రీసర్వేలో తప్పిదాలు ఉండకూడదు
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:19 AM
గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.
- అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
గరుగుబిల్లి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గురువారం గిజబలో నిర్వహిస్తున్న రీసర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు అసౌకర్యం కలగకుండా అత్యంత పారదర్శకంగా రీసర్వే నిర్వహించాలన్నారు. గతంలో మాదిరిగా రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు ఉంటే సహించేది లేదన్నారు. సర్వే నిర్వహణకు ముందు రైతులకు నోటీసులు అందించడంతో పాటు ఈకేవైసీ విధిగా చేయించాలన్నారు. గ్రౌండ్ ట్రూలింగ్ చేయడానికి రెండు రోజుల ముందుగానే ప్రతి రైతుకూ సమాచారం అందించాలన్నారు. సర్వేలో భాగంగా ఎఫ్‌పీవోఎల్‌ఆర్ పనులకు ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నోషనల్ ఖాతాలో ఉన్న భూములకు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని సరిహద్దు మార్కింగ్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. రైతులు సర్వే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం సర్వే బృందాల పనితీరు, రికార్డులను నిశితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సమాచారం అందించాలని రైతులకు సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, తహసీల్దార్ పి.బాల, మండల సర్వేయర్ ఎం.వెంకటరమణ, వీఆర్‌వో టి.రవికుమార్, ఎంపీటీసీ సభ్యుడు ఎం.సింహాచలంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.