Share News

The Wave That Swallowed మింగేసిన అల

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:36 AM

The Wave That Swallowed అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరిగిన ఆ యువతులు ఏదైనా పని నేర్చుకుని కుటుంబాలకు అండగా నిలవాలనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న నెక్ట్స్‌ ఏరా శిక్షణ సంస్థ గురించి తెలుసుకుని అందులో చేరారు. దసరా పండగకు ఇంటికి కూడా రాలేదు. పండగ రోజున పూజలు చేశాక సహచరులంతా కలిసి ఆటవిడుపు కోసం బీచ్‌కు వెళ్లారు.

The Wave That Swallowed మింగేసిన అల
: పావని (ఫైల్‌ ఫొటో), మాధవి (పైల్‌ఫొటో)

మింగేసిన అల

సముద్ర స్నానానికి వెళ్లి మృత్యుఒడికి చేరిన యువతులు

శ్రీకాకుళం జిల్లా పీజీపేట సముద్రతీరంలో ఘటన

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

రామభద్రపురం, కెంగువలో విషాదం

అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరిగిన ఆ యువతులు ఏదైనా పని నేర్చుకుని కుటుంబాలకు అండగా నిలవాలనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న నెక్ట్స్‌ ఏరా శిక్షణ సంస్థ గురించి తెలుసుకుని అందులో చేరారు. దసరా పండగకు ఇంటికి కూడా రాలేదు. పండగ రోజున పూజలు చేశాక సహచరులంతా కలిసి ఆటవిడుపు కోసం బీచ్‌కు వెళ్లారు. కొద్దిసేపు కేరింతలు కొట్టారు. అంతలో కొందరు ఇంకాస్త లోపలకు వెళ్లారు. అక్కడ లోతు ఎక్కువ ఉంటుందని ఊహించలేకపోయారు. కొద్ది క్షణాల్లోనే రాకాశి అల వచ్చి ముగ్గురిని లాక్కొనిపోయింది. వారిని కాపాడటానికి వెళ్లిన యువకుడి ప్రాణాన్ని కూడా కబళించింది. మృతిచెందిన నలుగురిలో ఇద్దరు జిల్లా యువతులు. రామభద్రపురం ఎగువ హరిజనపేటకు చెందిన పావని (18), గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి చెందిన కొండల మాదవి (19) విషాదాంతమిది.

రామభద్రపురం/ గజపతినగరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి):

శ్రీకాకుళం జిల్లా కేంద్రం సమీపంలోని నెక్ట్స్‌ ఏరా శిక్షణ సంస్థలో ఉంటున్న 25 మంది యువతీ యువకులు దసరా పండగ సందర్భంగా మంగళవారం సంస్థలో పూజలు ముగించుకొని ప్రైవేటు వ్యాన్‌ను అద్దెకు తీసుకొని పీజీపేట సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లారు. బీచ్‌లో కొద్దిసేపు కేరింతలు కొట్టారు. సెల్ఫీలు తీసుకున్నారు. అలా ఆడుకుంటున్న సమయంలో కొందరు ఇంకాస్త లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఓ పెద్ద అల వచ్చి సాలూరు మండలం కొండమామిడిపల్లికి చెందిన మర్రి మహి(18), విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన గొల్లపల్లి పావని (19), గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి చెందిన కొండల మాధవి (19)ని లాక్కొనిపోయింది. సహచరులు మునిగిపోవడాన్ని గమనించిన వీరఘట్టంకు చెందిన బిడ్డిక విక్రమ్‌(25)వారిని రక్షించేందుకు సముద్రంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో మర్రి మహి, గొల్ల పావనిలను ఒడ్డుకు తీసుకొచ్చాడు. అప్పటికే వారు మృతి చెందినట్టు గుర్తించారు. గల్లంతైన మాధవి కోసం విక్రమ్‌ మరోసారి సముద్రంలో వెళ్లి తాను కూడా గల్లంతయ్యాడు. మాధవి, విక్రమ్‌లు అచేతన స్థితిలో బుధవారం కంటపడ్డారు.

- రామభద్రపురం ఎగువ హరిజనపేటకు చెందిన పావని (18) ఇంటర్‌ పూర్తి చేసి నెల రోజుల క్రితమే ప్రైవేటు సంస్థలో చేరి శిక్షణ పొందుతోంది. ఆమె తండ్రి రామారావు పెయింటింగ్‌ పనులు చేస్తున్నాడు. తల్లి గృహిణి. పావనికి మరో ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉండాలని భావించి పావని శిక్షణ తీసుకుంటోంది. అంతలోనే ఆ కుటుంబంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పావని మృతిని వారు జీర్ణించుకోలేకోతున్నారు. తండ్రి రామారావు, తల్లి కృష్ణవేణి, చెల్లెళ్లు ప్రశాంతి, ప్రవళ్లిక గుండెలవిసేలా రోదించారు. ఈమెతోపాటు అదే వీధికి చెందిన నిడగంటి స్వాతి సముద్రం వద్దకు వెళ్లినప్పటికీ అలలు ఎక్కువ వస్తుండడంతో ఆమె ఒడ్డున ఉండిపోయింది.

- గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి చెందిన కొండల మాదవి (19) ఓ వైపు డిప్లొమో చదువుతూ మరోవైపు ఉపాధి కోసం రెండు నెలల క్రితమే సంస్థలో చేరింది. ఆమె తల్లిదండ్రులు పైడిరాజు, లక్ష్మీ కూలి పనులు చేస్తుండగా, మాధవికి ఏడేళ్ల తమ్ముడు ఉన్నాడు. ఏడాది కిందట కెంగువ గ్రామం నుంచి కుటుంబం అంతా విశాఖపట్నం వెళ్లిపోయారు. అక్కడ కూలి పనులు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. మాదవి శ్రీకాకుళంలో శిక్షణ సంస్థలో చేరింది. కుటుంబానికి అండగా ఉంటుందని భావించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

Updated Date - Oct 22 , 2026 | 12:36 AM