జీతాలు చాలక దొంగతనం
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:59 PM
వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో పాటు జీతాలు సరిపోకపో వడంతో ఓ ఇంట్లో దొంగతనం చేశారు.
- బాలకవివలస చోరీ కేసులో దంపతుల అరెస్టు
- భువనేశ్వర్‌లో పట్టుకున్న రేగిడి పోలీసులు
రాజాం రూరల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో పాటు జీతాలు సరిపోకపో వడంతో ఓ ఇంట్లో దొంగతనం చేశారు. అనంతరం పలు ప్రాంతాలకు మకాం మారుస్తూ చివరికి భువనేశ్వర్‌లో రేగిడి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసు వివరాలను రాజాం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ ఉపేంద్రరావు విలేకరులకు వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన దుడ్ల బాలాజీ గతేడాది ప్రారంభంలో ఉపాధికోసం రాజాం వచ్చి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అప్పటికే అదే సంస్థలో పనిచేస్తున్న రేగిడి మండలం బాలకవివలస గ్రామానికి చెందిన డోల గాయత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ బాలకవివలసలోనే నివాసం ఉంటున్నారు. వారిద్దరి జీవితంలో ఆర్థికసమస్యలు ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. వాటిని అధిగమించేందుకు వారిద్దరికొచ్చే జీతాలు సరిపడని పరిస్థితి. దీంతో అదేగ్రామంలో ఉంటున్న కిలారి కమల ఇంట్లో గతేడాది డిసెంబరు 4న దొంగతనానికి పాల్పడ్డారు. 13 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి బాపట్ల జిల్లా చీరాలలో కొన్ని నగలను, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని ఓ ఫైనాన్స్ సంస్థలో రూ.11 లక్షలకు కుదువపెట్టారు. రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకూ అప్పులు తీరారు. మిగిలిన డబ్బుతో గ్రామాన్ని విడచిపెట్టారు. ఢిల్లీకి వెళ్లి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ముందుగా హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి గోవాకు వెళ్లి బతికేందుకు మార్గాలు అన్వేషించారు. అనుకున్నది కుదరకపోవడంతో భువనేశ్వర్‌కు మకాం మార్చారు.
ఇలాపట్టుబడ్డారు..
బాధితురాలు కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం రూరల్ సీఐ ఉపేంద్రరావు సూచనల మేరకు రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ సారథ్యంలో క్రైం సిబ్బంది శివారెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి తదితరులు బృందాలుగా ఏర్పడ్డారు. హైదరాబాద్, గోవా, భువనేశ్వర్ ప్రాంతాల్లో బాలాజీ, గాయత్రి కోసం గాలించారు. ఎట్టకేలకు వారి కదలికలను భువనేశ్వర్‌లో గుర్తించారు. ఈ మేరకు అక్కడి పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రాజాం కోర్టులో శుక్రవారం ప్రవేశపెట్టారు. వారి నుంచి రూ.లక్ష నగదు, తన నాలుగు నెలల కొడుకు కోసం కొనుగోలు చేసిన బంగారు చైన్, రెండు మొబైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుదువ పెట్టిన బంగారాన్ని రికవరీ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. వీరిపై గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని, అయితే గాయత్రి తన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో చిన్నపాటి చోరీలకు పాల్పడ్డం, తిరిగి వాటిని ఇచ్చేయం చేసేదని తెలిపారు. కమల ఇంటిలో దొంగతనం జరిగిన తరువాత గాయత్రి, బాలాజీ గ్రామాన్ని విడచి వెళ్లిపోవడంతో వారిపై అనుమానం ఏర్పడిందన్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేసినట్లు సీఐ వివరించారు. చోరీ కేసును ఛేదించిన రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ, క్రైం సిబ్బందిని సీఐ ఉపేంద్రరావు అభినందించారు.