అంతుచిక్కని ఓటరు నాడి
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:56 PM
“The Voter’s Pulse Remains a Mystery” జిల్లాలోని రెండో విడత పంచాయతీ పోరు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. పల్లెవాసులు ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సర్పంచ్ అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. నిన్నటి వరకు చేతులు ఊపుతూ పలకరించిన నాయకులు శనివారం రహస్యంగా ప్రతి ఇంట గడప తొక్కారు.
ఓటర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు
పాలకొండ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండో విడత పంచాయతీ పోరు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. పల్లెవాసులు ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సర్పంచ్ అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. నిన్నటి వరకు చేతులు ఊపుతూ పలకరించిన నాయకులు శనివారం రహస్యంగా ప్రతి ఇంట గడప తొక్కారు. ప్రచారానికి తెరపడినా ఓటు కోసం తెరవెనుక ప్రయత్నాలకు మాత్రం విరామం ఇవ్వలేదు. వీధి చివర ఓ బృందం, చెట్టునీడన మరో మంతనం.. ఇంటి గుమ్మంలో బుజ్జగిస్తూ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను నేతలు అభ్యర్థించారు.
ఓట్ల లెక్కలు వేసుకుంటూ..
‘ఎన్ని ఓట్లు తమకు అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యర్థి వైపు ఎన్ని మొగ్గుచూపుతున్నాయి. ఎవరు తటస్థంగా ఉన్నారు.. ఎవరిని కలిస్తే పరిస్థితి మారుతుంది..?’ అని అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి చర్చించారు. ఈ లెక్కలన్నీ వేస్తూనే.. గ్రామంలో ప్రతి కుటుంబం, ప్రతివీధి, ప్రతి సామాజికవర్గాన్ని కలిశారు. నిన్నటివరకు ప్రచారంలో కనిపించని కొందరు కీలక వ్యక్తులు సైతం చివరి నిమిషంలో రంగంలోకి దిగారు. ఎన్నికల నేపథ్యంలో పాత పరిచయాలు మళ్లీ చిగురించాయి. ఏళ్లుగా పలకరించుకోని వారు సైతం ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు పక్కనపెట్టి బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఒకే కుటుంబంలో వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఉండడంతో కొన్నిచోట్ల కుటుంబ పెద్ద మాటకు ప్రాధాన్యం పెరిగింది.
ప్రలోభాల పాచికలు...
పోలింగ్ ముందు రోజు గ్రామాల్లో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. హామీలు, బుజ్జగింపులు, తాయిలాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నించారు. వ్యక్తి అవసరాలను ప్రస్తావిస్తూ పలకరింపులు సాగాయి. గతంలో చేసిన సహాయాలను గుర్తు చేస్తూ.. గెలిచిన తర్వాత పనులు చేయిస్తామని మరికొందరు భరోసా ఇచ్చారు. అయితే ఈ మాటలన్నీ ఓట్లుగా మారుతాయా..? చివరి నిమిషంలో ఇచ్చే హామీలకు ఓటర్లు విలువ ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అంచనాలకు రాలేక..
గ్రామీణ ఎన్నికల్లో ఓటరు నాడి పట్టడం అంత సులువు కాదు. అభ్యర్థి ఇంటికి వెళ్లినప్పుడు నవ్వుతూ పలకరిస్తారు. ప్రచారానికి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుతారు. తమకే ఓటు వేస్తామని భరోసా కూడా ఇస్తారు. కానీ పోలింగ్ బూత్‌లోకి వెళ్లాక ఓటరు నిర్ణయం ఏమిటో ఎవరికీ తెలియదు. ఒకరికి మాట ఇచ్చి మరొకరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. అందుకే బయట కనిపించే మద్దతును చూసి అభ్యర్థులు తమ గెలుపుపై అంచనాలకు రాలేకపోతున్నారు.
సొంతగూటికి వలస ఓటర్లు
ఓట్ల పండగ కోసం వలస ఓటర్లు సొంత ఊరు బాట పడుతున్నారు. నియోజకవర్గంలో సుమారు పదివేల మంది వలస కూలీలు పల్లెపోరుకు హాజరవుతున్నట్టు తెలుస్తుంది. అభ్యర్థులు ముందస్తుగానే బస్సులు, రైల్వే టిక్కెట్లను వలస ఓటర్ల కోసం సిద్ధం చేశారు. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉంటున్న నియోజకవర్గ కూలీలు, వేతనదారులు, ఉద్యోగులు గ్రామాలకు తరలివస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రత్యేక బస్సులతో గ్రామాలకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. వారికోసం ప్రత్యేకంగా వంటా వార్పు చేపడుతున్నారు. కాగా పోలింగ్ తర్వాత వలస ఓటర్ల తిరుగు ప్రయాణానికి కూడా అభ్యర్థులు ఏర్పాట్లు పూర్తి చేశారు.