చెరువులను కప్పేస్తున్నారు..
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:40 PM
జిల్లాలో ఇటీవల కాలంలో చెరువులు, గెడ్డలు, సాగునీటి కాలువలను కప్పేస్తున్న ఉదాంతాలు బయటపడుతున్నాయి.
- కాలువలు, గెడ్డలు కూడా..
- ఫిర్యాదు చేస్తేనే అధికారుల చర్యలు
- లేదంటే పట్టించుకోని వైనం
- సాగునీటిపై రైతుల్లో ఆందోళన
- లక్కవరపుకోట మండలం మల్లివీడు గ్రామ పరిధిలోని ఓ చెరువులో రోడ్డు వేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. దీన్ని గమనించిన రైతులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన అధికారులు అది ప్రభుత్వ భూమిగా గుర్తించారు. రోడ్డు పనులను అడ్డుకున్నారు. హెచ్చరిక బోర్డు పెట్టారు. ఈ చెరువు నుంచి జమ్మాదేవిపేట చెరువుకు, అక్కడి నుంచి రంగాపురం చెరువుకు సాగు నీరు పారుతుందని, దీనివల్ల పంటలు పండించుకుంటున్నామని రైతులు రెవెన్యూ అధికారులకు వివరించారు.
- సోంపురం-ఆనందపురం రోడ్డుకు ఆనుకుని వేపాడ మండలం వల్లంపూడి గ్రామ పరిధిలో ఉన్న ఓ చెరువుకు చెందిన కాలువ ఆక్రమణకు గురవుతోంది. కొందరు శిథిల గృహాలను కూల్చివేసి ఆ వ్యర్థాలను కల్వర్టుకు రెండు వైపులా పడేస్తున్నారు. దీంతో కాలువ కుచించుకుపోతుంది. పంట పొలాలకు సాగు నీటితో పాటు అదనపు నీటిని ఈ చెరువు కింద ఉన్న మరో చెరువుకు ఈ కాలువ గుండానే వెళ్తుంది. వరద ఎక్కువైతే చెరువు గట్లు తెగిపోకుండా ఈ కాలువ ద్వారా గెడ్డకు నీరు విడిచిపెడుతుంటామని రైతులు చెబుతున్నారు.
శృంగవరపుకోట, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కాలంలో చెరువులు, గెడ్డలు, సాగునీటి కాలువలను కప్పేస్తున్న ఉదాంతాలు బయటపడుతున్నాయి. దీనిపై స్థానికులు, రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మాత్రమే అధికారులు స్పందిస్తున్నారు. అప్పుడు కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఇక తమ పని అయిపోయిందన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఆక్రమణదారులకు కలిసొస్తుంది. కొన్ని రోజులు మౌనంగా ఉండి, ఆ తరువాత రహస్యంగా తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఇలా ప్రతి ఏటా చెరువులు, గెడ్డలు, కాలువలను పూడ్చేస్తుండడంతో ఒక్కొక్కటిగా కుచించుకుపోతున్నాయి. చెరువుల విస్తీర్ణాలు తగ్గుతున్నాయి. వారం రోజులు వర్షం పడకపోతే చెరువుల్లోని నీరంతా ఖాళీ అవుతుంది. అధిక వర్షం పడినప్పుడు గట్లు తెగేలా తొందరగా నిండిపోతున్నాయి. అదే విధంగా ఆక్రమణలతో గెడ్డలు, కాలువల సామర్థ్యం తగ్గడంతో వరదల సమయంలో నీరు దిగువకు వెళ్లడం లేదు. దీంతో ఎక్కడికక్కడే గండ్లు పడి పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ విధంగా రైతులకు రెండు విధాలుగా నష్టం జరుగుతుంది. భూగర్భ జల మట్టాలు సైతం తగ్గిపోతున్నాయి.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో సుమారు 8,013 పెద్ద, చిన్న, మధ్య తరహా చెరువులు ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా గొలుసుకట్టు చెరువులే. అటవీ, కొండలు, మెట్ట ప్రాంతాల్లో పడిన వర్షాలకు వరద నీరు గెడ్డల ద్వారా కిందనున్న చెరువుల్లోకి చేరుతుంది. ఒక చెరువు నిండిన తరువాత మరొక దానికి నీరు వెళ్తుంది. ఇలా చెరువులన్నీ నిండుతుంటాయి. అయితే ప్రస్తుతం భూముల ధరలు పెరగడంతో రియల్ వ్యాపారులు, చెరువుల పక్కనున్న కొందరు రైతులు చెరువు గర్భాలను ఆక్రమిస్తున్నారు. తమ అవసరాల కోసం చెరువుల్లో రోడ్లు నిర్మిస్తున్నారు. అధికారులు వీరికి సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బంది తక్కువగా ఉన్నారని చెప్పి ఆక్రమణలను అడ్డుకోవడం లేదు. రెవెన్యూ అధికారులదే బాధ్యతన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరు సైతం చర్యలు చేపట్టేందుకు వెనకాడుతున్నారు.
చెరువులు బాగుపడేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూ గర్భ జల మట్టాలను పెంచేందుకు జలధార- జలహారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కనీసం 1.5 మీటర్లు జలమట్టాన్ని పెంచడమే లక్ష్యంగా నీటి భద్రతపై వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు. ఈ నెల 6 నుంచి జూలై 14వరకు నాలుగు దశల్లో పనులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. దీంతో చెరువులు, గెడ్డలు, పంట కాలవలకు మంచి రోజులు వస్తామని రైతులు ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు చెరువులు, గెడ్డలు, సాగునీటి కాలువలు కబ్జాకు గురయ్యాయి. ప్రధానంగా పట్టణాలు, గ్రామాలకు ఆనుకుని ఉన్నవి ఆక్రమణకు గురయ్యాయి. ఈ ఆక్రమణలను తొలగించి చెరువులను అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు.