బంగారం షాపులో చోరీ
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:14 AM
స్థానిక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సాయి గణేష్ జూవెలరీ షాపులో శనివారం వేకువజామున చోరీ జరిగింది.
గజపతినగరం, జూలై 11(ఆంధ్రజ్యోతి): స్థానిక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సాయి గణేష్ జూవెలరీ షాపులో శనివారం వేకువజామున చోరీ జరిగింది. ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన బ్రహ్మరెడ్డి గత కొంతకాలంగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న షాపును అద్దెకు తీసుకుని వ్యాపారం సాగి స్తున్నారు. శనివారం వేకువజామున బంగారపు షాపునకు ఆనుకుని ఉన్న బేకరీ షాపులో ముందుగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అనంతరం బేకరీ షాపు నుంచి బంగారు షాపు వెనుక గోడకు మనిషి వెళ్లినంత రంద్రం చేసి చోరీకి పాల్పడ్డారు. ఉదయం బేకరీ షాపు యజమాని షాపు తెరవడానికి వచ్చి చూడగా.. షాపు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అలాగే బంగారుషాపు వెనుక భాగం రంద్రం చేసి ఉండడంతో షాపు యజమానికి సమాచారం అందజేశారు. విజయనగరం నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. షాపులో సుమారు 6 తులాల బంగారం, కొంత వెండి వస్తువులు పోయినట్లు షాపు యజ మాని చెరుకుపల్లి బ్రహ్మరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.