జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:34 PM
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వినియోగదారులు అనవసర భయాందోళనకు గురికావద్దని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి అన్నారు.
- వినియోగదారులు ఆందోళన చెందవద్దు
- బంకులను రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలి
- కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
గుర్ల/విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వినియోగదారులు అనవసర భయాందోళనకు గురికావద్దని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి అన్నారు. గుర్ల మండలంలోని పలు పెట్రోల్ బంకులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి జిల్లాలో ఎటువంటి పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రజలకు నిరంతరాయంగా ఇంధనం అందుబాటులో ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం గుర్ల మండలంలోని గుజ్జంగివలస సచివాలయం, పెనుబర్తి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. అంగన్‌వాడీ చిన్నారులతో కలెక్టర్ మమేకమై వారి ఆరోగ్యం, పోషకాహారం, విద్యా కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది కావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
- జిల్లాలో పెట్రోల్, డీజిల్ అంశం సద్దుమనిగే వరకూ రెవెన్యూ అధికారులు బంకుల వద్ద పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు పెట్రోల్ అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ ప్రాజెక్టులపై సమీక్షిస్తూ భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. విజయనగరం -సంబలపూర్ మూడో రైల్వే లైన్ పనులకు వారం రోజుల్లో విత్ డ్రావల్ ప్రపోజల్స్ పంపించాలన్నారు. విజయనగరం నాలుగో లైన్, ఖుర్దా రోడ్ విజయనగరం మూడో లైన్ పనులకు గజిట్ నోటిఫికేషన్లు సిద్ధం చేయాలన్నారు. జాతీయ రహదారులైన ఎన్‌హెచ్-5168(పెందుర్తి-బొబ్బిలి), ఎన్‌హెచ్-130 సీడీ రాయపూర్ -విశాఖపట్నం పనుల్లో వస్తున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్‌వో సత్తిబాబు, ఎస్‌డీసీలు తదితరులు పాల్గొన్నారు.