జల హారతి పనుల్లో జాప్యం తగదు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:18 AM
మండలంలో చేపడుతున్న జలధార జల హారతి పనుల్లో తీవ్ర జాప్యం జరుగు తోందని.. ఇది తగదని డీఎల్‌డీవో హేమసుందరరావు హెచ్చరించారు.
డీఎల్‌డీవో హేమసుందరరావు
రాజాం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): మండలంలో చేపడుతున్న జలధార జల హారతి పనుల్లో తీవ్ర జాప్యం జరుగు తోందని.. ఇది తగదని డీఎల్‌డీవో హేమసుందరరావు హెచ్చరించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువులు, పిల్ల కాలువల పనులు 209 మంజూరైతే.. ఇంతవరకు 131 పనులు ప్రారంభం కాగా, వాటిలో 35 పనులు పూర్తి కాగా, 96 పనులు మాత్రమే చేస్తున్నారని.. మిగిలిన పనుల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారని డీఎల్‌డీవో ప్రశ్నించారు. పనులు సకాంలో పూర్తిచేస్తే ఇంకా అవసరమైన పనులకు అనుమతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఒక్కొక్కరి పరిధిలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి.. ఎన్ని పనులు పూర్తిచేశారు.. మిగిలిన పనులు చేయకపోవడానికి కారణం ఏమిటని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆయన ప్రశ్నించారు. మంజూరు కాని పనులు ఉంటే న దృష్టికి తీసుకువస్తే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి.. పనులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆనందరావు, డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.