There is water.. but no one provides it. నీరుంది.. అందించేవారే లేరు
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:16 AM
There is water.. but no one provides it. ఎస్.కోట నియోజకవర్గంలోని విజయరామసాగరం, నాగారాయడు చెరువు, చిలకల గెడ్డపై మినీ రిజర్వాయర్‌లు నిర్మిస్తే వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఇదే విషయాన్ని ఆ ప్రాంతాల రైతులు అనేకసార్లు నేతలు, అధికారులకు విన్నవించారు. నేతలేమో చేద్దామంటున్నారు. అధికారులేమో ప్రభుత్వానికి నివేదిస్తామంటున్నారు. సంవత్సరాలుగా కార్యాచరణ మాత్రం లేదు. ఈ ప్రభుత్వంలోనైనా కదలిక వస్తుందేమోనని రైతులు ఆశతో ఉన్నారు.
నీరుంది.. అందించేవారే లేరు
సాగునీటి వనరులపై నేతల నిర్లక్ష్యం
మినీ రిజర్వాయర్ల నిర్మాణం కలేనా?
అన్నదాతల ఆవేదన
వర్షాధారంపైనే సాగు
ఎస్.కోట నియోజకవర్గ రైతులకు తప్పని కష్టాలు
ఎస్.కోట నియోజకవర్గంలోని విజయరామసాగరం, నాగారాయడు చెరువు, చిలకల గెడ్డపై మినీ రిజర్వాయర్‌లు నిర్మిస్తే వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఇదే విషయాన్ని ఆ ప్రాంతాల రైతులు అనేకసార్లు నేతలు, అధికారులకు విన్నవించారు. నేతలేమో చేద్దామంటున్నారు. అధికారులేమో ప్రభుత్వానికి నివేదిస్తామంటున్నారు. సంవత్సరాలుగా కార్యాచరణ మాత్రం లేదు. ఈ ప్రభుత్వంలోనైనా కదలిక వస్తుందేమోనని రైతులు ఆశతో ఉన్నారు.
ఇది వేపాడ మండలం కొండగంగుబూడి పంచాయతీ పరిధిలోని విజయరామసాగరం ఆనకట్ట. దీనిపై మినీ రిజర్వాయర్ నిర్మాణానికి నలభై ఐదు సంవత్సరాల క్రితమే అడుగులు పడ్డాయి. అనుకున్నట్లు పూర్తయితే మూడు మండలాలకు చెందిన 15 గ్రామాలకు సాగునీరు అందుతుంది. 23 చెరువుల కింద దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూమి సశ్యస్యామ లమవుతుంది. నిర్మించకపోవడంతో వర్షాకాలంలో మారిక కొండల నుంచి వచ్చే వరద నీటి సామర్థ్యాన్ని ఈ అనకట్ట తట్టుకోలేకపోతోంది. నీరంతా కిందికి వృథాగా పోతోంది.
ఫ వేపాడ మండలం వీలుపర్తి గ్రామ పరిధిలో ఉన్న నాగారాయడు చెరువిది. దీనిపై మినీ రిజర్వాయర్ నిర్మించాలని రైతులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మినీ రిజర్వాయర్ నిర్మాణానికి విశాఖ డెయిరీ చైర్మన్‌ను సహకారం అడిగారు. వారు సానుకూలంగా స్పందించినా కలెక్టర్ నుంచి పరిపాలన అనుమతులు రాకపోవడంతో ప్రతిపాదనల దశలోనే ఆగిపోయింది. దీంతో మారిక కొండల నుంచి వచ్చే వరద నీరంతా గెడ్డలు, వాగుల ద్వారా సముద్రం పాలవుతోంది.
ఫ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో వున్న చిలకలగెడ్డ శృంగవరపుకోట మండల పరిధిలోని పది గ్రామాలకు సాగునీరు అందిస్తుంది. ప్రస్తుతం చిలకల గెడ్డ ఆనకట్ట ఆధ్వానంగా ఉంది. పుడికలతో పాటు పొందలతో నిండి వుంది. మూడు దశబ్దాలుగా చిలకల గెడ్డ ఆనకట్టను మినీ రిజర్వాయర్‌గా నిర్మిస్తామని నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ అమలకు నోచుకోవడం లేదు. దీంతో అరకు, అనంతగిరి కొండల నుంచి వస్తున్న నీరంతా తాటిపూడి జలాశయంలో చేరుతోంది. వర్షాకాలంలో తాటిపూడి సామర్థ్యానికి మించి నిండడంతో నీటిని కిందికి వృథాగా వదిలేస్తున్నారు. ఇక్కడ మినీ రిజర్వాయర్‌గా నిర్మాణం జరిగితే ఆ నీరంతా ఇక్కడే నిల్వ ఉంటుంది. మరో పది వేల ఎకరాలకు నీరు అందుతుంది.
శృంగవరపుకోట, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి):
శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో సమృద్ధిగా సాగునీటి వనరులు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేసేవారే కరవుయ్యారు. మూడు ప్రాంతాల్లో మినీ రిజర్వాయర్‌ల నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశాలున్నప్పటికీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కనిపించకపోవడంతో రైతుల ఘోష వినిపించడం లేదు. ఈ నియోజకవర్గానికి ఆనుకుని వున్న గంట్యాడ మండల పరిధిలో తాటిపూడి రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ నుంచి శృంగవరపుకోట మండల పరిధిలోని ఓ ఐదారు గ్రామాలు, జామి మండలంలోని నాలుగైదు గ్రామాలకు సాగునీరు అంది స్తున్నారు. ఎక్కువ నీటిని విశాఖనగర పాలక సంస్థకు పైపుల ద్వారా తరలించుకుపోతున్నారు. మరో వైపు ఈ నియోజకవర్గానికి ఆనుకుని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల పరిధిలో రైవాడ రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ నుంచి వేపాడ మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి పైపులైన్ల ద్వారా తాగునీరు విశాఖ నగర పాలక సంస్థకు తీసుకుపోతున్నారు. కళ్లెదుటే నీరు పారుతున్నా బిందెడు నీరు పట్టుకోలేరు. ఈ రెండు రిజర్వాయర్‌ల నుంచి ఈ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందిస్తామని నిర్మాణాల సమయంలో ప్రభుత్వాలు మాటిచ్చాయి. దశాబ్దాల కాలం కరిగిపోతున్నా ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోలేదు.
కొండల్లో నుంచి వర్షపు నీరు
ఎస్.కోట నియోజకవర్గం పరిధిలో చుట్టూ మారిక కొండలున్నాయి. వీటిల్లో ఏమాత్రం వర్షం కురిసినా నీరంతా వాగులు, గెడ్డల ద్వారా కిందకు పారుతుంది. వీటి నుంచి పలు చెరువులు నిండుతున్నాయి. ఈ విధంగానే వేపాడ మండల పరిధిలోని విజయరామసాగరం, నాగరాయడు చెరువుల్లో నీరు వచ్చి చెరుతుంది. ఈ నేపథ్యంలో వాటిపై మినీ రిజర్వాయర్‌లు నిర్మిస్తే నీరంతా గెడ్డల నుంచి ప్రవహిస్తూ సముద్రం పాలు కాదు. అల్లూరి సీతారారాజు జిల్లా అనంతగిరి మండలానికి ఆనుకుని వున్న చిలకలగెడ్డ అనకట్ట పరిస్థితి కూడా ఇంతే. మినీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టకపోవడంతో కొండల్లో పడిన వర్షపు నీరంతా గోస్తనీ నది ద్వారా బంగాళాఖాతంలో కలిసిపోతుంది.
ఫ వేపాడ మండలం కొండగంగుబూడి పంచాయతీ పరిధిలోని మారిక-విరాట కొండల మధ్య వున్న రెండు చెరువులను కలిపి మినీ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని 1981లో ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిదివేల ఎకరాల వరకు సాగునీరు అందించాలని లక్ష్యం. రూ.5.92 లక్షలతో 1981లో అప్పటి చిన్ననీటి పారుదల శాఖా మంత్రి గొర్లె శ్రీరాములనాయుడు విజయరామ సాగర్ చెరువు అభివృద్ధికి భూమి పూజ చేశారు. 1983లో ప్రభుత్వం రూ.8లక్షలు అందించింది. రూ.5లక్షల పనులు మాత్రమే చేపట్టారు. మిగిలిన నిధులు వెనక్కి మళ్లాయి. 2011లో విశాఖ ఎంపి దగ్గుబాటి పురందేశ్వరీ చొరవతో కొంత అభివృద్ధి జరిగింది. అంతకు ముందు 2003, 2007 సంవత్సరాల్లో నీటిపారుదల శాఖా మంత్రులుగా పని చేసిన కె.ఈప్రభాకర్, వెంకటేశ్వర్లు ఈ విజయరామసాగర్ అనకట్టను సందర్శించారు. నిధులు మంజూరు చేస్తామని చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. గత రెండు దశాబ్దాలుగా దీని ఊసెత్తేవారే కనిపించడం లేదు.
ఫ వీలుపర్తి నాగారాయుడు చెరువుకు ఇరువైపులా కొండలు వుంటాయి. వీటి మధ్య అనకట్ట నిర్మాణం చేపడితే వీలుపర్తి, వేపాడ.వల్లంపూడి, ఆతవ, సీతంపేట, సింగరాయి, బానాది, బల్లంకి తదితర గ్రామాలకు చెందిన దాదాపు ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
ఫ చిలకలగెడ్డ అనకట్ట అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో వున్నప్పటికీ దీనిపై మినిరిజర్వాయర్‌ను నిర్మిస్తే బొడ్డవర, ముషిడిపల్లి, కిల్తంపాలెం, ఎస్.కోట, సీతంపేట, పోతనాపల్లి, సంతగైరమ్మ పేట దర్మవరం తదితర గ్రామాలకు చెందిన రెండు వేల ఎకరాలకు పైబడి పంటకు సాగునీరు అందుతుంది.