ఇసుకను తోడేస్తున్నారు..
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:03 AM
మండలంలో మట్టి, గ్రావెల్, ఇసుక మాఫియా పేట్రేగిపోతుంది.
- వేగావతిలో జోరుగా తవ్వకాలు
- కుంగిపోతున్న ఊట బావులు
- మట్టి, గ్రావెల్‌ను కూడా వదలట్లే!
బొబ్బిలి రూరల్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలో మట్టి, గ్రావెల్, ఇసుక మాఫియా పేట్రేగిపోతుంది. రాత్రిళ్లు మట్టి, గ్రావెల్ తవ్వకాలు చేపడుతుండగా, తెల్లవారుజామున వేగావతి నదిలో ఇసుకను తోడేస్తోంది. ఫలితంగా చెరువులు, నదులు స్వరూపాన్ని కోల్పోతున్నాయి. అక్రమ తవ్వకాలను కట్టడి చేయాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ మాఫియాకు కొందరు పోలీసు, రెవెన్యూ, భూగర్భ గనులశాఖ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వేగవతిలో ఇసుక తవ్వకాలు..
వేగావతి నదీ పరివాహక గ్రామాలైన పారాది, అలజంగి, పెంట, కారాడ గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచే ఈ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు మొదలవుతుంటాయి. ట్రాక్టర్ ఇసుకను రూ.3 వేలకు పట్టణంలో విక్రయిస్తూ ఇసుక మాఫియా సొమ్ము చేసుకుంటోంది. ఈ మాఫియాకు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో వేగావతి నది స్వరూపం మారిపోతుంది. 8 అడుగుల లోతున తవ్వకాలు చేపడుతుండడంతో ఇన్ఫిలే్ట్రషన్ నీటి బావులు కుంగిపోతున్నాయి. దీనివల్ల తాగునీటికి సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
లారీ మట్టి రూ.3వేలు..
కోమటిపల్లి పరిధి బోనేడు చెరువులో గత కొన్నేళ్లుగా భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ రాత్రి 10 గంటలు దాటిన తరువాత లారీలు, యంత్రాలు ఈ చెరువు వద్దకు చేరుకుంటాయి. అక్రమార్కులు యంత్రాలతో తవ్విన మట్టిని లారీలకు లోడు చేసి పట్టణ సమీపంలోని లేఅవుట్లకు తరలిస్తున్నారు. లారీ మట్టి రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. ఒక రాత్రిలో దాదాపు 60 లోడ్ల మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయమంతా ఆ లారీలు పాత బొబ్బిలి వద్ద ఉన్న ఓ పెట్రోలు బంకు ఆవరణలో పార్కింగ్ చేసి ఉంటాయి. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాతబొబ్బిలి వద్ద పోలీసు చెక్ పోస్టు ఉన్నా వారు కూడా పట్టించుకోవడం లేదు. మట్టి, గ్రావెల్ తవ్వకాలపై స్థానికులు భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ విభాగానికి ముందస్తు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.