Share News

ఉన్నది 16 రోజులే!

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:57 PM

ఈ ఆర్థిక సంవత్సరంలో రాజాం నియోజకవర్గానికి ఉపాధి హామీ పథకం కాంపోనెంట్‌ నిధులు రూ.18.50 కోట్లు అధికారులు కేటాయించారు.

   ఉన్నది 16 రోజులే!
రాజాం మండలంలో ఉపాధి కాంపోనెంట్‌ నిధులతో నిర్మిస్తున్న కాలువ

- ఈలోపు ‘ఉపాధి’ కాంపోనెంట్‌ పనులు పూర్తయ్యేనా?

- ఇప్పటికి సగం కూడా చేపట్టని వైనం

- రూ.80 కోట్ల పనులు పెండింగ్‌

- పూర్తిచేయకుంటే నిధులు మురిగిపోవాల్సిందే

- ఈ ఆర్థిక సంవత్సరంలో రాజాం నియోజకవర్గానికి ఉపాధి హామీ పథకం కాంపోనెంట్‌ నిధులు రూ.18.50 కోట్లు అధికారులు కేటాయించారు. గ్రామాల్లో సీసీ రహదారులు, కాలువల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కానీ, ఈ నెల 1 వరకూ సగం నిధులు మాత్రమే వినియోగించారు. ఇంకా రూ.9 కోట్లకు సంబంధించి పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు 16 రోజులు గడువు మాత్రమే ఉంది. ఈలోగా పనులు పూర్తి చేయకుంటే నిధులు మురిగిపోతాయి.

రాజాం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఈ పరిస్థితి ఒక్క రాజాం నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో దాదాపు రూ.80 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సమయం చూస్తే కేవలం 16 రోజులు మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిధులు వినియోగిస్తే సరి.. లేకుంటే మాత్రం మురిగిపోతాయి. వేతనదారులకు ఉపాధి కల్పించడం ఉపాధి హామీ పథకం లక్ష్యం. మరోవైపు కాంపోనెంట్‌ నిధుల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి. ముఖ్యంగా సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టాలి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య దాదాపు రూ.1,062 కోట్లు నిధులు మురిగిపోయాయి. గత ఏడాది జిల్లాలో రూ.100 కోట్లు వినియోగించకపోవడంతో అవి కూడా మరుగునపడిపోయాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం 50 శాతం పనులు పూర్తిచేయడం కష్టమేనని తెలుస్తోంది.

మౌలిక వసతులకు ప్రాధాన్యం..

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్‌శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పల్లెపండుగ పేరుతో భారీ స్థాయిలో సీసీ రహదారులు, కాలువల నిర్మాణం చేపడుతూ వస్తోంది. అయితే అధికారులు ఉదాసీనత పుణ్యమా అని పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో నిధులు మరుగునపడే అవకాశం ఉంది. ఎస్‌.కోట నియోజకవర్గంలో రూ.45.07 కోట్లు ఖర్చుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకూ రూ.28.75 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఇంకా రూ.16.32 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. విజయనగరంలో రూ.3.99 కోట్లకుగాను రూ.1.20 కోట్లు ఖర్చుచేశారు. ఇంకా రూ.2.79 కోట్లు ఉన్నాయి. బొబ్బిలిలో రూ.24.26 కోట్లకుగాను రూ.11.69 కోట్లు ఖర్చు చేయగా ఇంకా రూ.11.69 కోట్లు మిగిలి ఉన్నాయి. చీపురుపల్లిలో రూ.23.37 కోట్లకుగాను రూ.8.82 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా రూ.14.45 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. గజపతినగరంలో రూ.29.98 కోట్లకుగాను రూ.12.24 కోట్లు ఖర్చుచేశారు. రూ.17.74 కోట్లు మిగిలి ఉన్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో రూ.5.18 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. రూ.3.07 కోట్లు ఖర్చుచేశారు. ఇంకా రూ.2.11 కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంది. ఈ నిధులను ఉపయోగించేందుకు 16 రోజులు మాత్రమే ఉంది. ఇంతలో పనులు పూర్తిచేయడం సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

పనులు పూర్తి చేయాలి

జిల్లాలో మంజూరైన ఉపాధి కాంపోంనెంట్‌ పనులను తక్షణమే పూర్తిచేయాలి. నిధుల ఖర్చు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. మండలాల వారిగా కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలి.

-రామసుందర్‌రెడ్డి, కలెక్టర్‌, విజయనగరం

త్వరగా పూర్తిచేస్తాం

వీలైనంత త్వరగా ఉపాధి హామీ కాంపోనెంట్‌కు సంబంధించి పనులు పూర్తిచేస్తాం. ఈ నెలాఖరులోగా పనులు పూర్తిచేస్తామన్న నమ్మకం ఉంది. ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయి. నిధులు మరుగునపడకుండా చర్యలు తీసుకుంటాం.

-వి.శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఎంపీడీవో, రాజాం

Updated Date - Mar 14 , 2026 | 11:57 PM