Share News

They are 'buying' difficulties కష్టాలు ‘కొని’ తెచ్చుకుంటున్నారు

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:13 AM

They are 'buying' difficulties యువకులు వక్రదారి పడుతున్నారు. చెడు సహవాసాలు.. అధిక సెల్‌ఫోన్‌ వినియోగం.. వారిని పక్కదారి పట్టిస్తున్నాయి.

They are 'buying' difficulties కష్టాలు ‘కొని’ తెచ్చుకుంటున్నారు

కష్టాలు ‘కొని’ తెచ్చుకుంటున్నారు

రోజువారీ వడ్డీకి అప్పులు చేస్తున్న యువత

వెయ్యికి... వంద చెల్లిస్తూ..

నెలరోజులు కాకుండానే అసలుకు చేరుకున్న వడ్డీ

ఉప్పుల ఊబిలో కూరుకుపోతున్న యువత

తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలంటున్న మానసికవేత్తలు

- గజపతినగరం పట్టణానికి చెందిన ఓ యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఇంటిలో తల్లిదండ్రులకు తెలియకుండా రోజువారీ వడ్డీకి బైకు తాకట్టు పెట్టాడు. మోటారు సైకిల్‌ ఏదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ఫ్రెండ్‌కు ఇచ్చానని చెప్పాడు. వారమైనా బైక్‌ రాకపోవడంతో గట్టిగా నిలదీశారు. తాకట్టు పెట్టానని చెప్పడంతో అవాక్కయ్యారు. కొడుకు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనన్న భయంతో తామే అసలు, వడ్డీ చెల్లించి బైకును విడిపించారు.

- చీపురుపల్లి మండలం ఓ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఆన్‌లైన్‌ గేమ్‌లను డబ్బులకు ఆడటం అలవాటు చేసుకున్నాడు. ఫీజులు, పుస్తకాల పేరుతో ఇంట్లో కొన్నాళ్లు డబ్బులు తీసుకున్నాడు. ఆపై బయట వడ్డీలకు మనీ తీసుకుని చెల్లించలేకపోయాడు. ఒత్తిడి పెరగడంతో తన వద్ద నున్న బంగారం ఉంగరాన్ని అమ్మేశాడు. తల్లిదండ్రులు అడిగితే పోయిందని నమ్మబలికాడు. పరీక్షలు తప్పిన తర్వాత కళాశాలకు వెళ్లి తల్లిదండ్రులు ఆరా తీస్తే కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు.

గజపతినగరం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): యువకులు వక్రదారి పడుతున్నారు. చెడు సహవాసాలు.. అధిక సెల్‌ఫోన్‌ వినియోగం.. వారిని పక్కదారి పట్టిస్తున్నాయి. బెట్టింగ్‌లకు అల వాటు పడడం మరింత ప్రమాదకరంగా మారుతోంది. పర్యవసానంగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. ఆ సమయానికి ఎంత వడ్డీ అయినా పర్వాలేదు అప్పుదొరికితే చాలన్నట్లు అనిపిస్తోంది. తీరా తాను అనకున్నట్లు జరగకుంటే, గేమ్‌లో ఓడితే తట్టుకోలేకపోతున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా రోజువారీ వడ్డీ కింద రూ.లక్షకు రూ.1000 వసూలు చేస్తుండడం దారుణం. వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి మరింతగా కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. గజపతినగరంలో బయటకు పొక్కని అనేక ఘటనలు ఇటీవల జరిగాయి. విజయనగరం, బొబ్బిలి, రాజాం తదితర పెద్ద పట్టణాల్లోనూ యువత అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అప్పు తీర్చడం కోసం ఇంకొందరు గంజాయి రవాణాదారులుగా మారుతున్నారు. ఆ క్రమంలో కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో కొంతకాలంగా గంజాయి రవాణాపై నమోదైన కేసుల్లో చాలా మంది యువకులు అరెస్టు అయ్యారు. వారిలో కొందరు బెయిల్‌ కూడా రాక నేటికీ విశాఖ సెంట్రల్‌ జైలులో మగ్గుతున్నారు.

ఫ మద్యం మత్తు కూడా చాలా మందిని ముంచుతోంది. స్నేహితులు తాగుతున్నారు తానూ వెళ్లాలని భావించి ఆ సమయానికి డబ్బులు లేకపోతే వ్యాపారుల వద్ద బైక్‌, ఉంగరం లాంటివి పద్దు పెట్టి చెడుమార్గంలో వెళ్తున్నారు. ఆరోజు అవసరం తీరిపోవాలని మాత్రమే భావిస్తున్నారు. వారి చేత ఖాళీ నోట్లపై సంతకాలు తీసుకొని వ్యాపారులు అప్పులు ఇస్తున్నారు. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో తిరిగి వసూలు చేయడం నానాటికీ ఎక్కువవుతోంది.

- క్రికెట్‌ బెట్టింగ్‌లు, కోడిపందాలు, పేకాటకు అలవాటు పడిన యువత తమ వద్ద ఉన్న టీవీలు, సెల్‌ఫోన్‌లు, బైకులు, కార్లు వంటి వస్తువులతో పాటు పొలాల డ్యాకుమెంట్లు తాకట్టుపెట్టి అప్పుతీసుకుంటున్నారు. ఆటల్లో గెలిచి అప్పులు తీర్చేద్దామని భావించి రెండింటికీ చెడిపోతున్నారు. గజపతినగరం పట్టణంలో రోజువారీ వడ్డీ కింద లక్షల రూపాయాల్లో లావాదేవీలు జరుగుతున్నాయని సమాచారం. వడ్డీలు చెల్లించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా వీరి వేధింపులు మామూలుగా ఉండవు. ఎదురు తిరిగితే కోర్టు నోటీసులు అంటు బెదిరిస్తున్నారు.

యువత చెడు మార్గాలను వీడాలి

యువత చెడు మార్గాలను వీడాలి. కొందరు మత్తు పదార్థాలకు బానిస కావడంతో వారి జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టిసారించాలని అవగాహన సదస్సుల్లో కోరుతున్నాం. గంజాయి, డ్రగ్స్‌వంటి వాటికి అలవాటు పడి అప్పులు చేసి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.

కె.కిరణ్‌కుమార్‌ నాయుడు, ఎస్‌ఐ, గజపతినగరం

Updated Date - Feb 06 , 2026 | 12:13 AM