు. పోలీసులకు సమాచారం వస్తే దొరికిపోతారు. లేకుంటే ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించేస్తారు. ఇంతజరుగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. సంతల్లో నిబంధనల అమలుపై నిర్లక్ష్యం వహిస్తోంది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. ఇటీవల తగ్గిన పశువుల అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాజాం/గజపతినగరం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశువుల అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో ఎక్కువ పశువులు పట్టుబడుతున్నా దాని మూలాలు ఉత్తరాంధ్ర వైపు చూపించాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి తరలిస్తున్నట్టు రాష్ట్రస్థాయి అధికారులు గుర్తించారు. అందుకే జూలై నెలలో ఉత్తరాంధ్ర ఎస్పీలతో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ సమీక్షించారు. దీంతో జిల్లా ఎస్సీ దామోదర్‌తో పాటు ఇతర ఎస్పీలు సీరియస్‌గా దృష్టిపెట్టారు. మరోవైపు రవాణాశాఖ కమిషనర్‌ సిన్హా సైతం ఆర్టీవోలకు ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభం అయ్యాయి. వారం రోజుల్లో 115 పశువులు పట్టుబడ్డాయి. దీంతో పశువుల అక్రమ రవాణా కొంతవరకూ ఆగింది. అయితే ఇప్పుడు మళ్లీ మొదలు కావడం ఆందోళన కలిగిస్తోంది.

పశుమాంసం సైతం..

ఇతర ప్రాంతాలకు పశువుల రవాణా జరుగుతోంది. మరోవైపు జిల్లాలోని పలుచోట్ల పశుమాంసం విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సంతల నుంచి పశువులను కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ పశువులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుంటున్న తరుణంలో విచారిస్తే.. పశువులను కబేళాల కోసమే కంటైనర్లలో తరలించుకు పోతున్నట్టు తేలింది. జిల్లాలో నాగావళి, చంపావతి, గోస్తానీ నదీ తీరాల్లో పశువుల వధ సాగుతోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడితే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

గతంలో హిందూ ధర్మప్రచార సమితితో పాటు గోసంరక్షకులు ప్రత్యేకంగా దృష్టిపెట్టేవారు. గతంలో ఓసారి విజయనగరంలో గోవధ శాలలో చిత్రాలను డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారు. సోషల్‌ మీడియాలో పెట్టడంతో పెను వివాదం నడిచింది. అటువంటి తరుణంలో కొత్తపేట కుమ్మరి వీధి సమీపంలో నిర్వహిస్తున్న గోవధ శాలను గోసంరక్షకులు గుర్తించారు. స్ర్టింగ్‌ ఆపరేషన్‌ చేసి మరీ 4 వేల టన్నుల మాంసాన్ని, పదుల సంఖ్యలో పశువులను పోలీసులకు పట్టించారు. జిల్లాలో ప్రజాసంఘాలు, జంతు పరిరక్షణ సమితులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో అధికార యంత్రాంగం కూడా కఠిన చర్యలకు దిగితే కొంతవరకూ ఫలితముంటుంది.

రద్దు చేసిన వారే నిర్వహణకు అనుమతి

  • మానాపురం సంత వ్యవహారంలో విమర్శలు

  • అయినా యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా

దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో శనివారం నిర్వహించే సంతలో రూ.లక్షలు చేతులు మారుతుంటాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసిన పశువులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. సంతలో పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని ఓ సామాజికవేత్త జూలై నెలలో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జూలై 7వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు పెదమానాపురం సంతను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండల అధికారులు ఆ ఆదేశాలను అమలు చేశారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఆతర్వాతే సంతను తెరిపిస్తారని అందరూ భావించారు. అంతలో ఏమైందో ఏమోగానీ రెండు రోజులకే అంటే జూలై 9వతేదీన సంత నిర్వహించుకోవచ్చని జిల్లా అధికారుల నుంచి మండల పరిషత్‌ అధికారికి ఆదేశాలు వచ్చాయి. దీని వెనుక ఓ కీలకప్రజాప్రతినిధి ప్రమేయం ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అప్పటి నుంచి ప్రతీ శనివారం సంత నిర్వహిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు నలుగురు అధికారులతో కమిటీ వేశారు. అయినా కూడా మానాపురం సంత నుంచి పశువులు అక్రమంగా తరలిపోతూనే ఉన్నాయి. ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జిల్లా అధికారుల నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే మానుపురం సంత నిర్వహిస్తున్నామని దత్తిరాజేరు ఎంపీడీవో ఎస్‌.తాత తెలిపారు.

యంత్రాంగం దృష్టిపెట్టాలి

జిల్లాలో అక్రమ గోవధ శాలలు కొనసాగుతున్నాయి. పోలీసులు నామమాత్రపు తనిఖీలకే పరిమితం అవుతున్నారు. అసలు అనుమతులే లేకపోతే ఇక్కడ గోవధ శాలలు ఎందుకు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించాలి. లేకుంటే ప్రజాసంఘాలతో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. జిల్లా వ్యాప్తంగా పశు అక్రమ రవాణాపై దృష్టిపెట్టడమే కాదు. ఆహార కల్తీ నియంత్రణ అధికారులు సైతం రంగంలోకి దిగాలి.

- స్వామి శ్రీనివాసానంద, ఉత్తరాంధ్ర సాధుపరిషత్‌ అధ్యక్షుడు

Updated Date - Sep 01 , 2026 | 12:54 AM