Share News

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:28 PM

: సుమారు 23 సంవత్సరాల కిందట తండ్రి న్యాయాధికారిగా ఎంపిక కాగా, ఇప్పుడు కుమారుడు న్యాయాధికారిగా ఎంపికయ్యా రు. గ

 అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు
సూర్య హేమంత్‌

-న్యాయాధికారులుగా ఎంపిక

-జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి

పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన సూర్యహేమంత్‌

కొత్తవలస, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): సుమారు 23 సంవత్సరాల కిందట తండ్రి న్యాయాధికారిగా ఎంపిక కాగా, ఇప్పుడు కుమారుడు న్యాయాధికారిగా ఎంపికయ్యా రు. గత సంవత్సరం జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో రాష్ట్ర స్థాయిలో కుమారుడు అత్యధిక మార్కులు సాధించారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. లక్కవరపుకోట మండలం మార్లాపల్లి గ్రామానికి చెందిన లగిశెట్టి వెంకటేశ్వరరావు, సూర్యహేమంత్‌ తండ్రీకుమారులు. వెంకటేశ్వరరావు 1995 నుంచి 2002 వరకు కొత్తవలస కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. అప్పటిలో జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి పరీక్షకు హాజరై న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. తరువాత కాలంలో పదోన్నతులు పొంది ప్రస్తుతం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రిలోని అదనపు జిల్లా న్యాయాధికారి హోదా కలిగిన ఏసీబీ కోర్టు న్యాయాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వరరావు కుమారుడు సూర్యహేమంత్‌ కొత్తవలసలోనే ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివారు. విశాఖపట్నంలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన తరువాత అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ లా యూనివర్సిటీలో చదివారు. అక్కడ న్యాయ శాస్త్రంలో పట్టా తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌ 11, 12 తేదీల్లో జూనియర్‌ సివిల్‌ నాయాధికారి పోస్టులకు జరిగిన రాత పరీక్షలకు సూర్యహేమంత్‌ హజరయ్యారు. ఈ ఫలితాలు ఈ నెల 2న విడుదలయ్యాయి. ఇందులో సూర్యహేమంత్‌ అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచారు. త్వరలో జరగనున్న మౌఖిక పరీక్షకు హాజరైన తరువాత జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారిగా నియామకం కానున్నారు. దీంతో కొత్తవలస న్యాయవాద సంఘం సభ్యులతో పాటు ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:28 PM