పుచ్చకాయలు వచ్చేశాయ్!
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:17 AM
వేసవిలో పుచ్చకాయలు విరివిగా వస్తాయి. కానీ, ఈఏడాది ఫిబ్రవరిలోనే మార్కెట్‌లోకి వచ్చేశాయి.
-సీజన్‌కు ముందే అందుబాటులోకి
- చెన్నై నుంచి దిగుమతి
గజపతినగరం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వేసవిలో పుచ్చకాయలు విరివిగా వస్తాయి. కానీ, ఈఏడాది ఫిబ్రవరిలోనే మార్కెట్‌లోకి వచ్చేశాయి. చలి తీవ్రత తగ్గుముఖం పట్టడం.. ఎండలు కాస్త పెరగడంతో పుచ్చకాయల కొనుగోలుపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. వరి పంట తరువాత జిల్లాలోని పలు మెట్టు ప్రాంతాల్లో అధికంగా పుచ్చకాయలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట మొక్కదశలో ఉంది. పంట చేతికి వచ్చేందుకు ఇంకా రెండు నెలలు సమయం పడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో జిల్లాకు చెందిన వ్యాపారులు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, మన రాష్ట్రంలోని రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి పుచ్చకాయలను దిగుమతి చేసుకుంటున్నారు. టన్ను పుచ్చకాయలను ఇక్కడికి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు రూ.16వేలు కలిపి సుమారు రూ.20వేలకు పైగా అవుతుందని వ్యాపారులు అంటున్నారు. కిలో రూ.30నుంచి రూ.35కి విక్రయిస్తుండగా, సైజును బట్టి ఒక కాయను రూ.50నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. ఎండలు ముదరక ముందే పుచ్చకాయల ధర ఇంత పలుకుతుంటే, రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయోనని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఆరోగ్యానికి మేలు..
పుచ్చకాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఏ, బీ1, బీ6,సీ, పొటాషియం, మెగ్నీషియం, పీచు, కాల్షియం, ఐరన్, లైకోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు తగ్గించడానికి, జీవనక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడుతుంది.
-అనూజ్‌రాయ్, ప్రభుత్వ వైద్యాధికారి, మరుపల్లి