There is no train bus.. no train రైలు బస్సు లేదు.. రైలూ లేదు
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:50 PM
There is no train bus.. no train బొబ్బిలి-సాలూరు మధ్య నడిచే రైలుబస్సును కరోనా కాలంలో నిలిపివేసిన తరువాత ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేసే అనేక మంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ద్వారా రైల్వే శాఖ ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా వినడం లేదు.
రైలు బస్సు లేదు..
రైలూ లేదు
విశాఖ నుంచి బొబ్బిలి మీదుగా సాలూరుకు రైలు పొడిగింపు ఎప్పుడో?
ట్రయల్ రన్‌తో సరి
ప్రయాణికుల్లో నిరాశ
రైలు బస్సునూ పునరుద్ధరించని రైల్వే అధికారులు
బొబ్బిలి-సాలూరు మధ్య నడిచే రైలుబస్సును కరోనా కాలంలో నిలిపివేసిన తరువాత ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేసే అనేక మంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ద్వారా రైల్వే శాఖ ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా వినడం లేదు. రైలుబస్సును నడపలేమని రైల్వే శాఖ చెబుతున్నట్లు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గతంలో చెప్పారు. ఈ పరిస్థితిలో విశాఖ నుంచి విజయనగరం వచ్చే పాసింజర్ రైలును బొబ్బిలి మీదుగా సాలూరు వరకు పొడిగిస్తామని చెప్పడమే కాదు రెండేళ్ల కిందట ట్రయల్ రన్ కూడా చేపట్టారు. ఆ తర్వాత దీనిని కూడా విస్మరించారు.
బొబ్బిలి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి-సాలూరు పట్టణాల మధ్యలో నడిచే రైలు బస్సుతో స్థానిక ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉండేది. వందలాది మంది చిరు వ్యాపారుల ఉపాధికి భరోసా లభించేది. 2020లో కరోనా దెబ్బకు రైలు బస్సును రైల్వే శాఖ ఆపేసింది. బ్రిటీషు కాలం నాటి నుంచి నడిచిన ఈ సర్వీసును ఎత్తివేశాక స్థానిక ప్రయాణికులు చాలా బాధ పడ్డారు. పునరుద్ధరించాలని విన్నపాలు అందించారు. ఉన్నతాధికారుల వల్ల వద్ద ప్రస్తావిస్తూ వచ్చారు. ఎన్ని చేసినా రైల్వే శాఖ వినలేదు. అయితే విశాఖ నుంచి విజయనగరం వరకు నడుస్తున్న మెము రైలు సర్వీసును బొబ్బిలి మీదుగా సాలూరు వరకు పొడిగిస్తూ రెండేళ్ల కిందట రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ పరిణామంతో బొబ్బిలి, సాలూరు ప్రాంతీయులు చాలా సంతోషించారు. ఈ సర్వీసును ఎప్పటి నుంచి నడిచేదీ రెండుమూడురోజుల్లో ఆదేశాలు వస్తాయని అప్పట్లో రైల్వే అధికారులు ప్రకటించారు. ఏమైందో ఏమో కాని ఇప్పటివరకు ఈ లైనులో రైలు కూత వినిపించలేదు.
సాలూరులో రైల్వే స్టేషన్‌ను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ పాలకులు నిర్మించారు. ఒడిశాకు సరుకు రవాణాకు ఈ రైల్వే స్టేషన్‌ను వినియోగించారు. సాలూరుకు గోధుమల రవాణా కూడా జరిగేది. సాలూరు-బొబ్బిలి మధ్య తొలుత బొగ్గుతో నడిచే రైలు, ఆ తర్వాత డీజిల్ ఇంజన్‌తో ట్రైన్ నడిచేది. నష్టాలు వస్తున్నాయని సాలూరు రైల్వే స్టేషన్‌ను 1998లో ఎత్తివేశారు. రైలు బస్సును మాత్రం నడిపారు. ఇది బొబ్బిలి- సాలూరు మధ్య ఐదు ట్రిప్పులు నడిచేది. దండిగాం రోడ్డులో స్టేజ్ ఏర్పాటు చేశారు. ఇదంతా నేడు చరిత్రగా చెప్పుకోవాల్సి వస్తోంది.
ఎందుకు ఆపినట్టో?
పాసింజర్ రైలును సాలూరుకు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఈ ప్రాంతీయులు చాలా సంతోషించారు. అంతేకాక సాలూరు- బొబ్బిలి రైల్వే మార్గాన్ని విద్యుదీకరించారు. డీఆర్‌ఎం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ సైతం చేశారు. ఈస్ట్‌కోస్టు రైల్వే విభాగం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరే పాసింజర్ రైలు రాత్రి 7.25 గంటలకు విజయనగరం చేరుతుంది. ఈ రైలు విజయనగరం స్టేషన్‌లో మరుసటిరోజు ఉదయం 6.15 నిమిషాల వరకు ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్లాట్‌ఫారం సమస్య సైతం ఏర్పడింది. రాత్రి సమయంలో ఈ రైలు వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు సిగ్నల్ ఇవ్వడానికి సమస్య వస్తోంది. ఈ నేపథ్యంలో ఏ రద్దీ లేని సాలూరు స్టేషన్‌లో ఉంచడమే ఉత్తమంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే భావించింది.
షెడ్యూల్ ప్రకటించి కూడా..
సాలూరు వరకు నడిచే పాసింజర్ రైలు షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ప్రతి రోజు విశాఖలో ఆ రైలు సాయంత్రం 6.30 నిమిషాలకు బయలుదేరుతుంది. విజయనగరానికి రాత్రి 7.45 గంటలకు చేరుకుంటుంది. రాత్రి 7.50 గంటలకు విజయనగరంలో బయలుదేరి రాత్రి 8.50 నిమిషాలకు బొబ్బిలి చేరుకుంటుంది. రాత్రి 9.10 గంటలకు బొబ్బిలిలో బయలుదేరి రాత్రి 10 గంటలకు సాలూరు చేరుకుంటుంది. సాలూరులో మరుసటిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ రైలు విశాఖకు బయలుదేరుతుంది. ఈ రైలు ఉదయం 4.50 గంటలకు బొబ్బిలి, విజయనగరం 6.05 గంటలకు, విశాఖ ఉదయం 7.30 గంటలకు చేరుకుంటుంది. ఇంతలో షెడ్యూల్ ఇచ్చి కూడా రైలు పొడిగింపు నిర్ణయాన్ని అటకెక్కించారు.
రైలు సర్వీసును ప్రారంభించాలి
శంకరరావు, ప్రయాణికుల సంఘం ప్రతినిధి
పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడినందున గిరిజన గ్రామాలవారికి, ఏజన్సీ ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు పార్వతీపురం జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు బొబ్బిలి-సాలూరు రైలు సర్వీసు చాలా ఉపయోగపడుతుంది. పాచిపెంట, సాలూరు, మక్కువ ప్రాంతాలకు చెందిన వారంతా వ్యయప్రయాసలు లేకుండా రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉంటుంది. ట్రయల్ రన్‌తో సరిపెట్టి రైల్వేశాఖ చేతులు దులుపుకోవడం అన్యాయం. ఎంపీలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు బొబ్బిలి-సాలూరు-విశాఖ రైలు సర్వీసును వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా ఒత్తిడి తీసుకురావాలి.