There are low buses.. బస్సులు చాలట్లే..
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:55 PM
There are low buses.. సంక్రాంతి సమీపిస్తుండడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కోలాహలంగా మారింది. దాదాపు బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. స్త్రీశక్తి పథకంతో బస్సుల్లో ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) పెరిగినప్పటికీ బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
బస్సులు చాలట్లే..
సంక్రాంతికి సొంతూరు వస్తున్న జిల్లా వాసులు
రద్దీకి అనుగుణంగా బస్సులు కేటాయించని ఆర్టీసీ అధికారులు
స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన ఓఆర్
సంక్రాంతి సమీపిస్తుండడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కోలాహలంగా మారింది. దాదాపు బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. స్త్రీశక్తి పథకంతో బస్సుల్లో ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) పెరిగినప్పటికీ బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. స్టేజ్‌లో బస్సు పెట్టిన కొద్ది సెకెన్లలోనే నిండిపోతోంది. గతంలో ఆర్టీసీకి ఓఆర్ 30 నుంచి 40 శాతం మధ్య ఉండేది. ప్రభుత్వ పుణ్యమా అని స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఓఆర్ అమాంతం పెరిగిపోయింది. 100 శాతం ఓఆర్ పెరిగినా బస్సులు మాత్రం అవే.
విజయనగరం రింగురోడ్డు, జనవరి 10(ఆంధ్రజ్యోతి):
విజయనగరంలో ఏడాదిలో రెండు పర్యాయాలు ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతుంటాయి. పైడిమాంబ జాతర, సంక్రాంతి వేళ ఆర్టీసీకి కాసుల కొరత ఉండదు. ఇబ్బడిముబ్బుడిగా ఆదాయం వస్తుంది. ఇక సాధారణ రోజుల్లో మామూలుగానే ఉండేవి. స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో రద్దీ పెరిగి ఇబ్బందులూ తలెత్తుతున్నాయి. అసలే సంక్రాంతి కావడంతో దాదాపు బస్సులన్నీ ఫుల్ అయిపోతున్నాయి. చాలా మంది కూర్చొనేందుకు సీటు లేక నిల్చొని ఉంటున్నారు.
విజయనగరం డిపో పరిధిలో పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఆలా్ట్ర డీలక్స్‌తో కలిపి మొత్తం 80 వరకూ బస్సులు ఉండగా శృంగవరపుకోట డిపో విషయానికి వస్తే 44 బస్సులే ఉన్నాయి. పెరిగిన ఓఆర్ దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం విజయనగరం, శృంగవరపుకోటకి సంబంధించి మరో 30 బస్సులు అదనంగా ఉంటే తప్ప రద్దీ తగ్గే అవకాశం లేదు. ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఈ విషయమై ప్రతిపాదనలు పంపినా అక్కడి నుంచి ఎటువంటి సమాచారం లేదు. దీంతో ఉన్న బస్సులతోటే నెట్టుకొస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రయాణికులు గంటల తరబడి ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో వేచి ఉంటున్నారు. విద్యార్థులైతే గమ్యస్థానాలకు చేరేందుకు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైనా ప్రత్యామ్నాయం లేకపోవడంతో సాహసం చేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా ప్రజారవాణాధికారి జి.వరలక్ష్మి వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావించగా కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామని, రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న బస్సులతోటే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.