There are no medicines at the main hospital. పెద్దాస్పత్రిలో మందుల్లేవ్
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:43 PM
There are no medicines at the main hospital. ఒకప్పటి ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఆరోగ్యపరంగా ఊపిరిపోసే మహారాజా సర్వజన ఆసుపత్రి నేడు ఔషధాలు అందించలేక ఆపసోపాలు పడుతోంది. జిల్లా నలుమూలల నుంచి వివిధ అనారోగ్య సమస్యలపై వస్తున్నవారు నిరాశతో వెళ్తున్నారు.
పెద్దాస్పత్రిలో మందుల్లేవ్
వైద్యులు రాసిన చీటీలో కొన్నే పంపిణీ
బయట దొరుకుతాయని సలహా
ఇబ్బంది పడుతున్న పేదలు
నెలలుగా ఇదే పరిస్థితి
అత్యవసరమైతే ఏంటి సంగతని ప్రశ్నిస్తున్న రోగులు
విజయనగరం/రింగురోడ్డు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి):
ఒకప్పటి ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఆరోగ్యపరంగా ఊపిరిపోసే మహారాజా సర్వజన ఆసుపత్రి నేడు ఔషధాలు అందించలేక ఆపసోపాలు పడుతోంది. జిల్లా నలుమూలల నుంచి వివిధ అనారోగ్య సమస్యలపై వస్తున్నవారు నిరాశతో వెళ్తున్నారు. వైద్యులు రాసే మందులను అరకొరగా ఇస్తుండడంతో బయట కొనుక్కుంటున్నారు. ప్రతిరోజూ 1000-1200 మంది వరకు ఓపీ నమోదవుతుంటుంది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల నుంచి రిఫర్ చేయగా వచ్చిన రోగులతో పాటు పెద్దాస్పత్రిపై నమ్మకంతో చాలా మంది వస్తుంటారు. కానీ మందులు అందుకోక అసంతృప్తితో తిరుగుముఖం పడుతున్నారు.
మహారాజా జిల్లా సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలపరంగా అవసరమైన వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఒక్క హృదయ(గుండె) సంబంధిత వైద్యం తప్ప మిగిలిన అన్నిరకాల అత్యవసర వైద్యం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటోంది. ప్రతిరోజూ వందలాది మంది న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఎముకలు, శ్వాస కోశ, నేత్ర, చర్మ వ్యాధుల సమస్యలతో వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. వైద్యులు వ్యాధి స్థాయిని అంచనా వేసి అవసరమైతే ఇన్ పేషెంట్‌గా చేర్చుతారు. లేదంటే మందులు రాసి ఇంటికి పంపించడం సహజం. అయితే వైద్య సేవల పరంగా సంతృప్తి చెందుతున్న రోగులు మందులు(ఔషదాలు) విషయమై నిరాశ పడుతున్నారు. అవసరమైన మందులు అందుబాటులో లేక చేతి డబ్బులు పెట్టుకుంటున్నారు. గ్రామీణ, పల్లె ప్రాంతాలనుంచి వచ్చిన అధిక శాతం మంది ఇక్కడ ఉచితంగా నాణ్యమైన మందులు సరఫరా చేస్తారన్న నమ్మకంతో ఉంటారు. తీరా మందుల కొరత అని తెలిసి నిర్ఘాంతపోతున్నారు. చేసేది లేక ప్రైవేటు మందుల దుకాణంలో కొనుగోలు చేసి ఇంటిముఖం పడుతున్నారు.
అత్యవసర మందులైతే...అంతే సంగతి
ఇక్కడ సాధారణ వైద్య సేవలకు మాత్రమే మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన, అతి ముఖ్యమైన వైద్యసేవలకు అవసరమైన మందులేవీ అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. వీటిని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత ఉన్నవారు కొనుగోలు చేస్తున్నారు. లేనివారు నిట్టూర్పుతో ఉన్న వాటినే వినియోగించుకొని ఇంటిముఖం పడుతున్నారు.
ఇవీ కొరత...
- గుండె, రక్తపోటుకు సంబంధించిన ఆమ్‌లోడిపైన్, అటెనోలోల్, నైఫెడిఫైన్ వంటి మాత్రలతో పాటు గుండెపోటు సమయంలో రక్తం గడ్డ కట్టకుండా వాడే అత్యవసర స్ర్టెప్టోకైనేజ్ ఇంజెక్షన్‌లు అందుబాటులో లేవు.
- న్యూరాలజీ, సైకియాట్రిక్ విభాగానికి సంబందించి మానసిక ఒత్తిడి, ఫిట్స్ నివారణకు వాడే లిథియం కార్బొనేట్, రెస్పిరిడోన్, ఫినోబార్బిటోన్, పార్కిన్సన్ వ్యాధికిచ్చే లెవోడోపా-కార్బిడోపా మందులు లభించడంలేదు.
- అమోక్సిక్లావ్ లాంటి యాంటీ బయోటిక్స్, లైన్‌జోలిడ్ ఇంజక్షన్లు ఇన్‌ఫెక్షన్ తగ్గించే పర్మిథ్రిన్, బీ-కాంప్లెక్స్ మాత్రలు కూడా నిండుకున్నాయి.
- ఆపరేషన్ థియేటర్‌లో వాడే అనస్థీషియా, నొప్పి నివారణ మందులైన ఫెంటానిల్, థియోఫెంటాన్, కండరాల నొప్పులకు బ్యాక్లోఫెన్, ఎముకల సాంధ్రత పెంచే జోలెండ్రోనిక్ ఏసిడ్ ఇంజక్షన్లు నిల్వలు లేవు. పెద్దలలో వచ్చే విరోచనాల నివారణకు వాడే రేస్‌కాడోట్రిల్ కూడా అందుబాటులో లేవు.
శస్త్రచికిత్సల సంగతేంటి...?
శస్త్ర చికిత్సలకు వాడే సాధారణ క్లినికల్ గ్లవ్స్, ఈటీ ట్యూబులు, లోప్రెజర్ ఎక్స్‌టెన్షన్ ట్యూబ్‌లను కూడా రోగుల బంధువులే బయటకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
అందుబాటులో ఔషధాలు
అత్యవసర విభాగాల్లో ప్రాణ రక్షణకు కావాల్సిన ఔషధాలు అందుబాటులోనే ఉన్నాయి. కొన్ని రకాల మందుల కొరత ఏర్పడినపుడు రోగులకు ఇబ్బంది కలగకుండా లోకల్ పర్చేజ్ ద్వారా కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నాం. త్వరలోనే తగినన్ని ఔషధ నిల్వలు వచ్చేలా ఉన్నతాధికారులకు నివేదించాం.
- డా.అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ