Share News

జిల్లాలో దోమలు ఉండకూడదు

ABN , Publish Date - May 14 , 2026 | 11:47 PM

జిల్లాలో లార్వావేట కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని, రానున్న 15 రోజుల్లో జిల్లాలో ఒక్క దోమ కూడా కనిపించరాదని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 జిల్లాలో దోమలు ఉండకూడదు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- లార్వాను పూర్తిగా నిర్మూలించాలి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, మే 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో లార్వావేట కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని, రానున్న 15 రోజుల్లో జిల్లాలో ఒక్క దోమ కూడా కనిపించరాదని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఫాగింగ్‌ చేసినంత మాత్రాన దోమల నివారణ సాధ్యం కాదని, దోమల ఉత్పత్తి కేంద్రాలైన లార్వాను పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పల్లెలు, వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల అనుమతితో నీటి నిల్వలు ఉన్న పాత్రలు, తొట్టెలు, మిద్దెలు పరిశీలించి ఎండబెట్టాలన్నారు. వరి పైర్లలో కూడా దోమల పెరుగుదలకు అవకాశం ఉంటుందని, రైతులు మలేరియా వంటి వ్యాధులకు గురికాకుండా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. వరి సాగుచేసే రైతులు బంతి పూలమొక్కలను పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ శుక్రవారం నుంచి వచ్చే శు క్రవారంలోపు లార్వావేట లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఫార్మర్స్‌ యాప్‌కు కూడా అంతే ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రజలు, రైతులకు ఈ యాప్‌ల వినియోగంపై అవగాహన కల్పించి సేవలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని 861 ఆర్‌ఎస్‌కే ఇన్‌చార్జిలు బాధ్యతగా పనిచేయాలన్నారు. సచివాలయ సిబ్బంది అందరూ తప్పనిసరిగా హాజరు నమోదు చేసిన తర్వాతనే సర్వేలకు వెళ్లాలన్నారు. జనగణన సమయంలోనే కుటుంబ సభ్యులకు మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు జీవిత నైపుణ్యాలను నేర్పించాలి..

పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలను కూడా నేర్పించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మండల విద్యాశాఖాధికారులకు ఉద్భోదించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంఈవోలతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, పాఠశాలలను తమ సొంత ఇళ్లుల్లా భావించి పిల్లల అభివృద్ధికి సమగ్ర దృష్టితో పనిచేయాలన్నారు. పాఠశాల వాతావరణం స్నేహపూర్వకంగా కుటుంబ సభ్యుల మాదిరిగా ఉండాలని, డ్యూటీ అనే భావన కంటే ఇది మన జీవితం అనే ఆలోచనతో ఉపాధ్యాయులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు ఈత, సైకిల్‌ తొక్కడం, ముడు వేయడం, వంట చేయడంతో పాటు ప్రాణాపాయ స్థితిలో తమను తాము కాపాడుకోవం వంటి ప్రాథమిక జీవన నైపుణ్యాలు నేర్పించాలని సూచించారు. ముస్తాబు కార్యక్రమాన్ని పరిశు భ్రత, క్రమశిక్షణ, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించే విధంగా అమలు చేయాలని నిర్ణయించారు. పిల్లలకు చిన్న వయసులోనే ఆహారం, పోషకాహారం, ప్రోటీన్లు, క్యాలరీలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో అమలవుతున్న ముస్తాబు కార్య క్రమానికి మెంటార్‌గా కలెక్టర్‌ ఎంపిక కావడంపై విద్యాశాఖ తరఫున అధికారులు ఆయన్ను అభినందిస్తూ దుశ్శాలువ, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. ఈసమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 11:47 PM