Share News

గ్యాస్‌ రాదు.. కట్టెలు లేవు

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:08 AM

మండలంలోని రామభద్రపురం, ఆరికతోట, పారాపురం, కొట్టిక్కి తదితర గ్రామాల్లో టి దుకాణాలు, టిఫిన్‌, భోజనం హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య గ్యాస్‌ అందుబాటులో లేక, కట్టెలు లభ్యం కాక నిర్వహణకు అగచాట్లకు గురవుతున్నారు.

గ్యాస్‌ రాదు.. కట్టెలు లేవు

రామభద్రపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రామభద్రపురం, ఆరికతోట, పారాపురం, కొట్టిక్కి తదితర గ్రామాల్లో టి దుకాణాలు, టిఫిన్‌, భోజనం హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య గ్యాస్‌ అందుబాటులో లేక, కట్టెలు లభ్యం కాక నిర్వహణకు అగచాట్లకు గురవుతున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడుల నేపథ్యంలో హార్మోజ్‌ జలసంది గుండా గ్యాస్‌, చమురు రవాణాకు నెలరోజులుగా ఆటంకం కలుగుతున్న విషయం విదితమే. దీంతో దేశంలో కూడా అనుకున్న స్థాయిలో గ్యాస్‌ నిల్వలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్‌ వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈనేపథ్యంలో హోటళ్ల నిర్వహణపై ప్రభావం పడింది. ప్రస్తుతం రామభద్రపురంలో సుమారు 35 హోటళ్లు, బజ్జీ షాపులు 15 వరకు, టీ, టిఫిన్‌షాపులు 30, ఆరికతోట ఆరు హోటళ్లు, పారాపురం, కొట్టిక్కిలో పలు హోటళ్లు, టీ దుకాణాల నిర్వాహకులు వాణిజ్య గ్యాస్‌ అందుబాటులో లేకపోవడంతో కట్టెలపై ఆధారపడుతున్నారు. దశాబ్దకాలంగా గ్యాస్‌ వినియోగం పెరగడంతో అటవీ ప్రాంతాల నుంచి కట్టెల సేకరించడానికి స్థానికంగా పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కట్టెలతోనైనా హోటళ్లు నిర్వహించాలని భావిస్తున్నా అనుకున్న స్థాయిలో లభ్యంకావ డంలేదు. దీంతో కొందరు మూత వేస్తున్నారు. మరికొందరు అధిక ధరకు కట్టెలు, గ్యాస్‌ కొనుగోలు చేసి నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా చూసుకొని హోటళ్ల నిర్వాహకులు భోజనాలు, టిఫిన్లు, టీ ధరలు అమాంతంగా రెండింతలు పెంచే శారని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. కాగా రామభ ద్రాపురంలో ప్రతిరోజూ జరిగే కూరగాయల మార్కెట్‌కు చత్తీస్‌ఘడ్‌, ఒడిశాతోపాటు రాష్ట్రంలోని వివిద ప్రాంతాల నుంచి వెయ్యి మంది వరకూ వ్యాపార లావాదేవీల నిర్వహణకు వస్తుంటారు. ఇక్కడ వేకువజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మార్కెట్‌ జరుగుతుంది. దీంతో ఇక్కడకు వచ్చే వారంతా టీ, టిఫిన్లకోసం స్థానికంగా ఉండే హోటళ్లపై ఆధారపడుతుంటారు. అయితే గ్యాస్‌ కొరత నేపథ్యంలో టి, టిఫిన్ల ధరలను వ్యాపారులు పెంచేశారని క్రయవిక్రయాలకు వచ్చే వారంతా వాపోతున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:08 AM