Share News

their deceptions stop till now వారి మోసాలు సాగవిక

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:53 PM

their deceptions stop till now సైబర్‌ నేరాలు, మోసాలకు సామాన్యులే కాదు విద్యావంతులు, ఉన్నత వర్గాల వారు బాధితులవుతున్నారు. రోజురోజుకూ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాకు ఒక సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్‌లో ప్రకటించింది.

their deceptions stop till now వారి మోసాలు సాగవిక

వారి మోసాలు సాగవిక

జిల్లాలో ప్రత్యేకంగా సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌

బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ప్రభుత్వం

పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాల కట్టడే లక్ష్యం

రాజాం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి)

సైబర్‌ నేరాలు, మోసాలకు సామాన్యులే కాదు విద్యావంతులు, ఉన్నత వర్గాల వారు బాధితులవుతున్నారు. రోజురోజుకూ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాకు ఒక సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్‌లో ప్రకటించింది.

జిల్లాలో కొత్త తరహాలో మోసాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ నేరగాళ్ల ఆగడాలు ఎప్పటికప్పుడే వెలుగుచూస్తున్నాయి. భయపెట్టి లేదంటే ఆకర్షించే వ్యూహాలు పన్నుతూ ప్రలోభాలకు దిగుతున్నారు. లైంగిక ఆరోపణలు, మానవ అక్రమ రవాణా, ఆన్‌లైన్‌ కేసులు, డిజిటల్‌ అరెస్టు పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను భయపెడుతున్నారు. ఏదో చోట ఈతరహా నేరాలు వెలుగు చూస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్లకు ఏమాత్రం అవకాశం దొరికినా ఖాతాలను ఖాళీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. నాలుగు రోజుల కిందట జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, నారాయణం గ్రూప్‌ అధినేత నారాయణం శ్రీనివాస్‌ సైబర్‌ నేరగాళ్ల బారిన పడి రూ.27 లక్షలు పోగొట్టుకున్నారు.

రూ.కోట్లలో కొల్లగొడుతూ..

గడిచిన మూడేళ్లలో సైబర్‌ నేరాలతో దాదాపు రూ.10 కోట్ల వరకూ కొల్లగొట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల స్మార్ట్‌ ఫోన్ల వినియోగం అధికమైంది. వీటిని ఆసరాగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించి జిల్లాలో 2023లో 108 కేసులు నమోదుకాగా రూ.4.19 కోట్లు కోల్పోయారు. కానీ అందులో ఫ్రీజింగ్‌ చేసింది కేవలం రూ.11 లక్షలు మాత్రమే.. 2024లో 107 కేసులకుగాను.. కోల్పోయిన నగదు రూ.6.65 కోట్లుకాగా ఫ్రీజింగ్‌ చేసింది కేవలం రూ.88 లక్షలు మాత్రమే. అయితే 2025లో కొంత వరకూ తగ్గుముఖం పట్టాయి. 50 వరకూ నమోదయ్యాయి. ఇప్పటివరకూ శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు ఉండగా.. ఇప్పుడు సైబర్‌ నేరాలకు ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకానుండడం శుభ పరిణామం.

ఫేస్‌ బుక్‌ అకౌంట్స్‌ హ్యాక్‌

జిల్లాలో చాలామంది ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌ అవుతున్నాయి. కొందరే గుర్తించగలుగు తున్నారు. ‘మిత్రులారా నా ఫేస్‌బుక్‌ హ్యాక్‌ అయ్యింది. నా పేరిట ఎవరో నగదు అడుగుతున్నారు. దయచేసి ఎవరూ నగదు పంపించకండి’ అంటూ వాట్సాప్‌ గ్రూపులు, స్టేటస్‌లో పెట్టుకోవాల్సి రావడం నిత్యకృత్యమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ కొందరు సైబర్‌ నేరగాళ్లు సరికొత్తగా సవాల్‌ విసురుతున్నారు. వారు వీరూ అన్న తేడా లేదు. పోలీస్‌ అధికారులు మొదలు వ్యాపారులు, ఉద్యోగులు, అన్నివర్గాల ప్రజలపై గురిపెడుతున్నారు. సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్టు పెడుతుండేవారి ఖాతాలను అంతగా హ్యాక్‌ చేయడం లేదు. యాక్టివ్‌ లేని వారిపైనే గురిపెడుతున్నారు. వీరైతే ఎప్పుడో ఒక ఫొటో పెట్టి వదిలేస్తుంటారు. వారి అకౌంట్‌ను హ్యాక్‌చేసినా వారు చూసేసరికి చాలా సమయం పడుతుంది. అందుకే ఇటువంటి వారి ఖాతాలనే సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్నేహితులకు నగదు అడగడం, వారు వెనువెంటనే అకౌంట్‌లో జమచేయడం, తరువాత బాధితుడికి తెలిసినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లడం ఇటీవల పరిపాటిగా మారింది. అయితే సైబర్‌ నేరాలకు చెక్‌ చెప్పే విధంగా సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ రానుండడం మాత్రం శుభవార్తే.

మంచి పరిణామం..

సైబర్‌ నేరాలు పెరుగుతుండడంతో ప్రభుత్వం వాటి కట్టడిపై దృష్టిపెట్టింది. అందుకే జిల్లాలో ప్రత్యేక సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చింది. సైబర్‌ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రతీ మెసేజ్‌ను క్షుణ్ణంగా చదవాలి. అవతలి వ్యక్తి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని స్పందించాలి. ఇటీవల సైబర్‌ నేరాలు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం అయినా మోసాలు పెరుగుతున్నాయి. నియంత్రించడానికి పోలీస్‌ శాఖ చర్యలు చేపడుతోంది.

- కె.అశోక్‌కుమార్‌, సీఐ, రాజాం

-------------

Updated Date - Feb 18 , 2026 | 11:53 PM