Share News

There are no seeds. how is that?విత్తనాల్లేవ్‌ ఎలా?

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:10 AM

There are no seeds. how is that? జూన్‌ ముగుస్తోంది. ఇంతవరకు ఆకు మడిలో వరి విత్తనాలు చల్లలేదు. జూలైలో సక్రమంగా వర్షాలు పడినా వరి నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనాల కోసం వ్యవసాయ అధికారులను అడిగితే అదిగో, ఇదిగో అంటున్నారు. ఎప్పటికి ఇస్తారో స్పష్టత ఇవ్వడం లేదు. ప్రైవేటు డీలర్లు ఎక్కువ ధర చెబుతున్నారు. రెండు, మూడు రోజులు చూసిన తరువాత వారి వద్దకు వెళ్లడం తప్పదేమో అని జిల్లా సగటు రైతు ఆవేదన చెందుతున్నాడు. వ్యవసాయ శాఖ తీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నాడు.

There are no seeds. how is that?విత్తనాల్లేవ్‌ ఎలా?
ఎల్‌.కోట మండలం కళ్లేపల్లి గ్రామంలో వరి విత్తనాలు నాటేందుకు ట్రాక్టరుతో నారుమడి తయారు చేసుకుంటున్న రైతు

విత్తనాల్లేవ్‌ ఎలా?

ఖరీఫ్‌ సాగులో రైతులకు ప్రారంభమైన కష్టాలు

అరకొరగా సరఫరా చేస్తున్న రైతు సేవా కేంద్రాలు

ప్రైవేటు డీలర్ల వద్దకు పరుగు

రూ.300 వరకు అదనపు ఖర్చుతో విలవిల

వ్యవసాయ శాఖ తీరుపై నిరాశ

జూన్‌ ముగుస్తోంది. ఇంతవరకు ఆకు మడిలో వరి విత్తనాలు చల్లలేదు. జూలైలో సక్రమంగా వర్షాలు పడినా వరి నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనాల కోసం వ్యవసాయ అధికారులను అడిగితే అదిగో, ఇదిగో అంటున్నారు. ఎప్పటికి ఇస్తారో స్పష్టత ఇవ్వడం లేదు. ప్రైవేటు డీలర్లు ఎక్కువ ధర చెబుతున్నారు. రెండు, మూడు రోజులు చూసిన తరువాత వారి వద్దకు వెళ్లడం తప్పదేమో అని జిల్లా సగటు రైతు ఆవేదన చెందుతున్నాడు. వ్యవసాయ శాఖ తీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నాడు.

శృంగవరపుకోట, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

వరి విత్తనాలు వేసేందుకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకొని ఉన్నారు. జిల్లాలోని ఏ గ్రామ పరిధిలో పొలాలు చూసినా దుక్కి దున్నిన వరి నారుమడులు కనిపిస్తున్నాయి. జూన్‌ నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైంది. సాధారణంగా జూన్‌ మధ్యలో వరి విత్తనాలు నాటుతారు. సకాలంలో వర్షాలు పడితే జూలై మధ్య నుంచి వరి నాట్లు పడతాయి. జిల్లా వ్యవసాయ శాఖ ఇందుకు అనుగుణంగా విత్తనాల పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అరకొరగా సరఫరా

రాయితీపై సరఫరా చేసే వరి విత్తనాలు జిల్లాలో సగానిపైగా రైతు సేవా కేంద్రాలకు ఇంతవరకు చేరలేదు. ఎప్పుడు వస్తాయో, సాగు విస్తీర్ణం బట్టి ఒక్కో రైతుకు ఎన్ని బస్తాలిస్తారో (బస్తాకు 30 కేజీలు) వ్యవసాయ అధికారులు చెప్పలేకపోతున్నారు. పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాలకు వరి విత్తనాలు వచ్చాయి. అయితే అర ఎకరా ఉన్న రైతుకు, నాలుగెకరాలున్న రైతుకు ఒకేలా వరి విత్తనాలను సరఫరా చేస్తున్నారు. 30 కేజీల బస్తాతో సరిపెడుతున్నారు. రెండు నుంచి నాలుగు ఎకరాలున్న రైతు మరో బస్తా ఇవ్వండని వేడుకున్నా ఫలితం ఉండడం లేదు. ఇంకో రోజైనా ఇస్తారా అంటే ఉలుకు, పలుకు ఉండడం లేదు. దీంతో అదును దాటిపోతుందన్న భయంతో ప్రైవేటు డీలర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడ రూ.300 వరకు అదనంగా ఖర్చుపెట్టాల్సి రావడంతో విలవిలలాడుతున్నారు.

సన్నద్ధంగా ఉన్నామని చెప్పి..

జిల్లాలో అన్ని రకాల వరి విత్తనాలను కలుపుకొని 41,810 క్వింటాళ్లు అవసరమని వ్యవసాయాధికారులు ప్రణాళిక తయారు చేశారు. ఇందులో అత్యధికంగా ఎంటీయూ 1121 (శ్రీధృతి) రకం విత్తనం 35,000 క్వింటాళ్లు సరఫరా చేసేందుకు నిర్ణయించారు. రైతులు ఇబ్బందులు పడకుండా వరి విత్తనాలను సరఫరా చేస్తామని జిల్లా సమీక్ష సమావేశంలోనూ ప్రజాప్రతినిధులకు వివరించారు. తీరా ఖరీఫ్‌ సీజన్‌ అదును వచ్చేసమయానికి రైతులకు సరిపడా రాయితీ విత్తనాలను అందించలేకపోతున్న వ్యవసాయ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండలాల వారీగా సరఫరా చేసిన విత్తనాల వివరాలను అందించేవారే కరువయ్యారు. మండల వ్యవసాయ అధికారులు దాటివేత ధోరణిని అవలంభిస్తున్నారు.

అధికారుల తీరుపై అనుమానాలు

ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే వరి విత్తనాల (30కేజీలు) బస్తా ధర రూ.960 నుంచి రూ.990 వరకు ఉంది. ఇవే విత్తనాలు ప్రైవేటు డీలర్ల వద్ద రూ.1200 నుంచి రూ.1300 వరకు అమ్ముతున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేసేలా చేయడానికే వ్యవసాయ అధికారులు అరకొర వరి విత్తనాలు పంపిణీ చేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ కింద రూ.7వేలు రైతుల ఖాతాల్లో వేసింది. చేతిలో డబ్బులు వుండడంతో అదునుకు అనుగుణంగా వరి విత్తనాలు చల్లాలని భావించే రైతులు రాయితీ విత్తనాల కోసం చూడకుండా ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తారని భావించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రైవేటు డీలర్లతో కుమ్మకయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మార్పు మంచిదని..

ఏటా పొలంలో వరి రకం మార్పిడి కోసం ప్రభుత్వం రాయితీ వరి విత్తనాలను రైతులకు అందిస్తోంది. తమకున్న మూడు, నాలుగు ఎకరాల్లో ఓ ఏడాది ఓ రకం వరి పంట పండిస్తే, మరో ఏడాది మరో రకం పండిస్తే దిగుబడులు బాగా వస్తాయని వ్యవసాయ శాఖ రాయితీ విత్తనాలు అందించి ప్రోత్సహిస్తోంది. దీన్నే సాకుగా తీసుకుంటున్న రైతులు విత్తనాలను సొంతంగా తయారు చేసుకోవడం మానేసారు. వ్యవసాయ శాఖ సరఫరా చేసే వరి విత్తనాల కోసం చూస్తుండడంతో ప్రభుత్వానికి భారంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

విత్తనాలు అందలేదు

నాకు ఇంతవరకు వరి విత్తనాలు అందలేదు. రెండు ఎకరాల పొలం ఉంది. నారుమడి తయారు చేసుకొన్నాను. రైతు సేవా కేంద్రానికి వరి విత్తనాలు వచ్చాయని అనడమే కాని సరఫరా చేయడంలేదు. ఈ సమయంలో వరి విత్తనాలు చల్లుకుంటే జూలైలో వర్షం పడిన వెంటనే వరి నాట్లు వేసుకొనేందుకు అనువుగా ఉంటుంది.

కనిశేట్టి వెంకటసత్యం, రైతు, వెంకటరమణపేట, ఎస్‌.కోట మండలం

వ్యాపారుల వద్ద కొంటున్నాం

ప్రభుత్వం రైతులకు సరిపడా వరి విత్తనాలను సరఫరా చేయడం లేదు. ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తోంది. 30 సెంట్ల పొలం వున్న వారికి, మూడు ఎకరాల పొలం వున్నవారికి ఒకేలా... బస్తా వరి విత్తనాలే ఇస్తున్నారు. దీంతో బయట వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

- అప్పలనాయడు (రైతు), అలమండ గ్రామం, జామి మండలం

Updated Date - Jun 30 , 2026 | 12:10 AM