షట్టర్లూ లేవు... లస్కర్లూ లేరు
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:14 AM
తోటపల్లి ప్రాజెక్టు పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ కలగానే మిగిలింది.
- అధ్వానంగా తోటపల్లి కాలువలు
- అలాగే నెట్టుకొస్తున్న వైనం
- రైతులకు తప్పని సాగునీటి ఇబ్బందులు
వీరఘట్టం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ కలగానే మిగిలింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ పనులు పూర్తి కాకపోవడంతో రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చాలాచోట్ల పిల్లకాలువలకు షట్టర్లు లేవు. కొన్నిచోట్ల ఉన్నా అవి దెబ్బతిన్నాయి. అదే కాలువల పర్యవేక్షణకు లస్కర్లు కూడా పూర్తిస్థాయిలో లేరు. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడంలేదు. గత జూన్ నుంచి నవంబరు వరకు సకాలంలో వర్షాలు పడడంతో వరి సాగుకు ఎలాంటి ఆటంకం కలగలేదు. అదే ఏమాత్రం వర్షాభావం ఏర్పడినా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. గతంలో వేసిన ఎస్టిమేషన్ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో అధికారులు వాటిని రద్దు చేశారు. మరలా కొత్తగా అంచనాలు తయారు చేశారు. ఇప్పటికైనా నిధులు కేటాయించి జూన్ నాటికి పిల్ల కాలువలకు షట్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు కాలువలకు మరమ్మతులు చేపడితే రైతులకు నీటి సమస్య లేకుండా ఉంటుంది. అధికారులు మాత్రం అదిగో.. ఇదిగో అంటూ పనులు చేపట్టకుండా ప్రతి సీజన్‌నూ నెట్టుకొస్తున్నారు. కనీసం కాలువల పర్యవేక్షణకు పూర్తిస్థాయిలో లస్కర్లు లేకపోవడంతో ఉన్న కొద్ది మందితో నిర్వహణ చేస్తున్నారు. మండలంలోని నడిమికెల్ల , పెద్దింపేట తదితర గ్రామాల వద్ద పిల్ల కాలువలకు షట్టర్లు లేకపోవడంతో సాగునీరు వృథాగా పోతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేసి కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు పూర్తి చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంపై నీటిపారుదలశాఖ ఏఈ డీవీ రమణను వివరణ కోరగా.. ‘గతంలో తయారు చేసిన పనుల అంచనాలు రద్దయ్యాయి. మరలా కొత్తగా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం.’అని తెలిపారు.