Their target is gold! వారి టార్గెట్.. బంగారమే!
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:25 PM
Their target is gold! బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. సామాన్యులకు అందనంతగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే దొంగల దృష్టి బంగారంపైనే పడినట్లు ఉంది. ఇటీవల జరిగిన చోరీ ఘటనలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఇంటి యజమానులు లేని సమయాన్ని చూసి దొంగలు రెక్కీ నిర్వహిస్తున్నారు. పక్కా ప్లానింగ్‌తో పని కానిచ్చేస్తున్నారు. ‘
వారి టార్గెట్.. బంగారమే!
జిల్లాలో వరుసగా దొంగతనాలు
పసిడి ఆభరణాలే ఎక్కువగా చోరీ
భారీగా పెరిగిన ధరలే కారణమా?
అప్రమత్తంగా ఉండకపోతే మూల్యం
సవాల్ విసురుతున్న దొంగలు
- గత నెల30న వేపాడ మండలం బొద్దాంలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే ఎవరూ ఇంట్లో లేని సమయం చూసి చొరబడి 36 తులాల బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. కుటుంబీకులు జనపరెడ్డి వెంకటరమణ, ముత్యాలమ్మ దంపతులు ఆ సమయంలో పొలానికి వెళ్లారు. ఇంతలోనే ఇంట్లో దొంగలుపడి దోచుకుపోయారు.
- ఈ నెల 1న రాజాం పట్టణంలో భారీ చోరీ జరిగింది. రెండిళ్లలో చొరబడిన అగంతకులు కిలోన్నర బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. జీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో డాక్టర్ నగేష్ ఇంట్లో చొరబడి 1250 గ్రాముల బంగారాన్ని పట్టుకుపోయారు. అక్కడకు కూతవేటు దూరంలోని ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ఇంట్లోనూ దొంగతనం జరిగింది. 20 కిలోల బంగారాన్ని కాజేశారు.
- గత ఏడాది మేలో కొత్తవలసలోని మంగళంపాలెంలో భారీ చోరీ జరిగింది. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రాపర్తి జగదీష్ బాబు ఇంట్లో జరిగిన చోరీలో 90 తులాల బంగారంతో పాటు రూ.4 లక్షల చోరీ జరిగింది. ఇది అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఆ ఘటన మరువక ముందే కొత్తవలసలోనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చొరబడి 5 తులాల బంగారం దోచుకుపోయారు.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. సామాన్యులకు అందనంతగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే దొంగల దృష్టి బంగారంపైనే పడినట్లు ఉంది. ఇటీవల జరిగిన చోరీ ఘటనలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఇంటి యజమానులు లేని సమయాన్ని చూసి దొంగలు రెక్కీ నిర్వహిస్తున్నారు. పక్కా ప్లానింగ్‌తో పని కానిచ్చేస్తున్నారు. ‘పట్టుకోండి చూద్దాం’ అన్నట్లుగా పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
విజయనగరం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఫంక్షన్‌కు వెళ్తున్నారా? పెళ్లికి బయలుదేరారా? అయితే బంగారం జాగ్రత్త సుమా.. అని చెప్పాల్సిన రోజులొచ్చాయి. గతంలో నగదు కోసం ఎక్కువ దొంగతనాలు జరిగేవి. ఇప్పుడు బంగారాన్నే టార్గెట్ చేస్తున్నారు. ఈ నెల 1న రాజాంలో జరిగిన దొంగతనాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డారు. బంగారం ధర అనూహ్యంగా పెరుగుతోంది. 11.6 గ్రాముల బంగారం (అంటే తులం) సుమారు రూ.2 లక్షలు దాటింది. దీనిని చోరులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఎవరింట్లో బంగారం ఉందో కనిపెట్టి దొంగతనానికి వ్యూహం పన్నుతున్నారు. మున్ముందు ఇటువంటి దొంగతనాలు పెరుగుతాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా బంగారాన్ని ఎక్కువగా ఇళ్లలోనే దాచుకుంటారు. బ్యాంకు లాకర్లలో ఉంచేది చాలా తక్కువ. ఎక్కువ మంది బంగారు ఆభరణాలు వేసుకొని వెళ్లడానికి భయపడతారు. ఎక్కడైనా పడిపోతాయేమోనని, మరిచిపోతామేమోనని భావిస్తారు. రకరకాల అనుమానాలతో ఇళ్ల వద్దే ఉంచుతున్నారు. దీనిని గ్రహిస్తున్న చోరులు సమయం చూసి చొరబడుతున్నారు.
లాకర్ల వినియోగం అంతంతే..
ప్రతి బ్యాంకు శాఖకు వేలల్లోనే ఖాతాదారులుంటారు. అందులో పదుల సంఖ్యలో లాకర్ల అకౌంట్లు తెరుస్తారు. గతంలో బంధువులు, సమీప కుటుంబ సభ్యుల వద్ద సైతం బంగారు ఆభరణాలు దాచుకునేవారు. వారు శుభకార్యాలకు అడిగేటప్పుడు ఇచ్చిపుచ్చుకునేవారు. ఇప్పుడు బంగారం ధర పెరగడంతో అవి కూడా నిలిచిపోయాయి. అయితే కొందరు ఇళ్లల్లో రహస్య ప్రాంతాల్లో బంగారు ఆభరణాలు పెట్టామని భావిస్తున్నారు కానీ దొంగలు నగలు ఎక్కడున్నా హస్త లాఘవం ప్రదర్శిస్తున్నారు.
పోలీస్ శాఖలో సిబ్బంది కొరత..
వరుసగా జరుగుతున్న బంగారం దొంగతనాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. ఇప్పటివరకూ సాధారణ చోరీలే జరిగాయి. ఇప్పడు బంగారం భారీ స్థాయిలో దోపిడీలు జరుగుతుండడంతో పోలీస్ శాఖకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. జిల్లాలో పోలీస్ శాఖకు సిబ్బంది కొరత ఉంది. నేర నియంత్రణ కష్టసాధ్యమవుతోంది. ఇటువంటి సమయంలో బంగారం దొంగతనాలు సవాల్ విసురుతున్నాయి. జిల్లాలో 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. 10 సర్కిళ్ల పరిధిలో 41 పోలీస్‌స్టేషన్లు కొనసాగుతున్నాయి. అయితే సిబ్బందిని పెంచడంతో పాటు బంగారం దొంగతనాల విషయంలో ప్రజల్లో అవగాహన పెంచితే మంచిది. బంగారం దాచుకునేందుకు బ్యాంకుల్లో లాకర్ సదుపాయం ఉంది. ఆపై బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించడం అవసరం.
నిఘా పెంచాం
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచాం. దొంగతనాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాల కదలికలను ఆరా తీస్తున్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు లాకర్ల సేవలను వినియోగించుకోవాలి. ఇంటికి తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లేవారు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి. ఇంట్లో అంత బంగారం ఉంచటం మంచిది కాదు.
- ఏఆర్ దామోదర్, ఎస్పీ, విజయనగరం