కంకర కొండను తవ్వేస్తున్నారు..
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:37 PM
మండలంలోని కాశీపట్నం పంచాయతీ పాపయ్యవలస సమీపంలోని ఒడిశల మెట్ట(కొండ)ను అక్రమార్కులు యంత్రాలతో కంకరను తవ్వి తరలించుకుపోతున్నారు.
మక్కువరూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాశీపట్నం పంచాయతీ పాపయ్యవలస సమీపంలోని ఒడిశల మెట్ట(కొండ)ను అక్రమార్కులు యంత్రాలతో కంకరను తవ్వి తరలించుకుపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతా లకు ట్రాక్టర్లు, లారీల్లో కంకరను రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సుమారు 40ఎకరాల విస్తీర్ణంలో ఒడిశల మెట్ట ఉంది. ఈ ప్రాంతంలో కాశీపట్నం, పాపయ్యవలస గ్రామాల్లోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి గతంలో అధికారులు డిపట్టాలు అందించారు. అయితే పేదలకు ఇచ్చిన ఈ భూముల్లో అక్రమంగా కంకర తవ్వకాలు చేపడుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై తహసీల్దార్ కె.భరత్‌కుమార్‌ను వివరణ కోరగా.. ‘ఒడిశల మెట్టపై కంకర తవ్వకాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. ఆ ప్రాంతంలో ఎవరు తవ్వకాలు జరిపినా కేసులు నమోదు చేస్తాం.’ అని అన్నారు.