Share News

విలాసాల కోసం చోరీలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:39 AM

విలాసాలకు అలవాటు పడి... దొంగతనాలను వృత్తిగా చేసుకున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

విలాసాల కోసం చోరీలు

  • దొంగతనం కేసుల్లో నిందితుడి అరెస్టు

  • 110కి పైగా కేసులు ఉన్నట్టు పోలీసుల వెల్లడి

  • రూ.41.50 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): విలాసాలకు అలవాటు పడి... దొంగతనాలను వృత్తిగా చేసుకున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడిని అరెస్టు చేసి.. సుమారు 26.5 తులాల (సుమారు 300 గ్రాములు) బంగారు ఆభరణాలు, 1.29 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌.వివేకానంద తెలిపారు. వీటి విలువ సుమారు రూ.41.50 లక్షలు ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... జి.సిగడాం పోలీసు స్టేషన్‌లో నమోదైన క్రైం నెంబర్‌ 65/2026 కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని ఈ నెల 24న నిడిమివలస జంక్షన్‌ వద్ద అరెస్టు చేశారు. నిందితుడిని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయ పాల వలసకు చెందిన వున్నాన రాంబాబు అలియాస్‌ నిహాన్‌(30)గా గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు విజయవాడలో నివాసం ఉంటున్నట్టు తెలిపారు. నిందితుడు జి.సిగడాం, జేఆర్‌పురం, కోటబొమ్మాళి, సారవకోట, నరసన్నపేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అనేక దొంగతనాలకు పాల్పడినట్టు కేసులు నమోదయ్యా యని... శ్రీకాకుళం జిల్లాలో పది చోరీ కేసులు ఉన్నాయని చెప్పారు. విజయనగరం జిల్లాలోని ఒక పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులోనూ ఉన్నట్టు వెల్లడైందని చెప్పారు. పగటి పూట తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీ చేసేవాడ ని పోలీసులు తెలిపారు. ఆ ఆభరణాలను బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టు పెట్టి నగదు పొందేవాడన్నారు. ఆ నగదును వ్యక్తిగత విలాసాలతో పాటు క్రికెట్‌ బెట్టింగ్‌కు వినియోగించేవాడని దర్యాప్తులో వెల్లడైందన్నారు. నిందితుడిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 110కిపైగా దొంగతనం కేసులు నమోదైనట్టు వెల్లడించారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ సి.హెచ్‌.వివే కానంద పర్యవేక్షణలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, జి.సిగడాం ఎస్‌ఐ అప్పల సూరి, సిబ్బంది సమన్వయంతో కేసులను చేధించినట్టు తెలిపారు. కేసుల చేధన లో ప్రతిభ చూపిన సీఐ అవతారం, ఎస్‌ఐలు అప్పలసూరి, గౌరీశంకర్‌, పీసీలు ఆర్‌.మురళి, పి.హేమంత్‌కుమార్‌, ఎస్‌.రవికుమార్‌, కె.లక్ష్మణరావులను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు.

Updated Date - Sep 26 , 2026 | 12:39 AM