Share News

There is land.. no guarantee భూమి ఉంది.. భరోసా లేదు

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:37 AM

There is land.. no guarantee రైతుల వద్ద భూములున్నా అవి తమ దగ్గర ఉంటాయో, ఉండవో తెలియదు. ప్రభుత్వం అడుగుతోంది కానీ ఎప్పుడు తీసుకుంటుదో చెప్పడం లేదు. నష్టపరిహారం ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? స్పష్టత లేదు.

There is land.. no guarantee భూమి ఉంది.. భరోసా లేదు
పోలవరం కాలువలో పోతున్న భూములు

భూమి ఉంది.. భరోసా లేదు

భూ సేకరణ చేపడతామని అధికారుల ప్రకటన

అంతలోనే మిన్నకుండిపోతున్న వైనం

అమ్ముకునేందుకు రైతుల ఆపసోపాలు

అనుమానాలతో కొనడానికి రాని వ్యక్తులు

నాలుగు జిల్లాల రైతులకు నరకయాతన

12 ఏళ్లుగా అయోమయం

కదలిక లేని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు

రైతుల వద్ద భూములున్నా అవి తమ దగ్గర ఉంటాయో, ఉండవో తెలియదు. ప్రభుత్వం అడుగుతోంది కానీ ఎప్పుడు తీసుకుంటుదో చెప్పడం లేదు. నష్టపరిహారం ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? స్పష్టత లేదు. అవసరానికి భూములు అమ్ముకుందామంటే అనుమానాలతో ఎవరూ ముందుకు రావడం లేదు. కొందరైతే ‘ఆ భూములా... ప్రాజెక్టులో పోయావట’ అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కారణంగా ప్రాజెక్టు ప్రతిపాదిత భూముల రైతుల అగచాట్లు ఇవీ. భూమి ఉన్నా భరోసా లేదని, 12 ఏళ్లుగా నరకయాతన పడుతున్నామని నాలుగు జిల్లాల రైతులు వాపోతున్నారు.

కొత్తవలస, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి):

- అయ్యా.. పిల్లకు పెళ్లి చేయాలి. మా భూమి అమ్మాలనుకుంటున్నా కొనుగోలు చేసుకుని డబ్బులు ఇవ్వండయ్యా! అంటూ ఓ రైతు విన్నపం

- నా కొడుకు ఉన్నత చదువు కోసం కోచింగ్‌ తీసుకుంటానని, నగరానికి వెళ్లి చదువుకుంటానని అంటున్నాడు. లక్షల రూపాయల్లో ఫీజు కట్టాలి. భూమి తీసుకుని కొంత డబ్బులైనా ఇవ్వండి అంటూ నిస్సహాయ స్థితిలో మరో రైతు

- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భూమి పోతుందట.. పంటకాలువలో కలిసిపోయే భూమి మాకు అమ్మి చేతులు దులుపుకోవాలనుకుంటున్నావా అంటూ బయట వ్యక్తుల ఎగతాళి మాటలు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కింద విశాఖపట్నం జిల్లా నుంచి విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా వరకు ప్రాజెక్టు ప్రతిపాదిత భూములకు చెందిన రైతుల పరిస్థితి ఇది. అధికారులు భూములు తీసుకోరు రైతులకు నష్ట పరిహారం ఇవ్వరు. అలాగని భూములు అమ్ముకోవాలంటే సాధ్యంకాకపోగా ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎగతాళి మాటలతో అవమానాలూ తప్పడం లేదు.

ప్రాజెక్టు ఆరంభం ఇలా..

పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు తాగు,సాగు నీరుగా ఇవ్వాలని 30 ఏళ్లుగా ప్రతిపాదన ఉన్నప్పటికీ గత టీడీపీ ప్రభుత్వం(2014-19) ఆచరణ దిశగా అడుగులు వేసింది. నాలుగు జిల్లాల్లో భూ సేకరణకు శ్రీకారం చుట్టారు. ప్రాథమికంగా సర్వే చేపట్టారు. ఏ గ్రామంలో ఏఏ సర్వే నెంబర్లలో భూములు సేకరించాలో నిర్ధారణకు వచ్చారు. ఆ సమయంలో రైతులు భూములు పోతున్నాయని తెలిసి బాధ పడ్డారు. పరిహారంపై అధికారులు భరోసా ఇచ్చాక భూములు ఇచ్చేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. పరిహారం డబ్బులతో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చునని, పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవచ్చునని భావించారు. ఆ తరువాత ప్రాజెక్టు నిర్మాణంపై వేగం తగ్గింది. అధికారులు భూముల వైపు రాలేదు. ఈ లోగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం స్థానంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ వచ్చిన తరువాత మొదట్లో పోలవరం ప్రాజెక్టు గురించి చాలా హడావుడి చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కింద భూముల సేకరణకు ఎలా ముందుకెళ్లాలి.. ఎంత వెడల్పు వరకు భూములు సేకరించాలి? భూములు ఏఏ సర్వే నెంబర్లలో ఉన్నాయనే వివరాలను ఆరా తీసి హద్దురాళ్లను కూడా వేసేసారు. ఇది జరిగాక అధికారుల్లో మళ్లీ వేగం తగ్గింది. ఈ లోగా వైసీపీ ప్రభుత్వం కూడా అధికారం కోల్పోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా కలెక్టర్‌ ఈ పథకం కింద భూముల సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిణామాలూ జరగడం లేదు.

కళ్ల ముందే ఇతర ప్రాజెక్టులకు చెల్లింపులు

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు తరువాత కొత్తగా ఈ నాలుగు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులను అమలులోకి తీసుకొచ్చింది. వాటిలో ఒకటి విశాఖ నుంచి రాయపూర్‌ వరకు చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే. విశాఖ నుంచి శృంగవరపుకోట వరకు నూతనంగా వేస్తున్న మరో హైవే, అలాగే రైల్వేలైన్ల విస్తరణకు భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే కొంతమందికి నష్ట పరిహారం కూడా చెల్లించేసింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భూములు కోల్పోతున్న రైతులు మాత్రం నష్ట పరిహారం కోసం ఎదురుచూపులే మిగిలాయంటున్నారు.

అప్పులు చేయాల్సి వచ్చింది

పిల్లల చదువు కోసం, పెళ్లిళ్ల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. నష్ట పరిహారం డబ్బులు వస్తాయని ధీమాగా ఉన్నాను. 12ఏళ్లు పూర్తయినా ఎటువంటి స్పందన లేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఒకవేళ నష్ట పరిహారం చెల్లించినా ఆ డబ్బులు అసలుపై వడ్డీకే సరిపోతాయి.

- నెక్కల అప్పారావు, రామలింగపురం, కొత్తవలస మండలం

Updated Date - Apr 09 , 2026 | 12:37 AM