Share News

They Are Leaving… పోతున్నారు సరే.. వచ్చేవారేరీ?

ABN , Publish Date - May 23 , 2026 | 12:33 AM

They Are Leaving… But Who Is Coming Back? జిల్లా ఏర్పడి సుమారు నాలుగేళ్లవుతున్నా.. ఇంకా ఇన్‌చార్జిల పాలనే సాగుతోంది. కీలక శాఖలకు అధికారులు కరువయ్యారు. కొన్నేళ్లుగా ప్రధాన కార్యాలయాల్లో కుర్చీలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కో అధికారి రెండు నుంచి మూడు శాఖల బాధ్యతలను చూసుకోవాల్సి వస్తోంది.

They Are Leaving…   పోతున్నారు సరే.. వచ్చేవారేరీ?

  • ఆయా స్థానాలకు తిరిగి ఎవరూ రాని వైనం

  • కొన్నేళ్లుగా ఖాళీగానే పోస్టులు

  • కీలక శాఖలకు అధికారులు కరువు

  • జిల్లా ఏర్పడి నాలుగేళ్లవుతున్నా.. ఇంకా ఇన్‌చార్జిల పాలనే..

  • ఒక్కోక్కరికీ రెండు నుంచి మూడు శాఖల బాధ్యతలు

  • పోస్టుల భర్తీకి చర్యలేవీ..!

  • తప్పని పాలనాపరమైన ఇబ్బందులు

  • ప్రజలకు పూర్తిస్థాయిలో అందని సేవలు

పార్వతీపురం, మే22(ఆంధ్రజ్యోతి): జిల్లా ఏర్పడి సుమారు నాలుగేళ్లవుతున్నా.. ఇంకా ఇన్‌చార్జిల పాలనే సాగుతోంది. కీలక శాఖలకు అధికారులు కరువయ్యారు. కొన్నేళ్లుగా ప్రధాన కార్యాలయాల్లో కుర్చీలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కో అధికారి రెండు నుంచి మూడు శాఖల బాధ్యతలను చూసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారిపై పనిఒత్తిడి పెరుగుతుండగా.. పూర్తిస్థాయిలో సేవలందించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా కీలక పోస్టుల్లో ఇన్‌చార్జి అధికారులను నియమిస్తుండడం వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలకు మోక్షం లభించడం లేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

జిల్లా నుంచి వెళ్తున్నా..

వివిధ శాఖలకు చెందిన అధికారులు బదిలీలు, పదోన్నతులపై జిల్లా నుంచి వెళ్తున్నారు. అయితే ఆ స్థానంలో మన్యానికి ఎవరూ రావడం లేదు. దీంతో కీలక పోస్టుల్లో వేరే శాఖలకు చెందిన అధికారులకు ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నారు. ఎంతో హడావుడిగా జిల్లాలను ఏర్పాటు చేసిన నాటి వైసీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు, మౌలిక వసతులు, పోస్టుల భర్తీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే కూటమి ప్రభుత్వం కూడా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వైశాలిని సుమారు నెల రోజుల కిందట పార్వతీపురం ఐటీడీఏకు పూర్తిస్థాయి పీవోగా నియమించారు. ఐటీడీఏ పాలనపై దృష్టి సారిస్తున్న ఆమె మరో రెండు కీలక శాఖలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌, డీఆర్‌డీఏ పీడీగా అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. తాజాగా జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌రెడ్డికి బదిలీ కావడంతో ఆ స్థానంలో ఇన్‌చార్జిగా వైశాలి నియామకమయ్యారు. మరికొద్ది రోజుల్లోనే జాయింట్‌ కలెక్టర్‌గా పీఏసీ హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఏదేమైనా ఒకే అధికారికి .. ఇలా నాలుగు కీలక శాఖల బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమవుతోంది. ఇలా అయితే పాలనాపరమైన ఇబ్బందులు తప్పవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కీలక సమస్యలు ఎన్నో...

భూ రీ సర్వేతో పాటు రెవెన్యూ శాఖలో కీలక సమస్యలెన్నింటినో సబ్‌ కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ పరిష్కరించాల్సి ఉంది. అయితే ఇటువంటి పోస్టుల్లో కూడా ఇన్‌చార్జి అధికారులే ఉండడం వల్ల ప్రభుత్వం నిర్దేశించే కార్యక్రమాలు సకాలంలో ఎలా పూర్తవుతాయన్నది ప్రశ్నా ర్థకంగా మారింది. రీసర్వే ప్రక్రియను యుద్ద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తిచేయాలని గడువు కూడా విధించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు పూర్తిస్థాయి అధికారులను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఖాళీగా ఉన్న పోస్టులివీ..

- జిల్లా పశుసంవర్థక శాఖాధికారి మన్మథరావు పదోన్నతిపై విజయనగరం వెళ్లిపోయారు. ఆయన స్థానంలో పూర్తిస్థాయి అధికారిని ఇంకా నియమించలేదు. పాలకొండ డీఎల్‌పీవో రాంప్రసాద్‌ రిటైర్డ్‌ అవ్వడంతో ఆ స్థానంలో ఇన్‌చార్జిగా నియమించిన గోపాలకృష్ణకు శ్రీకాకుళం జిల్లా డ్వామా కార్యాలయానికి బదిలీ అయింది.

- జిల్లా హౌసింగ్‌ పీడీ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి తదితర పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీకి చర్యలు తీసుకోవడం లేదు. పార్వతీపురం ఆర్డీవో కుర్చీ కూడా కొన్నాళ్లుగా ఖాళీగానే ఉంది. ఐటీడీఏ పీవో వైశాలి, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐటీడీఏ కార్యాల యంలో ప్రాజెక్టు అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ బాధ్యతలను ఇన్‌చార్జి అధికారికి అప్పగించారు. మొత్తంగా ఖాళీ పోస్టులకు ఇన్‌చార్జి అధికారులే దిక్కుగా మారారు.

డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీగా ప్రభావతి

డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఆడిట్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్‌ ప్రభావతిని విజయనగరం డీఆర్‌డీఏ పీడీగా నియమించారు. పార్వతీపురం మన్యం జిల్లాకు మాత్రం ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె విజయనగరంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన్యం జిల్లాకు వచ్చే అవకాశం ఉంది.

జాయింట్‌ కలెక్టర్‌ ఆకస్మిక బదిలీ

జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డిని ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌గా ఎఫ్‌ఏసీ హోదాలో పార్వతీపురం ఐటీడీఏ పీవో వైశాలి నియమించారు. తొలుత పాలకొండ సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం జిల్లా జేసీగా నియామ కమయ్యారు. పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా విధులు నిర్వహించారు. నెల కిందట సబ్‌ కలెక్టర్‌ వైశాలిని ఐటీడీఏ పీవో నియమించారు. దీంతో పూర్తిస్థాయిలో జేసీగా విధులు నిర్వహిస్తున్న యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆకస్మికంగా బదిలీ చేయడం చర్చనీ యాంశమవుతోంది.

Updated Date - May 23 , 2026 | 12:33 AM