Share News

The water hasn't come yet. ఇంకా నీరు రాలే

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:39 AM

The water hasn't come yet. తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన సాగునీరు నేటికీ చీపురుపల్లి ప్రాంతానికి చేరకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ నెల 2న తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అంతా సవ్యంగా ఉంటే అనుకున్న ప్రకారం చీపురుపల్లి ప్రాంతానికి తోటపల్లి జలాలు ఇరవై రోజుల్లో చేరుకోవాలి. 25 రోజులైనా కాలువలో నీటి జాడ కనుచూపు మేరలో కానరాలేదు. ముఖ్యంగా కుడి ప్రధాన కాలువలో పూడిక తీత పనులు నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.

The water hasn't come yet. ఇంకా నీరు రాలే
నీరు లేక వెలవెలబోతున్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ

ఇంకా నీరు రాలే

మూడు వారాలైనా చీపురుపల్లికి చేరని ‘తోటపల్లి’ జలాలు

సాగునీటి కోసం ఆశగా రైతుల ఎదురుచూపు

కాలువ పూడికతో నిండడమే కారణం

తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన సాగునీరు నేటికీ చీపురుపల్లి ప్రాంతానికి చేరకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ నెల 2న తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అంతా సవ్యంగా ఉంటే అనుకున్న ప్రకారం చీపురుపల్లి ప్రాంతానికి తోటపల్లి జలాలు ఇరవై రోజుల్లో చేరుకోవాలి. 25 రోజులైనా కాలువలో నీటి జాడ కనుచూపు మేరలో కానరాలేదు. ముఖ్యంగా కుడి ప్రధాన కాలువలో పూడిక తీత పనులు నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.

చీపురుపల్లి, జూలై 27(ఆంధ్రజ్యోతి):

కొద్దిరోజులుగా మేఘాలు ఊరిస్తున్నాయే తప్ప ఒక్క చినుకు కూడా రాలడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన వర్షాభావం నెలకొంది. వర్షం కోసం ఇప్పటిదాకా ఆకాశం వైపు ఎదురుచూసిన రైతులు నిరాశతో నిట్టూరుస్తున్నారు. బోరు బావులున్న కొంతమంది, వరి నారు మళ్లకు మోటార్లతో నీరందిస్తున్నారు. మరోవైపు తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా చీపురుపల్లి ప్రాంతానికి సాగునీరు చేరక పోవడం రైతుల్ని మరింత కలచి వేస్తోంది. కాలువలో పూడిక తీత కోసం దాదాపు రూ.20 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. పూడిత తీత పూర్తయిన తరువాతే నీరిస్తారని రైతులు భావించారు. అయితే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో అధికారులు యథావిధిగా నీటిని విడుదల చేశారు.

రిజర్వాయర్‌ నుంచి కాలువ ద్వారా బయటకు నీరు విడుదలైన సుమారు 20 రోజుల్లో వంద కిలోమీటర్లకు చేరుకోవాలి. అయితే కుడి ప్రధాన కాలువలో పొదలు, మొక్కలు పెరిగిపోవడంతో పాటు సిల్ట్‌ పేరుకుపోవడంతో కాలువలో జల ప్రవాహం నత్తనడకన సాగుతోంది. దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప తోటపల్లి నీరు చీపురుపల్లి నియోజవర్గానికి చేరుకోదు. కుడి ప్రధాన కాలువ ఈపాటికే జలాలతో కళకళలాడాల్సి ఉంది. ఇప్పుడున్న కాలువ పరిస్థితి రీత్యా చీపురుపల్లి ప్రాంతానికి నీరు చేరడానికి మరో నాలుగైదు రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వర్షాలు కురవక పొలాల్లోని వరి నారు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇదిలా ఉండగా కుడి ప్రధాన కాలువ కింద నిర్మాణం జరగాల్సిన పిల్ల కాలువల పరిస్థితి కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. అవసరమైన చాలా చోట్ల పిల్ల కాలువల నిర్మాణం జరగకపోగా తవ్వకం పూర్తయిన కొద్ది కాలువలు కూడా పొదలు పెరిగి నీరు పారని పరిస్థితి నెలకొంది. చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కొంత ప్రాంతానికి కుడి ప్రధాన కాలువ ద్వారా నీరందాల్సి ఉంది. నెలాఖరుకు కూడా తోటపల్లి జలాలు ఈ ప్రాంతానికి రాకపోతే నారు మళ్లను ఎలా కాపాడుకోవాలన్న ఆందోళనతో రైతులు సతమతమవుతున్నారు.

కొద్దిరోజుల్లో నీరందుతుంది

కుడి ప్రధాన కాలువలో పూడిక తీతకు అవసరమైన నిధులు విడుదల కాలేదు. సంబంధిత ఏజెన్సీకి చెప్పి అక్కడక్కడ మట్టిని తొలగిస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో కుడి ప్రధాన కాలువ ద్వారా తోటపల్లి జలాలు చీపురుపల్లి ప్రాంతానికి అందుతాయి.

- సుచిత్ర, డీఈ, తోటపల్లి ప్రాజక్టు

Updated Date - Jul 28 , 2026 | 12:39 AM